డెల్టా ప్లస్ వేరియంట్‌తో మొట్టమొదటి రోగి మృతి

ABN , First Publish Date - 2021-06-24T11:22:06+05:30 IST

దేశంలోనే మొట్టమొదటిసారి డెల్టా ప్లస్ వేరియంట్ తో కొవిడ్ రోగి మరణించిన ఘటన...

డెల్టా ప్లస్ వేరియంట్‌తో మొట్టమొదటి రోగి మృతి

 ఉజ్జయినిలో మొదటి మరణం నమోదు

ఉజ్జయిని (మధ్యప్రదేశ్): దేశంలోనే మొట్టమొదటిసారి డెల్టా ప్లస్ వేరియంట్ తో కొవిడ్ రోగి మరణించిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో వెలుగుచూసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఐదుగురికి డెల్టాప్లస్ వైరస్ సోకగా వారిలో నలుగురు కోలుకున్నారని, ఒకరు మరణించారని ఉజ్జయిని నోడల్ అధికారి చెప్పారు. సార్ట్ కొవిడ్-2 డెల్టా ప్లస్ వేరియంట్ ప్రబలిన నేపథ్యంలో తాము భారీ స్థాయిలో పరీక్షలు చేస్తున్నామని మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి విశ్వస్ సారంగ్ చెప్పారు. ఉజ్జయినిలో మరణించిన కొవిడ్ రోగి నుంచి  తీసిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయగా అది డెల్టా ప్లస్ వేరియంట్ అని తేలింది. 


మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో మూడు, ఉజ్జయినిలో రెండు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. డెల్టా ప్లస్ వేరియంట్ ప్రబలిందని నివేదికలు ధృవీకరించాయని ఉజ్జయిని నోడల్ అధికారి డాక్టర్ రౌనక్ చెప్పారు. డెల్టా ప్లస్ వేరియంట్ రోగుల కాంటాక్టు ట్రేసింగ్ జరుగుతుందని మంత్రి సారంగ్ చెప్పారు. డెల్టా ప్లస్ వేరియంట్ సోకిన ఐదుగురిలో నలుగురు వ్యాక్సిన్ వేయించుకున్నారని, వారంతా కోలుకున్నారని, కాని టీకా తీసుకోని రోగి మరణించారని మంత్రి చెప్పారు. అర్హులైన ప్రజలందరూ టీకాలు వేయించుకోవాలని మంత్రి కోరారు.

Updated Date - 2021-06-24T11:22:06+05:30 IST