Abn logo
May 5 2021 @ 11:16AM

పెద్దాసుపత్రిలో మరణాల కలకలం

ఒక్కరోజే ఆరుగురి మృతి

ఆక్సిజన్‌ అందలేదా? కాదంటున్న వైద్యులు!

వెంటిలేటర్ల మరమ్మతులు చేసేదెప్పుడు?


ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం: మచిలీపట్నంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో కరోనా బాధితుల మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే ఆరుగురు మరణించటం.. అందులో పట్టణ ప్రముఖులుండటం చర్చనీయాంశంగా మారింది. కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు ఆక్సిజన్‌ అందక మరణించారని ప్రచారం జరుగుతుండటంతో పట్టణ ప్రజలు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. కొన్నిరోజులుగా బాధితులకు ఆక్సిజన్‌ సక్రమంగా అందడం లేదనే వాదన బంధువుల నుంచి వినిపిస్తోంది. ఆక్సిజన్‌ నిల్వలు ఉన్నా.. వెంటిలేటర్లు మరమ్మతులకు గురయ్యాయని, వాటిని రిపేరు చేసే నిపుణులు అందుబాటులో లేరని, ఈ మరణాలకు ఇదో కారమై ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు పనిచేస్తున్నప్పటికీ ఆక్సిజన్‌ సరఫరాలో తలెత్తిన లోపాలు సరిచేయకపోవడంతోనే ఈ మరణాలు సంభవించాయనే ఆరోపణలు లేకపోలేదు. సాంకేతిక సిబ్బంది అందుబాటులో లేకుంటే ప్రైవేటుగానైనా నియమించుకునేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని  బాధిత బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


బెడ్‌ కోసం ఎన్నికష్టాలో..

కరోనా బారిన పడి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చేవారికి బెడ్‌ దొరకడం కష్టంగా మారింది. అంబులెన్స్‌లో వచ్చిన వారు గంటల తరబడి అంబులెన్స్‌లోనే ఉండిపోవడం నిత్యకృత్యంగా మారింది. తెలిసినవారికో.. లేదా పెద్దల సిఫార్సులో ఉంటేగానీ బెడ్‌లు దొరకని పరిస్థితి. 250 పడకల సామర్థ్యం ఉన్న ఆసుపత్రిలో 350 మందికిపైగా ఉండటం, బెడ్‌ అక్కరలేదు.. కింద పడుకుని అయినా వైద్యం చేయించుకుంటామని చెప్పడం చూస్తే పరిస్థితి ఎంత కఠినంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కొందరి ఆరోగ్యం క్షీణించి విజయవాడ, గుంటూరుకు తరలిపోతున్నారు. కొందరు సీనియర్‌ వైద్యులు వివిధ కారణలతో ఆసుపత్రికి దూరంగా ఉంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు.


ఆరోగ్యం క్షీణించడంతోనే మరణాలు: డాక్టర్‌ అల్లాడ శ్రీనివాసరావు, ఆర్‌ఎంవో 

జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం ఆరుగురు కరోనా బాధితులు మరణించారు. వైద్యానికి వారు సహకరించలేకపోవడంతోనే మరణాలు సంభవించాయి. వైద్యుల నిర్లక్ష్యం ఏమాత్రం లేదు.


2.8 టన్నుల ఆక్సిజన్‌ చేరిక: ఆర్డీవో ఖాజావలి 

ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ జయకుమార్‌, ఆర్‌ఎంవో డా.అల్లాడ శ్రీనివాసరావు, జీసీహెచ్‌ జ్యోతిర్మయిలతో ఆసుపత్రిలో నిర్వహిస్తున్న వైద్య సేవలపై ఆర్డీవో ఖాజావలి మంగళవారం సాయంత్రం సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ఎప్పటికప్పుడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి విశాఖపట్నం, విజయవాడ నుంచి ఆక్సిజన్‌ చేరుతూనే ఉంది. ఇవాళ రాత్రి రెండు టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ చేరుతుంది. ఆక్సిజన్‌ లెవెల్స్‌ సరిగా ఉన్నాయో లేవో ఎప్పటికప్పుడు నర్సులు పర్యవేక్షిస్తారు. చెడిపోయిన వెంటిలేటర్లు ఇప్పుడు బాగానే ఉన్నాయి. ఆక్సిజన్‌ సరఫరా పరిశీలించేందుకు వైద్య బృందాన్ని నియమించాం. ఆక్సిజన్‌ అందక చనిపోయారన్న మాట వాస్తవం కాదు. ఆక్సిజన్‌ లెవెల్స్‌ సరిగా అందేందుకు ఆసుపత్రిలో అన్ని చర్యలు తీసుకుంటున్నాం’ అని ఆర్డీవో తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement