కొవిడ్‌ నుంచి కోలుకున్న మధ్యప్రదేశ్‌ డాక్టర్‌

ABN , First Publish Date - 2021-05-08T08:48:49+05:30 IST

మధ్యప్రదేశ్‌లో గత ఏడాది నుంచి కొవిడ్‌ విధులు నిర్వహిస్తూ వేల మంది ప్రాణాలను కాపాడి, ఇటీవలే ఆ మహమ్మారి బారినపడిన ప్రముఖ పల్మనాలజిస్ట్‌ డాక్టర్‌ సత్యేంద్ర మిశ్రా (40) కోలుకున్నారని ఆయనకు చికిత్స అందించిన వైద్యులు తెలిపారు.

కొవిడ్‌ నుంచి కోలుకున్న మధ్యప్రదేశ్‌ డాక్టర్‌

  • వేల మంది ప్రాణాలు కాపాడిన వైద్యుడు
  • ప్రాణాపాయ స్థితిలో వాయుమార్గం ద్వారా హైదరాబాద్‌కు


హైదరాబాద్‌ సిటీ, మే 7 (ఆంధ్రజ్యోతి): మధ్యప్రదేశ్‌లో గత ఏడాది నుంచి కొవిడ్‌ విధులు నిర్వహిస్తూ వేల మంది ప్రాణాలను కాపాడి, ఇటీవలే ఆ మహమ్మారి బారినపడిన ప్రముఖ పల్మనాలజిస్ట్‌ డాక్టర్‌ సత్యేంద్ర మిశ్రా (40) కోలుకున్నారని ఆయనకు చికిత్స అందించిన వైద్యులు తెలిపారు. కొవిడ్‌ విధులు నిర్వహిస్తూ గత నెలలో ఆయన కరోనా బారినపడ్డారు. భోపాల్‌లో చికిత్స తీసుకుంటుండగా ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్‌ సోకి పరిస్థితి తీవ్రంగా మారింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయనను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఆదేశాల మేరకు అధికారులు ఏప్రిల్‌ 19న వాయుమార్గం (ఎయిర్‌ అంబులెన్స్‌) ద్వారా హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ గత కొద్ది రోజులు చికిత్స పొందిన తర్వాత మిశ్రా కోలుకున్నారని ఆ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కొవిడ్‌ కారణంగా మిశ్రా ఊపిరితిత్తులకు తీవ్రనష్టం జరిగినప్పటికీ చికిత్సకు ఆయన స్పందించారని వెల్లడించారు. ‘‘ప్రస్తుతం మిశ్రా పరిస్థితి మెరుగుపడింది. ఊపిరితిత్తుల ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను నిర్వహించాల్సిన అవసరం లేకుండానే ఆయన కోలుకున్నారు’’ అని యశోద ఆస్పత్రుల్లో ఊపిరితిత్తుల ట్రాన్స్‌ప్లాంటేషన్‌ మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ రాజగోపాల తెలిపారు. కాగా మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌ వైద్య కళాశాలలో శ్వాసకోశ వ్యాధుల విభాగంలో సత్యేంద్ర అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

Updated Date - 2021-05-08T08:48:49+05:30 IST