Jun 22 2021 @ 00:14AM

మా నాన్న కంటే కొంచెం చిన్నోడితో బిడ్డను కన్నానా?

కథానాయికగా కంటే ముందు ఉత్తరాది (హిందీ) బుల్లితెర వీక్షకులకు ‘బాలికా వధు’గా, తెలుగు వీక్షకులకు ‘చిన్నారి పెళ్లి కూతురు’గా అవికా గోర్‌ సుపరిచితురాలు. ఆ తర్వాత ‘ససురాల్‌ సిమర్‌ కా’ అని మరో ధారావాహికలో నటించారు. అందులో మనీశ్‌ రాయ్‌సింఘన్‌తో కలిసి పని చేశారు. వీళ్లిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని ముంబైలో గుసగుసలు వినిపించాయి. అంతే కాదు... బిడ్డను కన్నారనే వదంతులు ఉన్నాయి. ముంబై మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో వీటిపై అవికా గోర్‌ స్పందించారు. ఆమెను ‘మనీశ్‌కు, మీకు మధ్య సంబంధం ఉందనే గుసగుస నిజమేనా?’ అని ప్రశ్నించగా... ‘‘నిజం కాదు. అందుకు ఆస్కారమే లేదు. మేం ఓ బిడ్డను రహస్యంగా దాచామనే కథనాలూ చదివా. మనీశ్‌ నాకు సన్నిహితుడు. పదమూడేళ్ల వయసులో నటిగా ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటికీ... అతడు నా స్నేహితుడే. అతడి నుంచి నేనెంతో నేర్చుకున్నాను. వయసులో నాకంటే మనీశ్‌ 18 సంవత్సరాలు పెద్ద. మా మధ్య ఏమైనా జరిగిందేమోనని ఇప్పటికీ నన్ను అడుగుతుంటారు. ఏం చెప్పను? అతను మా నాన్న కంటే కొంచెం చిన్నోడంతే! దాదాపుగా మా నాన్న వయసు’’ అని సమాధానం ఇచ్చారు. ఇంకా అవికా గోర్‌ మాట్లాడుతూ ‘‘మా ఇద్దరి మధ్య సంబంధం ఉందని వార్తలు వచ్చిప్పుడు... తొలినాళ్లలో నాపై ఎంతో ప్రభావం చూపించాయి. రెండు వారాల పాటు మేమిద్దరం మాట్లాడుకోలేదు. మళ్లీ కొత్త కథనాలు వచ్చినప్పుడు దూరంగా ఉండటంలో అర్థం లేదనిపించింది. ఆ తర్వాత మేం వెనక్కి తిరిగి చూసుకోలేదు. మా గురించి రాసిన పాత కథలు చదివి నవ్వుకుంటూ ఉంటాం’’ అన్నారు.