నాలుగు గంటల Modi పర్యటన కోసం రూ.23కోట్లు ఖర్చు చేస్తున్నారు...

ABN , First Publish Date - 2021-11-13T14:22:03+05:30 IST

కేవలం నాలుగు గంటలపాటు జరిగే ప్రధాని మోదీ పర్యటన కోసం మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రూ.23 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించనుంది...

నాలుగు గంటల Modi పర్యటన కోసం రూ.23కోట్లు ఖర్చు చేస్తున్నారు...

భోపాల్ (మధ్యప్రదేశ్): కేవలం నాలుగు గంటలపాటు జరిగే ప్రధాని మోదీ పర్యటన కోసం మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రూ.23 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించనుంది.భగవాన్ బిర్సా ముండా జ్ఞాపకార్థం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీకి చెందిన శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం నవంబర్ 15న జనజాతీయ గౌరవ్ దివస్‌ కార్యక్రమాన్ని భోపాల్‌లోని జంబూరి మైదాన్‌లో ఏర్పాటు చేసింది.రెండు లక్షల మంది గిరిజనులను సమీకరించనున్న ఈ కార్యక్రమం కోసం సర్కారు రూ.23 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. దేశంలోనే మొట్టమొదటిసారి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించిన హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. 


జనజాతీయ గౌరవ్ దివస్‌లో భాగంగా బిర్సా ముండాతో పాటు ఇతర గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల సేవలను స్మరించుకోవడానికి నవంబర్ 15 నుంచి 22 వరకు జాతీయ స్థాయిలో వారం రోజుల కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ కార్యక్రమం కోసం మోదీ భోపాల్‌లో నాలుగు గంటలు గడపనున్నారు. మోదీ వేదికపై 1 గంట 15 నిమిషాలు ఉంటారు. దీని కోసం ఐదు గోపురాలు నిర్మిస్తున్నారు. గిరిజనుల కోసం పెద్ద పెద్ద పండల్స్ కూడా నిర్మించారు. వారం రోజులుగా 300 మందికి పైగా కార్మికులు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు.


మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.13 కోట్ల ప్రజాధనంతో జంబోరీ మైదాన్‌లో జరిగే కార్యక్రమానికి ప్రజలను తరలించనుంది.వేదిక మొత్తం గిరిజన కళలు ,గిరిజన ఇతిహాసాల చిత్రాలతో అలంకరించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 52 జిల్లాల నుంచి వచ్చే ప్రజల రవాణా, ఆహారం, వసతి కోసం రూ.12 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. ఐదు గోపురాలు, గుడారాలు, అలంకరణ, ప్రచారానికి రూ.9 కోట్లకు పైగా ఖర్చు అవుతోంది. హబీబ్‌గంజ్‌ రైల్వే స్టేషన్‌కు మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టాలని భోపాల్‌ ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌తో సహా పలువురు బీజేపీ నేతలు డిమాండ్‌ చేసినప్పటికీ, గోండు పాలకుడు రాణి కమలాపతి పేరును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.


భారతదేశంలోనే అత్యధిక గిరిజన జనాభా మధ్యప్రదేశ్‌లో ఉంది.ఒకవైపు గిరిజనుల కోసం పెద్ద సమావేశం పెడుతున్న బీజేపీ సర్కారు ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా షెడ్యూల్డ్ తెగలపై 2,401 అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా చెబుతోంది. మధ్యప్రదేశ్‌లో 2019లో ఈ సంఖ్య 1,922 కాగా, 2018లో 1,868కి పెరిగింది. రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో గిరిజనులపై అఘాయిత్యాలు 28 శాతం పెరిగాయి.

Updated Date - 2021-11-13T14:22:03+05:30 IST