ధర్మాన్ని ఆచరించడమే ముఖ్యం

ABN , First Publish Date - 2020-05-23T07:40:36+05:30 IST

ఆధ్యాత్మికత అంటే ఒక మతం కాదు. అన్ని మతాలూ ఏ లక్ష్య సాధన దిశగా విభిన్న మార్గాలను, సాధనా పద్ధతులను ప్రతిపాదిస్తున్నాయో..

ధర్మాన్ని ఆచరించడమే ముఖ్యం

ఆధ్యాత్మికత అంటే ఒక మతం కాదు. అన్ని మతాలూ ఏ లక్ష్య సాధన దిశగా విభిన్న మార్గాలను, సాధనా పద్ధతులను ప్రతిపాదిస్తున్నాయో.. ఆ లక్ష్యమే, ఆ గమ్యమే ఆధ్యాత్మికత. లౌకికంగా చూస్తే.. శాంతిగా, ప్రశాంతిగా, సంతృప్తిగా, ఆనందంగా సగటు మనిషి జీవించటానికి ఉపకరించే, సహాయపడే ఆలోచనా విధానమే ఆధ్యాత్మికత. మానవ సహజమైన అహంకార మమకారాల చేత, స్వార్థపరత్వం వలన, మానవాళి జీవన స్రవంతి కట్టు తప్పకుండా, కట్టు దాటకుండా కట్టడి చేయటానికి తోడ్పడేదే ఆధ్యాత్మికత. పారమార్థికంగా చూసినప్పుడు.. భగవంతుని అనుగ్రహం పొందడానికి, ఆయన ప్రేమను పొందడానికి, భగవానుని ఆశీస్సులతో నిత్యజీవితంలో ఎదురయ్యే కష్టనష్టాల కడలిలో ఉపశమనం పొందడానికి, ఊరట కలగడానికి ఉద్దేశించినదే ఆధ్యాత్మికత. ఇందుకోసం కొన్ని మౌలిక సత్యాలను తరచూ మననం చేసుకుంటూ తదనుగుణంగా జీవన యాత్ర సాగించడమే మానవ ధర్మం. బతుకు బండి భయం భయంగా సాగకుండా మనఃపూర్వకంగా మిట్టపల్లాలను అధిగమిస్తూ, ఉన్నంతలో సంతృప్తిగా, సంతోషంగా, జీవన విధానాన్ని తీర్చిదిద్దేదే ఆధ్యాత్మికత.


అయితే ఆధ్యాత్మికాంశాలను, వేదాంతపరమైన అంశాలను, గురువుల బోధనను, మత గ్రంథాలలో ప్రస్తావింపబడిన విషయాలను కొంతవరకైనా అవగాహన చేసుకొని ఆచరణలో ఉంచడం ప్రధానం. ఆచరణ లేకుండా ఎందరు ఆధ్యాత్మిక గురువుల చరణాలను పట్టుకున్నా, ఎన్ని ప్రబోధాలు విన్నా, ఎన్ని గ్రంథాలు పారాయణం చేసినా ప్రయోజనం ఉండదు. ఆధ్యాత్మిక విషయాలన్నింటినీ తెలుసుకొని ఆచరణలో పెట్టకుండా కాలక్షేపం చేయడం ఎటువంటిదంటే.. వంటకు కావాల్సిన సరుకులను, సంభారాలను, వంట సామాగ్రిని సిద్ధం చేసుకున్నాక.. వంట చేసుకొని కడుపారా భుజింపకుండా ఉండటం లాంటిది. సాధారణంగా మనం.. రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలను చదువుతుంటాం. ఎవరైనా పండితులు, పీఠాధిపతులు, సద్గురువులు అందులోని అంశాలను చెబుతుండగా శ్రద్ధగా వింటుంటాం. కానీ రామాయణం ప్రబోధించినధర్మాలను, జీవన విధానాలను ఆచరణలో ఎంతవరకూ ఉంచగల్గుతున్నామనేది ప్రశ్నార్థకం. 


ఏ మతమూ పరమతాలను దూషించాలని, కించపరచాలని చెప్పలేదు. సత్య, ధర్మాలను ఆచరణలో ఉంచాలని,  క్షమాగుణం పెంచుకోవాలని, పరోపకారానికి పూనుకోవాలని, ప్రేమతత్వాన్ని పెంచుకుని, పంచుకోవాలనే అన్ని మతగ్రంథాలూ చెబుతున్నాయి. కానీ, వాస్తవ పరిస్థితులు తదనుగుణంగా కన్పించట్లేదు. తెలిసిన ధర్మాలను, తెలుసుకున్న నీతిసూత్రాలను, పూజించే దేవుడి వాక్కులను పాటించకపోవడమే అందుకు కారణం. నిత్యం రామాయణ పారాయణం చేసే పెద్ద మనిషి ఆస్తి పంపక వ్యవహారాలకు సంబంధించి సోదరునిపై కోర్టులో దావా వేస్తే ఏమి గతి? భగవద్గీతను కంఠోపాఠం చేసిన విద్వాంసుల్లో.. తాను దేహాన్ని గాదని, దేహినని ఆత్మ స్వరూపాన్నని, మరణం దేహానికే గానీ ఆత్మకు గాదని విశ్వసించి జరామరణాల గురించి చింతించక నిబ్బరంగా, స్థితప్రజ్ఞతతో ఉండేవారు ఎంత మంది ఉంటారు? ఆ గ్రంథాలన్నీ చెబుతున్నదంతా ఆధ్యాత్మికతే. మంచిని చేయాలని, చెడు చేయవద్దని మనను ప్రోత్సహించే ఆ గ్రంథాలను చదివి.. ఆ ధర్మాన్ని తెలుసుకుని.. ఆచరించకపోవడమే అసలు

సమస్య.



- మాదిరాజు రామచంద్రరావు, 93933 24940

Updated Date - 2020-05-23T07:40:36+05:30 IST