Oct 24 2021 @ 02:59AM

నాలో కొత్త మాధురిని వెతుక్కున్నా!

స్టార్‌ టాక్‌

అందం, అభినయం, నృత్యం... దేన్లోనైనా ‘నెంబర్‌ వన్‌’ అనిపించుకుంది మాధురీ దీక్షిత్‌.యాభైనాలుగేళ్ళ వయసులోనూ ఆ ఆకర్షణను ఏమాత్రం కోల్పోని నిన్నటి తరం బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌... ఆమె నటిస్తున్న తొలి వెబ్‌ సిరీస్‌ ‘ఫైండింగ్‌ అనామిక’ టీజర్‌ ఈ మధ్యే విడుదలైంది. ఈ సందర్భంగా ఆ వెబ్‌ సిరీస్‌ గురించి, ఓటీటీ అనుభవాల గురించి మాధురి చెప్పిన విశేషాలివి...


‘‘నేను నటిగా కెరీర్‌ మొదలుపెట్టినప్పుడు... అంటే ఇరవై ఏడేళ్ళ కిందట... మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలంటే, కథానాయిక పాత్ర బాధితురాలో, వంచితురాలో అయి ఉండేది. లేకపోతే ఎన్ని కష్టాలు ఎదురైనా నోరెత్తని సాధు జీవిలా ఉండేది. చివరకు ప్రతీకారం తీర్చుకోవడంతోనో, ప్రాణాలు పోగొట్టుకోవడం లేదా ప్రాణత్యాగంతోనో కథ ముగిసేది. ఆ ధోరణి మారింది. సినిమాల్లో, వెబ్‌ సిరీస్‌లలో మహిళా పాత్రలు తమదైన వ్యక్తిత్వంతో, బలంగా కనిపిస్తున్నాయి. ఓటీటీలకు ప్రేక్షకుల్లో ఆదరణ పెరిగాక కొత్త తరహా పాత్రలను రచయితలు సృష్టిస్తున్నారు. నిజజీవితంలో మనలో మంచీ, చెడూ... రెండూ ఉంటాయి. ఇదివరకు సినిమాల్లో... ప్రధానపాత్రల్లో ఈ షేడ్స్‌ పెద్దగా చూపించేవారు కాదు. ఇప్పుడు ఆ స్టీరియో టైప్‌ రూపకల్పనలు క్రమంగా తగ్గుతున్నాయి. 

కిందటి ఏడాది లాక్‌డౌన్‌ కాలంలో... ప్రజలు ఇళ్ళకే పరిమితమైపోయినప్పుడు వారికి అందుబాటులో ఉన్న వినోదం ఓటీటీ మాత్రమే. సినిమా కావచ్చు, వెబ్‌ సిరీస్‌ కావచ్చు... ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏది కావాలంటే అది చూడగలిగే ఈ వెసులుబాటు జనాన్ని బాగా ఆకట్టుకుంది. మరోవైపు సృజనాత్మకతకూ ఓటీటీలు పెద్ద పీట వేస్తున్నాయి. మంచి కథలు చెప్పగలిగే రచయితలకు గొప్ప అవకాశం ఇది. అలాగే భిన్నమైన పాత్రలను కోరుకొనేవారికి కూడా... ఓటీటీలో ఆరంగేట్రం చేయడానికి ఒక మంచి ప్రాజెక్ట్‌ కోసం ఎదురుచూస్తున్న నాకు ‘ఫైండింగ్‌ అనామిక’ కథ బాగా నచ్చింది. విన్న వెంటనే ‘ఓకే’ చెప్పేశాను. 

ఇంతకీ ఈ వెబ్‌ సిరీస్‌ కథేమిటంటే... ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఒక మహిళా సూపర్‌స్టార్‌ అదృశ్యమైపోతుంది. ఆమె ఏమయిందనే విషయంలో ఎన్నో ఊహాగానాలు, వదంతులు చెలరేగుతాయి. ఆమెను ఇష్టపడే వ్యక్తి, పోలీసులు సాగించిన వెతుకులాటలో... అప్పటివరకూ గోప్యంగా ఉన్న ఎన్నో నిజాలు బయటపడతాయి. ఆమె జీవితం చుట్టూ అల్లుకున్న అవాస్తవాలు వెల్లడవుతాయి. ఇది సస్పెన్స్‌తో నడిచే ఫ్యామిలీ డ్రామా. సెలబ్రిటీగా, భార్యగా, తల్లిగా... ఇలా రకరకాల షేడ్స్‌ ఉన్న పాత్ర నాది. అంతేకాదు, దాదాపు ఇరవై నాలుగేళ్ళ తరువాత సంజయ్‌ కపూర్‌తో నటించడం కూడా ప్రత్యేకమే. ప్రపంచంలో ప్రతి ఇంటినీ ఒకేసారి చేరుకొనే అద్భుతమైన వేదిక ద్వారా తొలిసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాననే ఎగ్జైట్‌మెంట్‌ను ఈ సిరీస్‌లో నటిస్తున్న ప్రతి క్షణం అనుభూతి చెందాను. నాలో సరికొత్త మాధురిని వెతుక్కున్నాను. అందుకే... ఈ అవకాశం రావడం నా అదృష్టం. కరణ్‌ జోహార్‌ రూపొందిస్తున్న ఈ సిరీస్‌ కిందటి ఏడాదే విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. త్వరలోనే రాబోతున్న ఈ సిరీస్‌లో... అనామికా ఆనంద్‌గా నన్ను ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నా.’’

Bollywoodమరిన్ని...