చైనాలో అద్భుతం.. గాల్లో ‘తేలియాడే’ రైలు..! మతిపోగొట్టే వేగం!

ABN , First Publish Date - 2021-01-19T22:22:10+05:30 IST

పట్టాలపై తేలియాడే రైలు..అసలు చక్రాలే ఉండవ్.. గంటకు 620 కిలోమీటర్ల వేగం..! తాజాగా చైనా ఆవిష్కరించిన అద్భుతం ఇది. సౌత్‌వెస్ట్ జియటాంగ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ కొత్త రైలును ఆవిష్కరించారు. అయస్కాంత శక్తి ఆధారిత మాగ్నెటిక్ లెవిటేషన్ సాంకేతిత సాయంతో శాస్త్రవేత్తలు ఈ రైలును డిజైన్ చేశారు.

చైనాలో అద్భుతం.. గాల్లో ‘తేలియాడే’ రైలు..! మతిపోగొట్టే వేగం!

బీజింగ్: పట్టాలపై తేలియాడే రైలు..అసలు చక్రాలే ఉండవ్.. గంటకు 620 కిలోమీటర్ల వేగం..! తాజాగా చైనా ఆవిష్కరించిన అద్భుతం ఇది. సౌత్‌వెస్ట్ జియటాంగ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ కొత్త రైలును రూపొందించారు. మాగ్నెటిక్ లెవిటేషన్ సాంకేతికత సాయంతో శాస్త్రవేత్తలు ఈ రైలును డిజైన్ చేశారు. దీనికి ఎటువంటి చక్రాలు ఉండవు. కేవలం ఆయస్కాంత శక్తి సాయంతో పట్టాలపై తేలుతూ వెళుతుంది. చూసే వారికి మాత్రం ఇది గాల్లో తెలుతున్నట్టు కనబడుతుంది. ఇది గరిష్టంగా గంటకు 620 కిమీల వేగాన్ని అందుకోగలదు.


చైనా ఆవిష్కరించిన ఈ కొత్త ట్రైన్ వాస్తవానికి ఓ ప్రోటోటైప్(నమూనా నిర్మాణం)! అంటే.. రైలు డిజైన్‌లో లోటుపాట్లను పరీక్షంచేందుకు, పనితీరును పరిశీలించేందుకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. ఇటువంటి వాటిని మాగ్లెవ్ రైళ్లు అంటారు. జాపాన్‌లో దశాబ్దాల క్రితమే ఇవి అందుబాటులోకి వచ్చాయి. ఈ టెక్నాలజీలో జపాన్‌యే అగ్రగామి. అక్కడ ఇవి దాదాపు 320 కిమీల వేగంతో ప్రయాణిస్తుంటాయి. 


అయితే..అత్యాధుని సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు దూకుడుగా ముందుకెళుతున్న చైనా మాగ్లెవ్ రైళ్లు అభివృద్ధిపైన కూడా దృష్టి పెట్టింది. జాపాన్‌తో పోటీ పడుతూ ముందడుగు వేస్తోంది. ఫలితంగా..గంటకు 620 కిమీల వేగంతో వెళ్లే మ్యాగ్లెవ్ రైలు చైనాలో ఆవిష్కృతమైంది. హైటెంపరేచర్ సూపర్ కండక్టర్ టెక్నాలజీ(హెచ్‌టీఎస్)లో పూరోగతి సాధించడం ద్వారా దీన్ని రూపకల్పన చేశామని, ప్రస్తుతమున్న రైళ్లు అన్నింటికంటే ఇది వేగవంతమైనదని అక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 


చైనా శాస్త్రవేత్తలు బుధవారం నాడు దేశప్రజల కోలాహలం మధ్య దీన్ని ఆవిష్కరించారు. కానీ.. ఇది ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే మూడు నుంచి పదేళ్ల సమయం పడుతుందని సమాచారం. చైనాలోని వివిధ నగరాలను వేగవంతమైన ప్రయాణసాధనాల ద్వారా అనుసంధానం చేయాలనేది చైనా అసలు లక్ష్యం. ఇందులో భాగంగానే మ్యాగ్లెవ్ రైళ్లను అభివృధ్ధి చేస్తోంది. 

Updated Date - 2021-01-19T22:22:10+05:30 IST