సైన్యం కోసం ‘మేడ్ ఇన్ ఇండియా’ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్

ABN , First Publish Date - 2021-04-02T01:06:57+05:30 IST

సైనిక అవసరాల కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు

సైన్యం కోసం ‘మేడ్ ఇన్ ఇండియా’ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్

న్యూఢిల్లీ : సైనిక అవసరాల కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు భారత ప్రభుత్వం ముమ్మరంగా కృషి చేస్తోంది. ఆయుధాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, బూట్లు వంటివాటిని మన దేశంలోనే తయారు చేయడానికి ప్రాధాన్యమిస్తోంది. దీనిలో భాగంగానే రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన కాన్పూరులోని ప్రయోగశాల తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను అభివృద్ధి చేసింది. దీని బరువు 9 కేజీలు. దీనిని చండీగఢ్‌లోని ప్రయోగశాలలో పరీక్షించారు. 


డీఆర్‌డీవో ప్రకటించిన వివరాల ప్రకారం, భారత సైన్యం కోసం తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను కాన్పూరులోని డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డీఎంఎస్‌ఆర్‌డీఈ) అభివృద్ధి చేసింది. దీనిని ఫ్రంట్ హార్డ్ ఆర్మర్ ప్యానెల్ (ఎఫ్‌హెచ్ఏపీ) జాకెట్ అంటారు. దీనికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ప్రమాణాలు ఉన్నాయి. దీనిలో ఉపయోగించిన టెక్నాలజీ వల్ల దీని బరువు గతం కన్నా 1.4 కేజీలు తగ్గింది. ఈ కొత్త జాకెట్‌ బరువు  9 కేజీలు.


అంతకుముందు ద్రవంతో నిండిన స్పెషల్ జాకెట్లను డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది. వీటిని పీపీఈ కిట్లలో ధరించవచ్చు. దీనిని ధరించినవారు వాతావరణంలోని వేడిని తట్టుకోవడానికి వీలవుతుంది. వీటిని జోధ్‌పూర్ ఆరోగ్య శాఖ గత ఏడాది జూలైలో ల్యాబ్ టెక్నీషియన్లకు అందజేసింది. 


భారత సైన్యంలో మేజర్ ర్యాంక్ అధికారి అనూప్ మిశ్రా ఈ ఏడాది జనవరిలో స్త్రీ, పురుషులు ధరించదగిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ ’శక్తి’ని అభివృద్ధి చేశారు. ఈ తరహా జాకెట్‌ను తయారు చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి. అంతేకాకుండా ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లెక్సిబుల్ బాడీ ఆర్మర్. 


మరోవైపు ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ (ఏఐపీ) టెక్నాలజీని డీఆర్‌డీవో  అభివృద్ధి చేసింది. ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసిన అమెరికా, ఫ్రాన్స్, చైనా, బ్రిటన్, రష్యా సరసన మన దేశం చేరింది. ఈ టెక్నాలజీని ఉపయోగించే జలాంతర్గాములు డీజిల్-ఎలక్ట్రిక్ జలాంతర్గాముల కన్నా ఎక్కువ సమయం సముద్ర జలాల్లో ఉండగలుగుతాయి. 


Updated Date - 2021-04-02T01:06:57+05:30 IST