Jul 23 2021 @ 19:19PM

ద్విభాషా చిత్రంతో.. మధుబాల మరోసారి రీ ఎంట్రీ

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా చిత్రం ద్వారా స్టార్‌ హీరోయిన్‌ గుర్తింపు తెచ్చుకున్న మధుబాల తమిళంలోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. అదీకూడా పోలీస్‌ అధికారి పాత్రలో వెండితెరపై కనిపించనున్నారు. గతంలో మధుబాల హీరోయిన్‌గా నటించిన ‘రోజా’, ‘జెంటిల్‌మెన్‌’ వంటి చిత్రాలు సూపర్‌డూపర్‌ హిట్స్‌ సాధించాయి. ఆ తర్వాత కోలీవుడ్‌ను వదిలి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అయితే, అక్కడ కూడా అవకాశాలు తగ్గిపోవడంతో కొంతకాలం ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో 2012లో బాలాజీ మోహన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాయైు మూడి పేసవు’ అనే చిత్రం ద్వారా తమిళంలోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. 


ఈ నేపథ్యంలో ప్రస్తుతం అరవింద్‌ శ్రీనివాసన్‌ దర్శకత్వంలో అరుళ్‌నిధి హీరోగా తెరకెక్కనున్న ‘దెజావు’ అనే చిత్రంలో మధుబాల పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారు. హీరో అరుళ్‌నిధి కూడా ఇందులో నిఘా విభాగం అధికారిగా నటించనున్నారు. అలాగే, టాలీవుడ్‌ హీరో నవీన్‌ చంద్ర ఓ కీలక పాత్రను పోషించనున్నారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రమిది. దీని తర్వాత అయినా మధుబాలకు కోలీవుడ్‌లో వరుస అవకాశాలు వస్తాయేమో చూద్దాం.