కూతురు పెళ్లి కోసం దాచిన సొమ్ము ఆక్సిజన్‌ కొనుగోలుకు విరాళం

ABN , First Publish Date - 2021-04-27T17:29:35+05:30 IST

మెడికల్ ఆక్సిజన్ కొరతతో జనం పిట్టల్లా రాలిపోతున్నారంటూ వస్తున్న వార్తలతో..

కూతురు పెళ్లి కోసం దాచిన సొమ్ము ఆక్సిజన్‌ కొనుగోలుకు విరాళం

నీముచ్: మెడికల్ ఆక్సిజన్ కొరతతో జనం పిట్టల్లా రాలిపోతున్నారంటూ వస్తున్న వార్తలతో చలించిపోయిన మధ్యప్రదేశ్ చెందిన ఒక రైతు ఆపన్నహస్తం అందించాడు. ఆక్సిజిన్ కొనుగోలుకు 'నైను సైతం' అంటూ భారీ విరాళం అందజేశాడు. అతని ఔదర్యం చూసి ఇప్పుడు అందరూ అతనిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నీముచ్ జిల్లా దేవియాన్ గ్రామానికి చెందిన చంపాలాల్ గుర్జర్‌ తన కుమార్తె పెళ్లి కోసం రూ.2 లక్షలు దాచాడు. అట్టహాసంగా పెళ్లి చేయాలనుకున్నాడు. గత ఆదివారం పెళ్లి కూడా జరిపించాడు. అయితే, ఎలాంటి ఆర్భాటం లేకుండా కుమార్తె పెళ్లి  జరిపించి, అందుకోసం దాచిన రూ.2 లక్షలు జిల్లా కలెక్టర్ మయాంక్ అగర్వాల్‌కు చెక్కురూపంలో అందజేశాడు.


''మెడికల్ ఆక్సిజన్ కొరతతో జనం అల్లాడుతున్నట్టు తెలుసుకున్నాను. అమ్మాయి పెళ్లి కోసం దాచిన 2 లక్షలతో ఆర్భాటంగా పెళ్లి చేయాలనుకున్నాను. అయితే, కోవిడ్ పరిస్థితి దయనీయంగా ఉండటంతో చివరి నిమిషంలో మనసు మార్చుకున్నాను. రెండు ఆక్సిజన్ సిలెండర్లు కొనాలని కలెక్టర్‌ను కోరుతూ చెక్ అందజేశాను. ఆ సొమ్ముతో జిల్లా ఆసుపత్రికి ఒక సిలెండర్, తాను ఉంటున్న జీరన్ తహసిల్‌కు ఒక సిలెండర్ కొనడం జరుగుతుంది'' అని చంపాలాల్ గుర్జర్ తెలిపాడు. తన కుమార్తె పెళ్లికి ఒక మంచి పని చేశాననే తృప్తి కలిగిందని చెప్పాడు. చంపాలాల్ కుమార్తె అనిత సైతం తన తండ్రి చేసిన పని తనకెంతో ఆనందాన్నిచ్చిందని చెప్పింది. గుర్జర్ ఔదార్యాన్ని కలెక్టర్ అగర్వార్ కొనాయాడారు. గుర్జర్ తరహాలోనే ఇతరులు కూడా పెద్దమనుసుతో ముందుకు వస్తే తేలిగ్గానే కోవిడ్ సమస్య నుంచి బయటపడగలమని ఆయన అన్నారు.

Updated Date - 2021-04-27T17:29:35+05:30 IST