కుక్క కోసం రెండు కుటుంబాల కొట్లాట... డిఎన్ఏ దిశగా పోలీసులు!

ABN , First Publish Date - 2020-11-22T14:49:33+05:30 IST

సాధారణంగా మనుషులను గుర్తించేందుకు పలు సందర్భాల్లో డీఎన్ఏ టెస్టులు నిర్వహిస్తుంటారు. అయితే...

కుక్క కోసం రెండు కుటుంబాల కొట్లాట... డిఎన్ఏ దిశగా పోలీసులు!

హోషంగాబాద్: సాధారణంగా మనుషులను గుర్తించేందుకు పలు సందర్భాల్లో డీఎన్ఏ టెస్టులు నిర్వహిస్తుంటారు. అయితే కుక్కకు డీఎన్ఏ టెస్టు చేయడాన్ని వినివుండకపోవచ్చు. ఒక లేబ్రడార్ కుక్క కోసం రెండు కుటుంబాలు వివాదానికి దిగాయి. చివరికి ఇది పోలీస్ స్టేషన్ వరకూ చేరింది. దీంతో పోలీసులు ఆ కుక్క ఎవరిదో తేల్చేందుకు డిఎన్ఏ టెస్టును చేయించాల్సివచ్చింది. ఈ ఘటన మద్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌నకు చెందినది. కుక్క కోసం కొట్లాడుతున్న ఇద్దరిలో ఒకరు జర్నలిస్టు కాగా, మరొకరు ఏబీవీపీ నేత. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మూడు నెలల క్రితం జర్నలిస్టు షాబాద్ ఖాన్ తమ ఇంట్లోని కుక్క కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. అయితే రెండు రోజుల తరువాత షాబాద్ తిరిగి పోలీస్ స్టేషన్‌కు వచ్చి, తమ కుక్క దొరికిందని తెలిపారు. అయితే తమ కుక్క ఏబీవీపీ నేత క్రాంతిక్ శివహరే ఇంట్లో ఉందని పేర్కొన్నారు. 


ఇంతలో పోలీస్ స్టేషన్‌కు శివహర్ వచ్చి, అది తమ కుక్క అని తెలిపారు. దాని పేరు టైగర్ అని తెలిపారు. ఈ కుక్కను కొన్ని వారాల క్రితమే తాను కొనుగోలు చేశానని పేర్కొన్నారు. కాగా ఆ కుక్క ఇద్దరు యజమానుల దగ్గరా ఒకే రీతిలో వ్యవహరించడంతో పోలీసులు కంగుతిన్నారు. మరోవైపు ఆ శునకం తమదేనంటూ షాబాద్, శివహర్ పోలీసుల ముందు వాదనకు దిగారు.  ఆ కుక్క తల్లి పచమడీలో ఉందని షాబాద్ చెప్పగా, కాదు ఇటారసీలో ఉందని శివహర్ పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు ఆ శునకం రక్త నమూనాను సేకరించి, దాని తల్లి కుక్కతో పోల్చి, ఆ కుక్కకు నిజమైన యజమాని ఎవరనేది తేల్చేపనిలో పడ్డారు. 


Updated Date - 2020-11-22T14:49:33+05:30 IST