Abn logo
Oct 23 2020 @ 04:44AM

మూడు ముక్కలకు కేంద్రం వత్తాసు

బీజేపీతో కుమ్మక్కై అమరావతిని నిర్వీర్యం 

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు 


తాడేపల్లి, అక్టోబర్‌ 22: కేంద్ర ప్రభుత్వం వత్తాసుతోనే వైసీపీ ప్రభుత్వం రాజధానిని మూడు ముక్కలు చేస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. అమరావతిపై కేంద్ర ప్రభుత్వ ద్రోహం, రాష్ట్ర ప్రభుత్వ మోసంపై రాజధాని ముఖద్వారమైన ఉండవల్లి సెంటర్‌లో గురువారం జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. వైసీపీ, బీజేపీ కుమ్మక్కై అమరావతిని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఐదేళ్లలో నిధులు ఇవ్వకుండా బీజేపీ అమరావతిని నీరు కార్చిందని, వైసీపీ మాట మార్చి మోసం చేసిందని తెలిపారు.


రాజధాని ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో టీడీపీ, వైసీపీలు రెండూ విఫలమయ్యాయని తెలిపారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, ప్రజా రాజధాని కోసం పోరు సాగించాలని పిలుపునిచ్చారు. తొలుత సీపీఎం కార్యాలయం నుంచి సెంటర్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం రవి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం, చిగురుపాటి బాబూరావు, కృష్ణయ్య, నాయకులు బూరగ వెంకటేశ్వర్లు, కోటేశ్వరి, రామారావు, సుందరరావు, శ్రీనివాసరావు, ఎర్రపీరు, కరుణాకర్‌, భాగ్యరాజు, రాఘవులు, ఆంజనేయులు, కోటేశ్వరరావు, సుందరయ్య, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement