మాపియా డెన్‌... పరిగి టౌన్‌?

ABN , First Publish Date - 2021-11-30T05:07:00+05:30 IST

అక్రమ వ్యాపారాలకు పరిగి పట్టణం కేంద్ర బిందువుగా మారింది. ఇటీవల వెలుగుచూసిన దందాలే దీనికి తార్కాణాలు.

మాపియా డెన్‌... పరిగి టౌన్‌?

  • కలప, కల్తీ టీపొడి, జీరో దందాలకు అడ్డా! 
  • అధికారులను మేనేజ్‌ చేస్తూ అక్రమ వ్యాపారాలు
  • రేషన్‌ బియ్యం, మత్తుపదార్థాల సరఫరా 
  • అన్ని శాఖల చర్యలతోనే అక్రమాలకు చెక్‌

అక్రమ వ్యాపారాలకు పరిగి పట్టణం కేంద్ర బిందువుగా మారింది. ఇటీవల  వెలుగుచూసిన దందాలే దీనికి తార్కాణాలు. అక్రమ రేషన్‌ బియ్యం, నల్లబెల్లం, కల్తీకల్లు తయారీకి వినియోగించే రసాయనాలు, కలప రవాణా, కల్తీ టీ పౌడర్‌, గంజాయి, మత్తు పదార్థాల అమ్మకం, వినియోగం ఇలా అనే రకాల చట్టవ్యతిరేక కార్యకలాపాలకు  కేంద్రంగా చేసుకుటున్నారు  అక్రమార్కులు.


పరిగి: వికారాబాద్‌ జిల్లాలోని పరిగి పట్టణాన్ని అక్రమార్కులు అడ్డాగా చేసుకుంటున్నారు. పరిగి చిన్న పట్టణమే అయినా సరిహద్దు. నాలుగైదు జిల్లాలకు అక్రమ రవాణా, వ్యాపార లావాదేవీలకు అడ్డాగా మారింది. పరిగిలో నిర్వహించే వివిధ చట్టవ్యతిరేక వ్యాపారాలతో అక్రమార్కులు రూ.కోట్లు గడిస్తున్నారు. మొన్న ఇసుక అక్రమ,  రవాణా, మత్తు పదార్థాల అమ్మకం, నిన్న అక్రమంగా రేషన్‌ బియ్యం సరఫరా, గంజాయిదందా, జీరో వ్యాపారం తాజాగా కల్తీ టీ పౌడర్‌! ఇలా పరిగి కేంద్రంగా రోజూ ఏదో ఒక అక్రమ వ్యాపారం బయటకొస్తోంది. ఒక్కో దందా ఒక్కో శాఖ పరిధిలోకి రావడంతో అధికారులు దేన్నీ పూర్తిగా పట్టించుకోవడం లేదు. కొందరు లంచాలకు మరిగి అక్రమాలను చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. పరిగిలో అక్రమ బియ్యం, బెల్లం, కల్తీకల్లు తయారీకి వినియోగించే రసాయనాలు, కలప, గంజాయి, కల్తీ టీ పౌడర్‌, మత్తు పదార్థాల సరఫరా, కలప.. ఇలా వెలుగు చూసిన అక్రమ వ్యాపారాలకు ఈ ప్రాంతాన్ని అక్రమార్కులు ఎలా అనూకలంగా మార్చుకున్నారో తెలియజేస్తున్నాయి.

టీ పౌడర్‌ కూడా విషతుల్యమే!

గత గురువారం రాత్రి క్వింటాళ్ల కొద్దీ కల్తీ చాయిపత్తి దొరకడంతో అధికార యంత్రాంగం సైతం ఆశ్చర్యానికి గురైంది. ఉదయం లేవగానే సేవించే టీతోనే మనపై కల్తీ పదార్థాల దాడి మొదలవుతోందని ప్రజలు హతాశులయ్యారు. అక్రమార్కుల డబ్బు ఆశకు ప్రజల ప్రాణాలు పణంగా పెడుతున్నారు. కొందరు వ్యాపారులు ఏళ్లుగా అక్రమ దందాల్లో అరితేరారు. ఏది లాభసాటిగా ఉంటే దాన్ని చేపడుతున్నారు. తక్కువ సమయంలో కోటీశ్వరులు కావడమే వారి లక్ష్యం. కేసులకూ భయంపడటం లేదు! ఆరేడేళ్ల వ్యవధిలోనే ఒకరిద్దరు హవాలా వ్యాపారులు అనేకమార్లు పట్టుబడినా వారిపై నామమాత్రపు కేసులే నమోదు చేశారు. అక్రమ దందాకు ఉన్నతాధికారులు పటిష్ట చర్యలు తీసుకోవడం లేదు. రేషన్‌ బియ్యం, నిషేధిత పదార్థాలు అమ్ముతూ పట్టుబడినవారిపై పీడీ యాక్ట్‌ కేసులు పెట్టేందుకు అధికారులు వెనుకంజ వేస్తున్నారు. అంటే వారు ఏ స్థాయిలో మేనేజ్‌ చేస్తున్నారో అర్థమవుతోంది. అధికారుల చేతులు తడపడం వల్లే అక్రమార్కుల దందా కొనసాగుతోందనే ఆరోపణలూ ఉన్నాయి. ‘దొరికితే దొంగ... లేదంటే దొర’ అన్న చందగా ఉంది వారి వ్యాపారం. గత మార్చిలో పరిగిలో జీరో దందాతో భారీగా కూల్‌డ్రింక్‌లు, ఇతర సరుకులు పట్టుబడ్డాయి. తొమ్మిది నెలల గడిచినా ఈ కేసులో పురోగతి లేదు. బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారో అధికారులకే తెలియాలి. ఈ కేసు తమ పరిధికి రాదని అప్పట్లో పోలీసులు వాణిజ్య పన్నుల శాఖకు లేఖ రాయడం విమర్శలకు తావిస్తోంది. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కూడా నామమాత్రపు చర్యలు తీసుకున్నారు. అక్రమ దందాకు అదుపే లేదు. ఇటీవల లభ్యమైన కల్తీ చాయిపత్తి కేసులో ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి సంఘటనలను బట్టిచూస్తే పరిగి కేంద్రంగా రకరకాల అక్రమ దందాలు జోరుగా జరుగుతున్నాయనేది సుస్పష్టం.

Updated Date - 2021-11-30T05:07:00+05:30 IST