మాఫీనామా

ABN , First Publish Date - 2021-07-23T09:49:39+05:30 IST

పశ్చాత్తాపాలూ ప్రాయశ్చిత్తాలూ రాజకీయాల్లో పెద్దగా గౌరవం ఉన్న మాటలు కావు. రాజకీయవాదులు వాటి జోలికి వెళ్లనే వెళ్లరు. వెళ్లినా గౌరవంతో వెళ్లరు....

మాఫీనామా

పశ్చాత్తాపాలూ ప్రాయశ్చిత్తాలూ రాజకీయాల్లో పెద్దగా గౌరవం ఉన్న మాటలు కావు. రాజకీయవాదులు వాటి జోలికి వెళ్లనే వెళ్లరు. వెళ్లినా గౌరవంతో వెళ్లరు. దుర్మార్గానికి, దుస్థితికి బాధ్యత స్వీకరిస్తూ, పశ్చాత్తాపం ప్రకటించడం మాత్రమే చాలదు, ఆ తప్పును సరిదిద్దడానికి నిర్మాణాత్మకమైనదేదో చేయాలి, లేదా, ఆ నేరానికి తమను తాము శిక్షించుకునే ప్రాయశ్చిత్తానికి అయినా సిద్ధపడాలి. ప్రభుత్వాలూ పాలకులే కాదు, సమాజాలు, సంస్కృతులూ కూడా తాము గతంలో చేసిన, వర్తమానంలో చేస్తున్న నేరాలకు బాధితులకు క్షమాపణలు చెప్పవలసి ఉన్నది. చెప్పిన క్షమాపణలకు పరిహారం చెల్లించవలసి ఉన్నది. మనుషులను బానిసలుగా క్రయవిక్రయాలు చేసిన సమాజాలు, పశువుల వలె ఖండాంతరాలకు తరలించి చాకిరి చేయించుకున్న సంస్కారాలు, సాటి మనుషులను అంటరానివారిగా నిర్వచించి వారిని సకల జీవనరంగాలలోనూ వెలిగా నిలిపిన సంస్కృతులూ, వలసీకరణ చేసి వనరులను దోచుకున్న సామ్రాజ్యవాదులూ, యుద్ధంలో ముంచి లోకాన్ని అల్లార్చిన నియంతలూ.. వాటి లేదా వారి మానసిక, భౌతిక, పరంపరాగత వారసులంతా బాధితుల ముందు మోకరిల్లి పాపక్షమాపణ కోరవలసి ఉన్నది. 


అంతరాత్మ మేలుకుని ఉన్నవారిని క్షమాపణ చెప్పని నేరం బాధిస్తుంది. తన ఉనికే నేరమయమని అనిపిస్తుంది. క్షమాపణలో జారే రెండు కన్నీటిచుక్కలు మొత్తం పాపాన్నీ నేరాన్నీ కడిగివేయలేకపోవచ్చును కానీ, నిష్కృతి కోసం న్యాయం కోసం అసమాపక వాక్యంలాగా నిరీక్షిస్తున్న బాధిత హృదయానికి ఉపశమనం కలిగిస్తుంది. బుధవారం నాడు రాజ్యసభలో రాష్ట్రీయజనతాదళ్ సభ్యుడు ప్రొఫెసర్ మనోజ్ ఝా ఉద్వేగపూరితంగా పఠించిన ‘మాఫీనామా’ (క్షమాపణ) బాధితులతో పాటు, దోషులను కూడా కొంత ఊరడించింది. ఎవరి మనసుల్లో అయినా జరుగుతున్నవాటికి తమ బాధ్యత గురించిన బాధ లవలేశమన్నా ఉండి, దానికి వ్యక్తీకరణ దొరకని వారుంటే, వారికి ఈ పశ్చాత్తాప ప్రకటన కొంత బరువు తగ్గించింది. ఝా చేసిన ఎనిమిది నిమిషాల ప్రసంగం, రాజకీయాల కోసం చేసినదే అయితే, తన రాజకీయపార్టీ వైఖరి ప్రకారం ప్రస్తుత కేంద్రప్రభుత్వాన్ని, జాతీయ నాయకత్వాన్ని తీవ్రంగా విమర్శించి ఊరుకునేవారు. అట్లాకాక, స్వాతంత్ర్యానంతర భారత ప్రభుత్వాలన్నిటి బాధ్యతనూ పేర్కొని తప్పులను ఎంచారు కాబట్టి ఆయన ప్రకటనకు గౌరవం ప్రాధాన్యం లభించాయి. 


‘‘ఎవరెవరైతే అనామకంగా మరణించారో, గంగలో తేలిన ఏ శవాలను మనం కొవిడ్ మరణాలు కావని నిరాకరించామో, ఎవరైతే తమ మరణాలతో మన వైఫల్యాలకు ఆనవాళ్లుగా మిగిలారో’’ వారందరికీ క్షమాపణ చెబుతూ మనోజ్ ఝా బుధవారం నాడు తన ప్రసంగం మొదలుపెట్టారు. అనామకంగా మరణించిన వారందరికీ ఈ సభ ఒక సామూహిక క్షమాపణ చెప్పాలని కోరారు. ఈ దేశంలోను, ఈ సభలోను, బయటా ఎవరైనా తమ ఆత్మీయులను కోల్పోనివారు ఒక్కరైనా ఉన్నారా అని ఆయన ఉద్వేగంగా ప్రశ్నించారు. ‘‘అధికారంలో ఉన్న ప్రభుత్వం గత 70 సంవత్సరాలుగా జరిగిందేమీ లేదని అంటుంది. నేను వారి గురించి మాట్లాడను. 1947 నుంచి అధికారంలో ఉన్నవారందరి సమష్టి వైఫల్యం ఇది. ఈ సభ నుంచి బయటకు వెళ్లగానే పెద్ద పెద్ద హోర్డింగులు కనిపిస్తాయి, ఉచిత టీకాలు, ఉచిత చికిత్స, ఉచిత రేషన్ అంటూ. ఇది సంక్షేమ రాజ్యం కాదా, సబ్బుబిళ్ల కొనుక్కునే పేదవాడు కూడా అదానీ, అద్వానీ వంటి పన్ను చెల్లింపుదారుడే. ఉచితం ఉచితం అంటూ ఎందుకు అతనిని కించపరుస్తున్నారు? ఏదీ ఉచితం కాదు. అతను కూడా ఒక భాగస్వామి, ప్రభుత్వానికి అతని పట్ల బాధ్యత ఉన్నది...’’ అని ఝా తీవ్రమైన విధాన విమర్శ చేశారు. 


మరణాలను అంకెలుగా మాత్రమే చూసి, వాటిని కూడా తగ్గించి చూపి, నిరాకరించి కొవిడ్ కల్లోల కాలంలో ప్రభుత్వాలు వ్యవహరించిన తీరు అమానుషమైనది. వైద్య ఆరోగ్యవ్యవస్థ ఉన్నంతలో చేసిన సేవను అభినందించవలసినదే కానీ, ఆ వ్యవస్థ ఇంత అధ్వాన్నంగా ఉండడానికి చారిత్రక కారణాలను విస్మరించలేము. ఆక్సిజన్ లోపం వల్ల మరణాలేవీ జరగలేదని అనడం ఒక ఎత్తు అయితే, ప్రతిపక్షాలు విమర్శించిన తరువాత రాష్ట్రాలు లెక్కలు పంపలేదని వివరణ ఇవ్వడం మరీ దుర్మార్గం. కళ్ల ఎదుట పచ్చిగా కనిపిస్తున్న సత్యాలను కూడా పవిత్రమైన చట్టసభలలో నిరాకరించారంటే సున్నితత్వం ఎంతగా అంతరించిందో అర్థం చేసుకోవచ్చు. వైద్య ఆరోగ్యరంగాలకు గత ఏడు దశాబ్దాలుగా చేసిన బడ్జెట్ కేటాయింపుల గురించిన సమీక్ష ప్రస్తుత కర్తవ్యం. జరిగినదానికి ఏమీ చేయలేము. కానీ, శుష్క పశ్చాత్తాపం కూడా ఉపయోగం లేనిది. ఝా చేసినది అరణ్యరోదన మాత్రమే. బాధ్యత వహించడానికి, దిద్దుబాటు చేయడానికి పాలకశ్రేణి సిద్ధంగా లేదు.


ఎన్ని చట్టాలు చేస్తున్నారు, ఆరోగ్య హక్కు చట్టం చేయండి, పనిహక్కుకు గ్యారంటీ ఇవ్వండి అని ఝా అడిగారు. ఝా ఆవేదన దేశంలోని అనేకులను ఎందుకు కదిలించిందంటే, అది రాజకీయ భాషను అధిగమించి, హృదయాలను తాకింది. కొవిడ్ మృత్యువును సొంత బాధగా భావిస్తేనే, పరిష్కారం ఆలోచించగలమని ఆయన అన్నమాట నిజం. ‘‘నాకు చాలా బాధ కలిగింది, గంగలో తేలియాడిన శవాలు.. చాలా హీనమైన చావులను మనం చూశాము.. నేను మేలుకొనాలని, మిమ్మల్నీ మేల్కొల్పాలని ప్రయత్నిస్తున్నాను.. మనం దిద్దుబాటు చేయకపోతే భవిష్యత్తు క్షమించదు..’’ ఈ మాటలు రాజకీయ నేతల విశాలమైన ఛాతీల వెనుక ఉన్న గుండెలను తాకాలని ఆశిద్దాము.

Updated Date - 2021-07-23T09:49:39+05:30 IST