Jul 24 2021 @ 22:42PM

‘మా’ ఎన్నికలు సెప్టెంబర్‌లో?

బుధవారం ‘మా’ ఈసీ సమావేశం

ఆగస్టులో ఏజీఎం

ఎన్నికలు సెప్టెంబర్‌లో?

మూవీ ఆర్టిస్స్ట్‌ అసోషియేషన్‌ (మా) ఎన్నికల వ్యవహారం త్వరలోనే ఒక కొలిక్కిరానుంది. మా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (ఈసీ) సమావేశం ఈ బుధవారం లేదా గురువారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. 


‘మా’ ఈసీ వర్చువల్‌ సమావేశాన్ని ఈ బుధ లేదా గురువారాల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఏజీఎంను ఎప్పుడు నిర్వహించాలి? ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలి? సభ్యుల జీవిత బీమాకు చెల్లించాల్సిన ప్రీమియం.. కొందరికి జీవిత సభ్యత్వాలను ఇవ్వటం వంటి అంశాలపై ఈసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఈ సమావేశంలో ఈసీ సభ్యులతో పాటుగా క్రమశిక్షణా సంఘ ఛైర్మన్‌ కృష్ణంరాజు, న్యాయసలహాదారు, ఆడిటర్‌లు కూడా పాల్గొంటారు. ‘మా’ను ఏర్పాటు చేసిన తర్వాత వర్చువల్‌గా ఈసీ మీటింగ్‌ జరగటం ఇదే తొలిసారి. ‘మా’ బైలాస్‌ ప్రకారం– ఈసీ సమావేశానికి, సర్వసభ్య సమావేశానికి (ఏజీఎం) మధ్య 21 రోజుల వ్యవధి ఉండాలి. దీని ప్రకారం చూస్తే – ఆగస్టు మూడోవారంలో ఏజీఎం జరిగే అవకాశముంది. 

సెప్టెంబర్‌లో ఎన్నికలు..

‘మా’ కొత్త కార్యవర్గం కోసం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. అయితే ప్రస్తుతం కోవిడ్‌ నిబంధనలు అమలులో ఉన్నాయి. ఈ నిబంధనలను తొలగిస్తే కానీ ఎన్నికలను నిర్వహించలేమని ప్రస్తుత కార్యవర్గం పేర్కొంది. అయితే కోవిడ్‌ మూడో వేవ్‌ రాకపోతే – ఎన్నికలను సెప్టెంబర్‌లోనే నిర్వహించే అవకాశముంది. ఈసీలో ఎన్నికల తేదీని అధ్యక్షుడు ప్రకటిస్తే– కార్యనిర్వహాక వర్గానికి ఎటువంటి అధికారాలు ఉండవు. కేవలం రోజువారి కార్యకలాపాలను నిర్వహించటానికి మాత్రమే అవకాశముంటుంది. మొత్తం అధికారాలన్నీ ఎన్నికల అధికారి చేతిలోకి వెళ్లిపోతాయి. ఎన్నికలను సజావుగా నిర్వహించి.. కొత్త కమిటీ చేతికి అధికారాన్ని అప్పగించే బాధ్యత కూడా ఎన్నికల అధికారిదే! ఈ ఎన్నికల అధికారిని నియమించే అధికారం ‘మా’ అధ్యక్షుడికి ఉంది.