VMRDA: అంతుబట్టని మాస్టర్‌ ప్లాన్‌!

ABN , First Publish Date - 2021-07-10T05:30:00+05:30 IST

విశాఖపట్నం..

VMRDA: అంతుబట్టని మాస్టర్‌ ప్లాన్‌!

వివరాలు లేకుండా ప్రజలకు ఉత్తుత్తి మ్యాపులు

ఎక్కడా కనిపించని అధికారుల పేర్లు, సంతకాలు

అప్రూవ్డ్‌ లేఅవుట్లు మీదుగా రహదారులు

గెడ్డలు, చెరువులు మీదుగా రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు

ఎప్పుడంటే...అప్పుడు మార్చుకునేందుకు ‘ప్లాన్‌’

మిక్స్‌డ్‌ జోన్‌గా కాపులుప్పాడ

శాటిలైట్‌ టౌన్‌షిప్‌ల ఊసే లేదు

తూతూమంత్రంగా ప్రజాభిప్రాయ సేకరణ


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) రాబోయే 20 ఏళ్ల కోసం రూపొందించిన ‘మాస్టర్‌ ప్లాన్‌-2041’లో ఒక్క అంశం కూడా ప్రజలెవరికీ అర్థం కావడం లేదు. అర్థమైతే అభ్యంతరాలు ఎక్కువ వస్తాయని...అందుకే అలా రూపొందించారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 


మాస్టర్‌ ప్లాన్‌ ఏమిటనేది ఇప్పటివరకు ఏ ఒక్కరికీ వివరించి చెప్పలేదు. సభలు, సమావేశాలు నిర్వహించలేదు. ప్లాన్‌ను ప్రభుత్వం ఓకే చేసిన తరువాత సభలు పెడతామని చెబుతున్నారు. అప్పుడు పెట్టినా...పెట్టకపోయినా ఒక్కటే. ప్రస్తుతం ప్లాన్‌ కాపీ(మ్యాప్‌లు)లను వీఎంఆర్‌డీఏ, జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో పెట్టి అభ్యంతరాలు వుంటే చెప్పాలంటూ ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఆ మ్యాపుల్లో ఎక్కడా గ్రామాల పేర్లు, అక్కడ ఇప్పటికే వున్న రహదారులు, కొత్తగా వేయబోయే రోడ్లు ఏమిటనేది వివరించలేదు. రకరకాల రంగులు వేసి, వాటికి కోడింగ్‌ ఇచ్చారు. అవి ఎవరికీ అర్థం కావడం లేదు. చెరువులు, గెడ్డలు మార్కింగ్‌  చేయలేదు. జోనింగ్‌ విధానం అర్థం కావడం లేదు. శాటిలైట్‌ టౌన్‌షిప్‌లు ఎక్కడో తెలియదు. చాలా గందరగోళంగా, అర్థం కాని విధంగా తయారుచేశారు. 


అడ్డదిడ్డంగా మాస్టర్‌ప్లాన్‌ రహదారులు

మాస్టర్‌ప్లాన్‌ను ముఖ్యంగా పరిపాలనా రాజధాని కార్యాలయాలు వచ్చే భీమిలి మండలం కాపులుప్పాడ, అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటయ్యే భోగాపురాన్ని దృష్టిలో వుంచుకొని తయారుచేశారు. రహదారుల సంఖ్య పెంచడానికి ప్రయత్నం చేశారు. అందుకోసం ఆకాశానికి నిచ్చెనలు వేశారు. వీఎంఆర్‌డీఏ చరిత్రలో ఐదు కి.మీ.కు మించి ఏ మాస్లర్‌ప్లాన్‌ రహదారి వేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు కి.మీ. కొద్దీ రహదారులను ఎక్కడికక్కడ ప్రతిపాదించారు. ఇటు జాతీయ రహదారి, అటు బీచ్‌ కారిడార్‌ ఉన్నాయి. ఈ రెండింటికి మధ్య ఆ రహదారులకు సమాంతరంగా మరికొన్ని రహదారులను ప్రతిపాదించారు. ఇవి ఎంతవరకు అవసరం అనేది ముఖ్యం. ఇప్పటివరకు జాతీయ రహదారిని, బీచ్‌ రోడ్డును కలుపుతూ రహదారులు వేశారు. ఇప్పుడు జాతీయ రహదారికి సమాంతరంగా రహదారులు వేస్తామని ప్రకటించారు. పాత మాస్టర్‌ ప్లాన్‌ రహదారులు ఎన్ని?, కొత్తగా వేయబోయేవి ఎన్ని? అనే వివరాలు ఎక్కడా ఇవ్వలేదు. 


200 లేఅవుట్లకు నష్టం... కొన్నవారికి దేవుడే దిక్కు!!

విశాఖ నుంచి భోగాపురం వరకు బీచ్‌ కారిడార్‌ ఆరు వరుసలతో ప్రతిపాదించారు. ఈ కారిడార్‌ను భీమిలిలో అడ్డగోలుగా దారిమళ్లించి కొందరికి అనుకూలంగా మార్చుకున్నారు. దీంతో పాటు మాస్టర్‌ప్లాన్‌లో అనేక రహదారులను...ఇంతకు ముందే వుడా (వీఎంఆర్‌డీఏ) అప్రూవల్‌ ఇచ్చిన లేఅవుట్ల మీదుగా ప్రతిపాదించారు. దీనివల్ల సుమారు 200 లేఅవుట్లలో కొత్త రహదారులు వస్తాయంటున్నారు. అదే జరిగితే...అక్కడ ప్లాట్లు కొనుక్కున్న వారు నష్టపోతారు. ఒకసారి ఈ ప్లాన్‌కు ఆమోదం లభిస్తే...ఇక జీవితంలో ఆ ప్లాట్లను యజమానులు అమ్ముకోలేరు. అక్కడ రహదారి వేసేంతవరకు పరిహారమూ రాదు. దశాబ్దాలు గడిచినా ఇలా వేయకుండా మిగిలిపోయిన రహదారులు అనేకం ఉన్నాయి. కొత్త మాస్టర్‌ప్లాన్‌ వల్ల ఒక్కో లేఅవుట్‌లో సుమారు 20 ప్లాట్లు పోతాయని అనుకున్నా...మొత్తంగా చూసుకుంటే 200 లేఅవుట్లలో 4 వేల ప్లాట్లు పోతాయి. ప్రభుత్వం వారికి అక్కడ ఉన్న ధర మేరకు పరిహారం ఇచ్చే అవకాశం లేదు. 


గెడ్డలు, చెరువులు చూపించలేదు

ఏదైనా మ్యాపు తయారు చేస్తే...అందులో గ్రామాలు, అక్కడ ప్రధాన ఆలయాలు, విద్యా సంస్థలు, పరిశ్రమలు, ప్రధాన రహదారులతో పాటు గెడ్డలు, చెరువులు కాలువలు చూపించాలి. కానీ ఈ మాస్టర్‌ప్లాన్‌లో ఎక్కడా వాటిని ప్రత్యేకంగా చూపలేదు. అసలు చాలా గ్రామాల పేర్లే లేవు. కొన్ని మాస్టర్‌ప్లాన్‌ రహదారులను గెడ్డలు, చెరువుల మీదుగా వేసేశారు. దాకమర్రి దగ్గరున్న రఘు ఇంజనీరింగ్‌ కాలేజీ వద్ద చెరువు ఉంది. దాని మీదుగా మాస్టర్‌ప్లాన్‌ రహదారిని ప్రతిపాదించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించే చేశారా? అనే అనుమానాలు వస్తున్నాయి. ఎక్కడైనా చెరువులు ఉంటే...వాటి చుట్టూ బఫర్‌ జోన్‌ వదిలి పెట్టాలని ప్రభుత్వం చట్టం చేసింది. దానిని మరిచిపోయి చెరువుల మధ్య నుంచే రహదారులు వేసేయాలని ప్రతిపాదించారు. 


శాటిలైట్‌ టౌన్‌షిప్‌లు ఏవీ?

విశాఖపట్నం సహా ప్రధాన నగరాలపై ఒత్తిడి తగ్గించడానికి శాటిలైట్‌ టౌన్‌షిప్‌లు నిర్మించాలి. వాటి ప్రతిపాదన ఎక్కడా లేదు. ఆ వివరాలు లేవు. కాపులుప్పాడలో పరిపాలనా రాజధాని కార్యాలయం వస్తుందని చెబుతున్నారు. ఎక్కడైనా ఏ ప్రాంతమైనా అన్ని రకాల కార్యకలాపాలకు అవకాశం ఉండాలి. కానీ కాపులుప్పాడను ‘మిక్స్‌డ్‌ జోన్‌’గా పేర్కొంటూ...పరిశ్రమలు తప్ప ఏమైనా పెట్టుకోవచ్చునని పేర్కొన్నారు. అందులో క్లాసిఫికేషన్‌ చేయలేదు. బలహీన వర్గాలకు, దిగువ మధ్య తరగతికి హౌసింగ్‌ ఎక్కడా ప్రస్తావించలేదు. 


ఏ అధికారి సంతకం లేదు.. మ్యాప్‌ డౌన్‌లోడ్‌ కాదు

మాస్టర్‌ప్లాన్‌ మ్యాపు టిఫ్‌ చేసి వెబ్‌సైట్‌లో పెట్టారు. అది ఒకంతట డౌన్‌లోడ్‌ కావడం లేదు. అలాగే మాస్టర్‌ప్లాన్‌ రూపొందించిన అధికారుల పేర్లు, సంతకాలు, తేదీలు ఉండాలి. అవి ఎక్కడా లేవు. ఇప్పుడు ప్రజలకు ప్రదర్శించిన మ్యాపులే ఫైనల్‌ అయ్యే అవకాశం లేదు. వారికి అనుగుణంగా ఎప్పుడంటే...మార్చేసుకోవడానికి సంతకాలు పెట్టలేదని పలువురు ఆరోపిస్తున్నారు.  


గడువు పెంచాల్సిందే

ఈమాస్టర్‌ప్లాన్‌ ఎవరికీ అర్థం కాని విధంగా ఉండడంతో, దీనిని అందరికీ వివరించాక అభ్యంతరాలు స్వీకరించాలని ప్రజలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కోరుతున్నారు. ఈ నెల 15తో ముగిసే గడువును కనీసం రెండు నెలలు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

Updated Date - 2021-07-10T05:30:00+05:30 IST