జవాను మృతదేహాన్ని తోపుడు బండిలోకి ఎక్కించి... ఓ తండ్రి దీన గాథ!

ABN , First Publish Date - 2021-04-01T17:11:26+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని గునా జిల్లాలో ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.

జవాను మృతదేహాన్ని తోపుడు బండిలోకి ఎక్కించి... ఓ తండ్రి దీన గాథ!

గునా: మధ్యప్రదేశ్‌లోని గునా జిల్లాలో ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఆర్మీలో పనిచేస్తున్న కుమారుడు మృతి చెందగా, ఆ మృతదేహాన్ని ఇంటికి తీసుకు వెళ్లేందుకు వాహనమేదీ లభించకపోవడంతో ఆ తండ్రి తోపుడు బండి సాయం తీసుకోవాల్సివచ్చింది. ఈ ఉదంతం కుంభ్‌రాజ్ ఆరోగ్యకేంద్రంలో చోటుచేసుకుంది. ప్రభుత్వ  వైద్య సిబ్బంది మాత్రమే కాదు అక్కడున్నవారు కూడా ఆ తండ్రిని ఆదుకునేందుకు ముందుకు రాలేదు. 


ఎవరూ కూడా కనీస మానవత్వం ప్రదర్శించలేదు. వివరాల్లోకి వెళితే గునా నివాసి నితేష్ రావు తన అత్తవారింటికి వెళుతున్న సమయంలో ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతనిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లినా, ప్రయోజనం లేకపోయింది. అక్కడి వైద్యులు అతనిని పరీక్షించి, అప్పటికే మృతి చెందాడని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా మృతుని తండ్రి హేమరాజ్ రావు మాట్లాడుతూ తన కుమారుని మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యాక...ఆ మృతదేహాన్ని ఇంటికి తీసుకు వెళ్లేందుకు ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలవారు ఎటువంటి వాహనాన్ని ఇవ్వలేదని ఆరోపించాడు. దీంతో తండ్రి అక్కడున్న కొందరిని సాయం కోసం అర్థంచాడు. అయినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తండ్రి మరి చేసేదేమీలేక ఒక తోపుడు బండిని అద్దెకు తీసుకుని, దానిపై కుమారుని మృతదేహాన్ని ఉంచి, ఇంటికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యాడు, ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చి, ఒక ఆటోలో మృతదేహాన్ని వారి ఇంటికి తరలించారు. ఈ ఉదంతంపై కుంభరాజ్ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ మహేష్ జాటవ్ మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో వాహనంలేదని, అందుకే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశామన్నారు. 

Updated Date - 2021-04-01T17:11:26+05:30 IST