Abn logo
Sep 19 2021 @ 10:04AM

మధ్యప్రదేశ్‌ నుంచి మురుగన్‌కు అవకాశం

             - అక్కడి నుంచే రాజ్యసభకు...


చెన్నై: కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి డాక్టర్‌ ఎల్‌.మురుగన్‌ మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ మేరకు బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. దీంతో మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే మూడో రాష్ట్ర బీజేపీ నేతగా ఆయన రికార్డులకెక్కనున్నారు. గతంలో కేంద్రమంత్రులుగా పనిచేసిన తిరునావుక్కరసర్‌, ఇల గణేశన్‌ కూడా మధ్యప్రదేశ్‌ నుంచే రాజ్యసభకు నియమితులయ్యారు. నిజానికి కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి నుంచి మురుగన్‌కు అవకాశముంటుందని అందరూ భావించారు. కానీ అక్కడి స్థానాన్ని వదులుకునేందుకు ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఏమాత్రం ఇష్టపడకపోవడంతో మురుగన్‌ను మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు పంపాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. గత శాసనసభ ఎన్నికల తర్వాత బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్న ఎల్‌.మురుగన్‌ కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ఆయనను మత్స్యశాఖ మంత్రిగా నియమించారు. మురుగన్‌ ప్రస్తుతం లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా లేరు. కేంద్ర మంత్రి పదవి పొందిన మురుగన్‌ ఆరుమాసాలలోపున లోకసభ లేదా రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కావాల్సి ఉంది. పుదుచ్చేరిలో ఖాళీపడిన రాజ్యసభ స్థానానికి పోటీ చేయాలని బీజేపీ భావిస్తుండటంతో మురుగన్‌ ఆ సీటుకు పోటీ చేస్తారని వార్తలు కూడా వెలువడ్డాయి. అయితే మురుగన్‌ మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తారని బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. అందులో ఒకదాని నుంచి మురుగన్‌ ఎంపిక కానున్నారు. గతంలో ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి చెందిన ఎస్‌.తిరునావుక్కరసర్‌ కూడా కేంద్రమంత్రిగా నియమితుడై, మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం మణిపూర్‌ గవర్నర్‌గా ఉన్న ఇల గణేశన్‌ కూడా మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మురుగన్‌ కూడా అదే బాట పట్టనున్నారు.