మానవ మాధవీయం...

ABN , First Publish Date - 2020-07-22T07:50:51+05:30 IST

ధర్మానికి హాని జరిగినప్పుడు తాను అవతరిస్తానని ఆ పరమాత్మ చెప్పాడు. ధర్మానికి హాని జరగడమంటే, మానవునిలో ధర్మాచరణం సన్నగిల్లటమే. ..

మానవ మాధవీయం...

యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతః

అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్‌


ధర్మానికి హాని జరిగినప్పుడు తాను అవతరిస్తానని ఆ పరమాత్మ చెప్పాడు. ధర్మానికి హాని జరగడమంటే, మానవునిలో ధర్మాచరణం సన్నగిల్లటమే. ధర్మమంటే వేదాలలో విస్తృతంగా వివరించబడిన ధర్మమే. యుగధర్మంలో, కాలగమనంలో నాగరికత మారవచ్చునేమో గానీ, సంస్కృతి మారదు. మారకూడదు. ఈ సున్నిత, సునిశిత బేధం తెలియక నాగరికత ప్రభావం మానవుని నడిపించినంత కాలం, ధర్మం వెనుకబడుతుంది. దానికి అనుగుణంగానే మనిషి కర్మలు, ఆ కర్మలననుసరించి ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలతో మనిషి తన నిజస్థితిని కోల్పోయి, నిరంతర వృథా శోకి వలె జీవిస్తాడు. యాతనలననుభవిస్తాడు. ఇక అనుభవించలేక ఆలంబన కోసం అలమటిస్తాడు. అటువంటి ధర్మగ్లాని సంభవించినపుడు పరమేశ్వరుడు మానుష వేషధారణ చేసి, ధర్మాచరణ దిశగా, మానవ జాతిని నడిపి, స్వధర్మం వైపు నడిపిస్తాడు. ఆ క్రమంలో వచ్చినవే అనేక అవతారాలు.


ఆ అవతారక్రమంలోనే మానవ మాధవీయంగా, మాధవ మానవీయంగా సమస్త విశ్వానికి దిశా నిర్దేశం చేస్తున్న దివ్యావతారం భగవాన్‌ సత్యవాన్‌ సత్యసాయి బాబా! స్వామి ప్రకటించిన అవతార కార్యక్రమంలో వేదపరిపోషణ - ధర్మ పరిరక్షణ ప్రధానమైనవి. అంటే మానవులకు వేదం తెలియాలి. ధర్మాన్ని ఆచరించాలి. ఈ రెండూ నిర్దుష్టంగా, నిష్టగా, నియమంగా జరిగితే మానవుడు అనంత శాంతితో, పూర్ణాయువుతో, అర్థవంతంగా, ప్రయోజనయుతంగా జీవించగలుగుతాడు. వేదం, ధర్మాన్ని అనేక విధాల నిర్వచించింది. అనేక పాయలుగా ప్రవహింపజేసింది. జాతి, కుల, మతాలకు అతీతంగా, అంతస్సూత్రంగా జగతిని నిలిపింది, కలిపింది, నడిపింది వేదం. సర్వలోక సంక్షేమాన్ని ప్రబోధించింది. పశుత్వాన్ని వదలి పశుపతి తత్త్వం సాధించమన్నది. ‘సత్యం’ ఆవిష్కరించుకోవలసిన బాధ్యతను, గుర్తు చేసింది. ఈ సత్యానికి మరొక పేరు.. ఆత్మ. మరణం పాంచభౌతిక శరీరానికే గాని, ఆత్మకు కాదని చెబుతున్నది వేదం. 


చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు

ఆది మధ్యాంతరహితుడనుదివాడు

తాను చావక, పుట్టక, చంపబడక,

అంతటను సర్వసాక్షియైు, ఆత్మవెలుగు


అంటారు భగవాన్‌ సత్యసాయిబాబా. దేహం మనమే అనుకున్నంతకాలం కారణం, చారణం, రణం, మరణం తప్పవు. ‘పరమ చరమ స్థితియైున ఆత్మే నేను’ అనుకున్న మరుక్షణం మన ఆలోచనలన్నీ విస్తృతమౌతాయి. సంకుచితత్వం, భయం, వేదన, లాలన సమసి పోతాయి.

                

                            

                                  - వి.ఎస్‌.ఆర్‌. మూర్తి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త

Updated Date - 2020-07-22T07:50:51+05:30 IST