‘పంజరంలో చిలుక’ సీబీఐని వదిలిపెట్టండి : హైకోర్టు

ABN , First Publish Date - 2021-08-18T21:03:46+05:30 IST

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)పై ప్రభుత్వ పాలనాపరమైన నియంత్రణ

‘పంజరంలో చిలుక’ సీబీఐని వదిలిపెట్టండి : హైకోర్టు

చెన్నై : కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)పై ప్రభుత్వ పాలనాపరమైన నియంత్రణ లేకుండా చట్టబద్ధ హోదా కల్పించే చట్టాన్ని ఆమోదించి, అమలు చేయడం గురించి పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ‘పంజరంలో చిలుక’ను విడుదల చేసే ప్రయత్నాల్లో భాగంగా సీబీఐ పని తీరును మెరుగుపరిచేందుకు అనేక ఆదేశాలను జారీ చేసింది. కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్), ఎన్నికల కమిషన్ తరహాలో చట్టబద్ధ హోదా ఇస్తేనే సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తి వస్తుందని తెలిపింది. కాగ్ కేవలం పార్లమెంటుకు మాత్రమే జవాబుదారీ అని గుర్తు చేసింది. 


సాధ్యమైనంత త్వరగా సీబీఐకి మరిన్ని అధికారాలు కల్పించాలని, అధికార పరిధిని పెంచాలని తెలిపింది. ప్రత్యేకంగా బడ్జెట్‌ను కూడా కేటాయించాలని తెలిపింది. ప్రభుత్వ కార్యదర్శితో సమానమైన అధికారాలను సీబీఐ డైరెక్టర్‌కు కల్పించాలని పేర్కొంది. సీబీఐ డైరెక్టర్ నేరుగా ప్రధాన మంత్రికి జవాబుదారీగా ఉండాలని తెలిపింది. అమెరికాలోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)తో సమానంగా ఆధునిక సదుపాయాలు కల్పించాలని పేర్కొంది. 


చిట్ ఫండ్ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. 


సీబీఐని ‘పంజరంలో చిలుక’గా సుప్రీంకోర్టు 2013 మే నెలలో అభివర్ణించింది. ‘యజమాని చెప్పిన మాటలను పలుకుతుంది’ అని పేర్కొంది. బొగ్గు క్షేత్రాలకు లైసెన్సుల కేటాయింపులకు సంబంధించిన కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో యూపీయే ప్రభుత్వంపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు సీబీఐ కార్యకలాపాల్లో రాజకీయ జోక్యంపై చర్చకు దారి తీశాయి. 


సీబీఐ ప్రధాన మంత్రి కార్యాలయం పరిధిలోని సిబ్బంది, శిక్షణ శాఖ (డీవోపీటీ) నియంత్రణలో పని చేస్తుంది. 


Updated Date - 2021-08-18T21:03:46+05:30 IST