Abn logo
Apr 10 2020 @ 23:10PM

చిన్నప్పటి నుంచీ హీరో అవ్వాలనేదే నా కోరిక: ‘మాటే మంత్రము’ కార్తీక్‌

రంగస్థల నటుడు, సినిమా నటుడు, కన్నడ–తెలుగు సీరియల్స్‌ నటుడు కార్తీక్‌. ఇప్పటివరకు ఎనిమిది సీరియల్స్‌లో, ‘మూకజీవి’ అనే కన్నడ సినిమాలో నటించాడు. ప్రస్తుతం జీ తెలుగు ఛానల్‌లో ‘మాటేమంత్రము’ సీరియల్‌లో హీరోగా నటిస్తూ ప్రేక్షకులకు చేరువ అయ్యాడు కార్తీక్‌. నటనే నా ఊపిరి. ప్రేక్షకులను రంజింపజేయాలంటే, మనం లైమ్‌ లైట్‌ (ప్రసిద్ధి పొందడం)లో ఉండాలంటే ఇదే సరైన మార్గం అంటున్న కార్తీక్‌ మనోగతం మీ కోసం


కర్ణాటక రాష్ట్రం మైసూరు చామరాజ్‌నగర్‌లో పుట్టాడు కార్తీక్‌మహేష్‌. బుల్లితెర ప్రేక్షకులకు కార్తీక్‌గా సుపరిచితుడు. ఆయన తండ్రి మహేష్‌ బసవన్నాచార్‌. తల్లి మీనాక్షి. తండ్రి ఫ్యాబ్రికేటర్‌. వారికి వర్క్‌షాప్‌ ఉంది. చిన్నప్పటినుంచీ కార్తీక్‌ ఏం చేసినా తల్లిదండ్రులు అతడి క్రియేటివిటీకి ఎంతో ప్రోత్సాహం ఇచ్చేవారు. ‍స్కూలు స్థాయిలోనే నాటికల్లో నటించేవాడు. డ్యాన్స్‌ చేసేవాడు. ఆటలు ఆడేవాడు. కామెడీ పంచ్‌లు వేసే గ్రామీణుడి పాత్రలో పంచెకట్టి ప్రేక్షకులను నవ్వించి అందరి దృష్టిలో పడ్డాడు కార్తీక్‌. అతడి మేనమామ చంద్రశేఖర హెగ్గొటార్‌ రంగస్థల దర్శకుడు, మ్యూజిక్‌ టీచర్‌గా పనిచేసేవారు. ఆయన వారసత్వాన్నే పుణికిపుచ్చుకున్నాడు కార్తీక్‌. 


బాల్యం నుండీ హీరో ఫీలింగే

9,10 తరగతులలో విపరీతంగా ఆటలు ఆడేవాడు కార్తీక్‌. క్రికెట్‌, ఫుట్‌బాల్‌ పోటీల్లో పాల్గొనేవాడు. కాలేజీ తరపున జోన్‌స్థాయి, జిల్లా స్థాయి పోటీల్లో ఆడేవాడు. జిల్లాస్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో కార్తీక్‌దే ప్రథమస్థానం. డిగ్రీలోకి వచ్చేసరికి అథ్లెటిక్స్‌లో బాగా రాణించాడు. అందరినీ ఆకర్షించే పనులు చేస్తూ, అందరితో చప్పట్లు కొట్టించుకోవాలని కార్తీక్‌కి చిన్నప్పట్నుంచీ బలమైన కోరిక. కార్తీక్‌ని ఎవరు పలకరించినా, ‘‘హాయ్‌ హీరో! ఎలా ఉన్నావ్‌? ’’అని పలకరించేవారట. ‘‘హీరోలా ఉన్నావ్‌, సినిమాల్లో హీరో అయిపోతావా?’’ అనేవారట. అలా చిన్నప్పటినుంచీ కార్తీక్‌లో ఎప్పుడూ హీరో అనిపించుకోవాలనే ఫీలింగే ఉండేదట. కాలేజీలో, కార్తీక్ లేకుండా ఏ సాంస్కృతిక కార్యక్రమమూ జరిగేది కాదు. మైమ్‌ యాక్షన్‌, కామెడీ స్కిట్స్‌ చేసేవాడు. ఇలా బహుముఖ పాటవంతో ఇంటర్‌ కాలేజ్‌ పోటీల్లో ఎన్నో బహుమతులు గెలుచుకున్నాడు. డిగ్రీలో ఉండగా, ప్రముఖ కన్నడ రచయిత కోయింపు నాటికలో హీరోగా అంధుడుగా నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు. ఆ పాత్రలో నటించడానికి ప్రాక్టికల్‌గా చాలామందిని కలిసి వారి హావభావాలు స్టడీచేసి నాటికను రక్తికట్టించాడు. అలా మహాజనాస్‌ కాలేజీలో బిఎస్సీ డిగ్రీ పూర్తిచేశాడు. 


షార్ట్‌ ఫిలిమ్స్‌లో హీరో

నాటకాల్లో చాలా అవకాశాలు వచ్చినాగానీ, షార్ట్‌ ఫిలిమ్స్‌వైపే మొగ్గుచూపించాడు కార్తీక్‌. ఆర్ట్‌ స్కూల్లో శిక్షణ పొంది, కెమేరాతో ఏదైనా అద్భుతాలు చేయాలని తపించే మిత్రుడు నవీన్‌ ప్రోద్బలంతో రెండు షార్ట్‌ఫిలిమ్స్‌లో నటించాడు. ‘ఎక్స్‌పీరియన్స్‌డ్‌ గాళ్‌ ఫ్రెండ్‌’ అనే షార్ట్‌ ఫిలింలో ఐదుగురు స్నేహితులతో కలిసి నటించి అందులో ఒక మంచి సందేశాన్ని ఇచ్చాడు నవీన్. రెండో షార్ట్‌ ఫిలిమ్‌ కూడా కాలేజీ విద్యార్థులమీదే. 


నా స్థానం ఇక్కడ కాదు అనిపించింది

బిఎస్సీ పూర్తిచేసి, నాలెడ్జ్‌ ప్లేస్‌ కార్పొరేట్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు కార్తీక్‌. చేరిన మొదటిరోజే అతడికి పని చేయబుద్ధికాలేదట. ‘నా స్థానం ఇక్కడ కాదు, నేనుండాల్సింది ఇక్కడ కాదు’ అని అతడి అంతరాత్మ గట్టిగా హెచ్చరించిందట. దాంతో ‘ఇది నా పనికాదు, నేను కళామ్మతల్లి ఒడిలో ఉండాల్సినవాడిని’ అనే స్వీయజ్ఞానంతో ఒకే ఒక్కరోజు ఉద్యోగం చేసి మానేశాడు.


కన్నడ సీరియల్స్‌లో నటుడుగా...

ఆ తర్వాత మూడు నెలలు తిరక్కముందే సీరియల్‌లో కార్తీక్‌కు మంచి అవకాశం వచ్చింది. 2014 నవంబరులో ‘ఖుషీ’ అనే కన్నడ సీరియల్‌లో విష్ణువర్థన్ పాత్రలో హీరోగా నటించాడు. ‘స్టార్‌ సువర్ణ’ ఛానల్‌లో ఏడాదిపాటు ప్రసారమైన ఈ సీరియల్‌తో మంచి గుర్తింపు లభించింది. దర్శకుడు ప్రీతంశెట్టి ఏరికోరి మరీ కార్తీక్‌నే ఎంపికచేసి సీరియల్‌ను సక్సెస్‌ చేశారు. యాంగ్రీ యంగ్‌మెన్ పాత్రలు నీకు బాగా సూటవుతాయి అని అందరూ ప్రశంసించారు.

‘అక్క’ అనే మరో కన్నడ హిట్‌ సీరియల్‌లో, ‘‘పునర్జన్మ పొందిన హీరోగా ఆకాష్‌గా చేశాడు. ‘‘చాలా బాగా నటించావ్‌’’ అని అందరూ ప్రశంసలు కురిపించారు. ఏడాదిన్నరపాటు ప్రసారమైన ‘అక్క’ సీరియల్లో ఫేమస్‌ కన్నడ హీరోయిన్ అనుపమ గౌడ టైటిల్‌ రోల్‌ చేశారు.


మైథాలజీ సీరియల్స్‌లో

మైథాలజీ సీరియల్స్‌ కూడా నటించి కార్తీక్‌ కన్నడ రాష్ట్రంలో మంచిపేరు తెచ్చుకున్నాడు. ‘శని’, ‘మహాకాళి’ అనే రెండు సీరియల్స్‌లో శ్రీమహావిష్ణువుగానే నటించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు. ‘‘ఈ పాత్రకు నువ్వు చాలా చక్కగా సరిపోయావు’’ అని ప్రేక్షకులు ఆయనపై ప్రశంసలు కురిపించారు. ‘శక్తి’ అనే మరో కన్నడ సీరియల్‌లో సత్యహరిశ్చంద్రుడు పాత్ర చేశాడు. అదే సీరియల్‌లో మళ్ళీ శ్రీమహావిష్ణువు పాత్రలో కూడా నటించాడు. ఇలా ఒకే ఏడాది బిజీ బిజీగా మూడు సీరియల్స్‌ చేశాడు. 


సోఫిస్టికేటెడ్‌ నెగిటివ్‌ రోల్‌ 

సీరియల్‌లో ఎవరైనా విలన్‌గా నటించారంటే వాళ్ళ పంట పండిందన్నమాటే. ఎందుకంటే, భావోద్వేగాలను బాగా పండించవచ్చు. విలన్‌ అయితేనే యాక్షన్‌కు ఎక్కువ స్కోప్‌ ఉంటుంది. కార్తీక్‌కి కూడా ‘దేవయాని’ కన్నడ సీరియల్‌లో అలాంటి అవకాశమే వచ్చింది. అయితే మొదట తటపటాయించినా, చివరకు ధైర్యంగా ముందుకు అడుగేసి సక్సెస్‌ సాధించాడు. జెమినీ కన్నడ ఛానల్‌ ‘ఉదయ్‌’లో ప్రసారమైన ‘దేవయాని’ సీరియల్‌లో రుత్విక్‌ పాత్ర చేశాడు. ‘‘ఇదొక సోఫిస్టికేటెడ్‌ నెగిటివ్‌ రోల్‌. ఇది ఎప్పటికీ నా కెరీర్‌లో బెస్ట్ వన్‌గా ఉండిపోతుంది’’ అన్నారు. ప్రస్తుతం ‘ఇంతి నిమ్మ ఆశ’ అనే మరో కన్నడ సీరియల్లో కూడా నటిస్తున్నాడు కార్తీక్‌. అంటే అర్థం ‘యువర్స్‌ ఫెయిత్‌ ఫుల్లీ’ అని. ఇదొక ఫ్యామిలీ స్టోరీ. ఇందులో తల్లిమాట వినే కొడుకు పాత్రలో చేస్తున్నాడు. అమ్మను ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోని కొడుకుగా అభయ్‌పాత్ర చేస్తున్నాడు. అమ్మ చుట్టూ తిరిగే ఈ సీరియల్‌లో ఎమోషన్స్‌, కామెడీ, యాంగ్రీ టచ్‌ ఎక్కువ ఉంటుంది. 


జీ తెలుగులో ‘మాటే మంత్రము’ సీరియల్‌

కన్నడలో ఎన్నో సీరియల్స్‌లో నటించి నటుడుగా మంచి అనుభవం సంపాదించుకున్న కార్తీక్‌, తెలుగులో మొదటిసారి జీ తెలుగు ఛానల్‌ ద్వారా ‘మాటే మంత్రము’ సీరియల్‌లో నటిస్తున్నాడు. తన స్నేహితురాలు, నటి మేఘనా లోకేష్‌ రిఫరెన్స్‌ ద్వారా కార్తీక్‌కి జీ తెలుగులో అవకాశం వచ్చిందట. ‘‘ఇదే నా మొదటి తెలుగు సీరియల్‌. 2018మే నెలలో మొదలైన ఈ సీరియల్లో హీరోగా వంశీ పాత్ర (రీప్లేస్‌) చేస్తున్నాను’’ అని చెప్పారు కార్తీక్‌. రీప్లేస్‌ చేసిన హీరోగా ఇప్పటికి 50ఎపిసోడ్స్‌ పూర్తయ్యాయి. అచ్చం తెలుగు అబ్బాయి లానే నటిస్తున్నాడని అందరూ ప్రశంసిస్తున్నారట. 


ఈ సీరియల్‌ స్టోరీ సింపుల్‌గా చెప్పాలంటే, 

వంశీ ఒక ధనిక కుటుంబంలో పుట్టిన బాడ్ బాయ్. అన్ని చెడు అలవాట్లూ ఉంటాయి. ఇప్పుడు చెడు అలవాట్లన్నీ వదులుకుని మంచి భర్తగా మారిపోతాడు. హీరోయిన్‌ వసుంధర పాత్రలో పల్లవి రామిశెట్టి నటిస్తున్నారు. వంశీకి వసుంధర పి.ఏగా వచ్చి అతడి జీవితాన్ని మార్చేస్తుంది. దాంతో అతడు మెచ్యూరిటీ సాధించి బాధ్యతగల వ్యక్తిగా కొత్త జీవితం ప్రారంభిస్తాడు. ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ సీరియల్‌ దాదాపు రెండేళ్ళుగా వస్తోంది.


ప్రేక్షకులను రంజింపజేయాలి 

‘‘నటనే నా కెరీర్‌. నటనే నా ఊపిరి. ప్రేక్షకులను రంజింపజేయడానికి, లైమ్‌లైట్‌ (ప్రసిద్ధి పొందడం)లో ఉండటానికి ఇదే సరైన రంగం. ప్రేక్షకులకు రీచ్‌ కావాలనేదే నా ప్రగాఢమైన కోరిక. బాల్యం నుంచీ అందరి ప్రశంసలు పొందాలనీ, అందరిచేతా చప్పట్లు కొట్టి నన్ను ప్రోత్సహించాలని కోరుకునేవాణ్ణి. అందుకు తగ్గట్టుగానే ఈ రంగంలోకి ప్రవేశించాను. నా చిన్ననాటి కోరిక ఇలా తీరుతోంది. కెమేరా ముందు నటిస్తున్నప్పుడు ఎంతో మానసిక సంత్రుప్తిగా అనిపిస్తుంది. కన్నడలో చేస్తున్న ‘ఇంత నిమ్మ ఆశ’ సీరియల్‌లో నవరసాలూ ఉన్నాయి’’ అన్నారు కార్తీక్‌. అన్నట్టు కార్తీక్‌ కన్నడలో ‘మూకజీవి’ అనే ఒక సినిమాలో కూడా నటించాడు. ఈ సినిమాలో టైటిల్‌రోల్‌కి బావ ప్రకాశ్‌పాత్రలో నటించి నెగిటివ్‌ షేడ్‌ చూపించాడు కార్తీక్‌. ఈ చిత్రంలో అతడికి మంచి పేరు వచ్చింది. ఈ రంగంలో మంచి స్నేహితుల్ని సంపాదించుకున్నాడు కార్తీక్‌. చెల్లెలి పెళ్ళి హడావిడి పూర్తయ్యాక సినిమారంగం మీద బాగా దృష్టి కేంద్రీకరిస్తాడట.


పరిశీలనతో నటనకు మెరుగులు

‘‘సమాజంలో ఉన్న మనుషులను, వారి హావభావాలు, మేనరిజమ్స్‌ను పరిశీలిస్తూ ఉంటాను. వాటినే నా పాత్రల్లో అవసరానుగుణంగా ఉపయోగించుకుంటూ నా నటనకు మెరుగులు దిద్దుకుంటాను. ఏదైనా ఒక పాత్ర చెయ్యాలనుకుంటే, దానికి సంబంధించిన విషయాలను ముందుగా నేను స్వయంగా వెళ్ళి పరిశీలించి తెలుసుకుని ఒక అవగాహనకు వచ్చి అందుకు అనుగుణంగా నటిస్తాను’’ అన్నాడు కార్తీక్‌. మాటే మంత్రము సీరియల్‌ చేయడం ప్రారంభించిన తర్వాత సహనటుల దగ్గర తెలుగు నేర్చుకుంటున్నాడు కార్తీక్‌. లైట్‌ బోయ్‌లు కూడా తెలుగు నేర్పుతూ అతడికి ఎంతో సహకారం అందిస్తున్నారట. తన తోటి నటులందరూ ఎంతో సంతోషంగా, కుటుంబసభ్యుల్లా తనను తమలో ఒకడుగా కలుపుకున్నారని ఎంతో సంతోషంగా చెప్పాడు. 


హోటలియర్‌ కావాలి

హైదరాబాద్‌ వెదర్‌ తెగ నచ్చేసిందట కార్తీక్‌కి. బావర్చీ, ప్యారడైజ్ బిర్యాని తెగ లాగించేస్తున్నాడట. మంచి హోటలియర్‌ అవ్వాలని కూడా కోరికగా ఉందట కార్తీక్‌కి. నటుడుగా బాగా నిలదొక్కుకున్న తర్వాత హోటల్‌ బిజినెస్‌లోకి దిగాలనే ఆలోచన ఉందట. ఎందుకు అలాంటి కోరిక కలిగిందంటే, కార్తీక్‌కి చిన్నప్పటినుంచీ వంటలు చేయడం ఎంతో ఇష్టమట. అమ్మ దగ్గరే వంట నేర్చుకున్నాడట. బెంగళూర్‌లో చదువుకునేటప్పుడు స్నేహితులతో ఒకరూమ్‌లో ఉన్నప్పుడు, ‘‘ఒరేయ్‌ నువ్వు వంటలు చాలా చాలా రుచిగా చేస్తావ్‌, అద్భుతం, అమోఘం’’ అని స్నేహితులు అతడిని మునగచెట్టెక్కించేసేవారట. 


Advertisement
Advertisement
Advertisement