కాకి నమూనాలతో బైక్‌పై 350 కిలోమీటర్లు.. ప్రశంసలే, ప్రశంసలు!

ABN , First Publish Date - 2021-01-12T03:17:13+05:30 IST

బర్డ్ ఫ్లూ నేపథ్యంలో కాకి నమూనాలతో కుమారుడి బైక్‌పై 350 కిలోమీటర్లు వెనక కూర్చుని ప్రయాణించిన

కాకి నమూనాలతో బైక్‌పై 350 కిలోమీటర్లు.. ప్రశంసలే, ప్రశంసలు!

నివారి (మధ్యప్రదేశ్): బర్డ్ ఫ్లూ నేపథ్యంలో కాకి నమూనాలతో కుమారుడి బైక్‌పై 350 కిలోమీటర్లు వెనక కూర్చుని ప్రయాణించిన పశువైద్యుడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విషయం తెలిసిన ముఖ్యమంత్రి కూడా ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. మధ్యప్రదేశ్‌లో జరిగిందీ ఘటన.


పృథ్వీపూర్ ప్రాంతానికి చెందిన ఆర్‌పీ తివారి (54) అసిస్టెంట్ పశువైద్యాధికారి. కాకి నమూనాలు తీసుకుని ఆదివారం భోపాల్ రావాల్సిందిగా ఉన్నతాధికారులు ఆయనను ఆదేశించారు. అయితే, పృథ్వీపూర్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉండే టికమ్‌గఢ్ వెళ్లే సరికి అతడు ఎక్కాల్సిన బస్సు వెళ్లిపోయింది. ఆ రాత్రికి రైలు టికెట్లు కూడా దొరక్కపోవడంతో తివారి ఆలోచనలో పడ్డారు. 


రెండు ప్రయత్నాలు ఫలించకపోవడంతో కుమారుడి మోటారు సైకిలుపై వెనక కూర్చుని భోపాల్ వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తివారి తెలిపారు. ఎముకలు కొరికే చలిలో నివారి నుంచి 350 కిలోమీటర్లు ప్రయాణించి ఎట్టకేలకు ఆదివారం భోపాల్ చేరుకుని బర్డ్ ఫ్లూ పరీక్షల కోసం కాకి నమూనాలు అందించారు. 


విషయం తెలిసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్ ద్వారా తివారిని ప్రశంసించారు. ఆయన ఉత్సాహానికి శాల్యూట్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. అంకితభావానికి, బలమైన సంకల్పానికి ఆయనో గొప్ప ఉదాహరణ అని కొనియాడారు. 

Updated Date - 2021-01-12T03:17:13+05:30 IST