Jun 21 2021 @ 19:49PM

'మా' ఎన్నికల వేడి మొదలైంది!

సెప్టెంబర్‌లో ‘మా’ ఎన్నికలు

మంచు విష్ణు వర్సెస్‌ ప్రకాశ్‌రాజ్‌


ఆరోపణలు... ప్రత్యారోపణలు

నువ్వా? నేనా? అన్నట్లు పోటాపోటీ ప్రచారాలు

చివరి క్షణం వరకూ రకరకాల ట్విస్టులు

మరో పక్క గెలుపు ఎవరిదా అని కోట్లలో బెట్టింగులు

‘మా’కు గిఫ్ట్‌లు తప్ప రిటర్న్‌ గిఫ్టులు ఇచ్చే అలవాటు లేదు.. అనే విమర్శలు!!


2019 మార్చిలో జరిగిన మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు సాగిన తీరు ఇది. అంతకుముందు అంటే  2017లోనూ ఇలాగే హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. 2015లో ‘మా’ రాజేంద్రప్రసాద్‌-జయసుధ మఽధ్య కూడా ఇలాంటి పోటీనే నెలకొంది. ఈ ఏడాది జరగబోయే ఎలక్షన్లు కూడా అంతే ఉత్కంఠగా జరిగేలా కనిపిస్తోంది. ఈసారి విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ‘మా’ ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అయితే హీరో మంచు విష్ణు కూడా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్లు సోమవారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ వార్త బయటకు రాగానే ఎలక్షన్లు రసవత్తరంగా ఉండబోతున్నాయనే చర్చ టాలీవుడ్‌లో మొదలైంది. సెప్టెంబర్‌ నెలలో ఎన్నికలు జరగనున్నాయని తెలుస్తోంది. 


గతంలో ఏం జరిగింది? 

‘మా’ అసోసియేషన్‌ ప్రారంభమైనప్పటి నుంచీ అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భాలే ఎక్కువ. అయితే గత మూడు ఎన్నికలూ పోటాపోటీ, ఆరోపణలు... ప్రత్యారోపణలు నడుమ సాగాయి. 2015లో రాజేంద్రప్రసాద్‌, జయసుధలు అధ్యక్ష పదవికి పోటీపడ్డారు. ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేసే అర్హత మహిళలకు లేదా? అంటూ జయసుధ బరిలో దిగారు. కానీ రాజేంద్రప్రసాద్‌పై ఓడిపోయారు. 2017లో శివాజీరాజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండేళ్ల టర్మ్‌ పూర్తయ్యాక 2019లో వీ.కె.నరేశ్‌, శివాజీరాజా పోటీ పడ్డారు. ఎన్నో వివాదాలు, విమర్శల మధ్య ఎన్నికలు జరిగాయి. శివాజీరాజాపై నరేశ్‌ గెలుపొందారు. ‘మా’లో 745 ఓట్లు ఉండగా 473 ఓట్లు పోల్‌ అయ్యాయి.. ‘మా’ ఎన్నికల చరిత్రలో ఇంతమంది కళాకారులు ఓటు హక్కు వినియోగించుకోవడం అదే తొలిసారి. ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక రెండు ప్యానళ్ల మధ్య గొడవలు సర్దుమణుగుతాయనుకుంటే రోజురోజుకీ పెరగసాగాయి. నరేశ్‌ పని తీరు సరిగా లేదనీ, నిధులను దుర్వినియోగం చేస్తున్నాడనే విమర్శలు తలెత్తాయి. ఇండస్ట్రీ పెద్దలు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించారు. అందరూ కలిసి పని చేసుకోవాలని సూచించారు. ‘మా’లో అవకతవకలు జరిగిన మాట వాస్తవం. అవన్నీ మర్చిపోయి జరిగిన లోపాలను బయటకు రానివ్వకుండా అందరితో కలిసి పనిచేయాలనుకుంటున్నాం’’ అని నరేశ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.  అయితే నెలలు గడిచాక అసోషియేషన్‌ విషయంలో నరేశ్‌ తీరు సరిగా లేదనీ, ఏకాభిప్రాయందో ముందుకెళ్తున్నారని జనరల్‌ సెక్రటరీ జీవిత ఆరోపించారు. దాంతో మళ్లీ వివాదాలు మొదలయ్యాయి. ఒక్కొక్కరూ ప్రెస్‌మీట్లు పెట్టి మరీ ‘మా’ గౌరవాన్ని రోడ్డుకు ఇడ్చారు. ‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో రాజశేఖర్‌ నోరు జారడదంతో క్రమశిక్షణ కమిటీ ఆయనపై చర్యలు తీసుకుంది. దాంతో ఆయన ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి రాజీనామా చేశారు. చిరంజీవి, కృష్ఞంరాజులాంటి గౌరవ సలహాదారులు సలహాలతో మళ్లీ ‘మా’ పట్టాలెక్కింది. లోలోపల అభిప్రామ భేదాలు ఉన్నా కామ్‌గా ఎవరి పని వారు చేసుకుంటున్నారు. 


అద్భుతంగా పని చేయగలడు :  వీ.కె నరేశ్‌
‘‘మంచు విష్ణు పోటీ చేస్తానంటే స్వాగతిస్తాం. ఎందుకంటే.. ఆయనది యువ రక్తం. మంచి చేయాలనే తపన ఉంటుంది. పైగా చిత్ర పరిశ్రమలో పుట్టి పెరిగిన వ్యక్తిగా ఆర్టిస్ట్‌ల కష్టాలు ఎలా ఉంటాయో అవగాహన ఉన్నవాడు. అద్భుతంగా పని చేయగలడని నమ్ముతున్నాం’’ అని ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు వీ.కె నరేశ్‌ చెప్పారు. 


పక్క రాష్ట్ర నటుడి అవసరం లేదు: మాజీ మెంబర్‌

‘మా’ ప్రారంభమైనప్పటి నుంచీ తెలుగు ఆర్టిస్ట్‌లే అధ్యక్ష పదవికి పోటీపడుతూ వచ్చారు. ఇప్పుడు పరభాష నటుడు   ప్రకాశ్‌రాజ్‌ అధ్యక్ష పదవికి పోటీ పడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 1000 మంది సభ్యులున్నా ‘మా’ అసోసియేషన్‌లో పోటీ చేసే దమ్ము తెలుగువారికి లేదా అని గతంలో ‘మా’లో పని చేసిన మెంబర్‌ అన్నారు. ‘మా’ అసోసియేషన్‌ను సమర్ధవంతంగా నడపగలిగే ఆర్టిస్ట్‌లు తెలుగు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని, దాని కోసం పక్క  రాష్ట్రాల ఆర్టిస్టుల అవసరం లేదని, అలాంటి పరిస్థితి ఎదురైతే సోనుసూద్‌కి తమ సపోర్ట్‌ ఉంటుందని ఆ మెంబర్‌ తెలిపారు. ఎలక్షన్లకు ఇంకా వందరోజులు టైమ్‌ ఉందని ఈలోపు చాలా ఈక్వేషన్లు మారతాయని ఆయన చెప్పారు.