మహా డ్రామా

ABN , First Publish Date - 2022-01-23T06:09:03+05:30 IST

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో అక్రమాలు, ఆక్రమణలు వెలుగుచూసినప్పుడు విచారణ పేరుతో హడావిడి చేస్తున్న అధికారులు...ఆ తరువాత ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మహా డ్రామా

విచారణలతో సరి

తదుపరి చర్యలు ఉండవు మరి

జీవీఎంసీ నాటకం

భవన నిర్మాణాలకు నిబంధనలకు విరుద్ధంగా ప్లాన్‌లు జారీ చేసినట్టు తేలినా చర్యలు శూన్యం

అధికారుల తీరుపై విమర్శలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో అక్రమాలు, ఆక్రమణలు వెలుగుచూసినప్పుడు విచారణ పేరుతో హడావిడి చేస్తున్న అధికారులు...ఆ తరువాత ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్పష్టమైన ఆధారాలు వున్నప్పటికీ ఎందుచేతనో చర్యలకు వెనుకాడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి సంబంధించి ఇటీవల జరిగిన కొన్ని ఉదంతాలను ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. 

సింహాచలం దేవస్థానానికి చెందిన సర్వే నంబర్‌ 275లో పోర్టు స్టేడియం వెనుక గల భూమిపై కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు, దేవస్థానానికి మధ్య వివాదం నడుస్తోంది. ఆ భూమికి రోడ్డు కనెక్టవిటీ లేకపోయినప్పటికీ పోర్టు నుంచి లీజుకు తీసుకున్న స్థలాన్ని చూపించి విశ్వనాథ్‌ అవెన్యూస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే సంస్థ భారీ అపార్టుమెంట్‌ నిర్మాణానికి ఆన్‌లైన్‌లో అనుమతి తీసుకుంది. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించడంతో జీవీఎంసీ అధికారులు అప్రమత్తమై సదరు సంస్థకు నోటీసులు ఇచ్చి, తర్వాత ఆన్‌లైన్‌లో జారీచేసిన ప్లాన్‌ను ఉపసంహరించారు. ప్లాన్‌ జారీకి టౌన్‌ప్లానింగ్‌లోని కొంతమంది అధికారులు సహకరించారంటూ అభియోగాలు రావడంతో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, కమిషనర్‌ డాక్టర్‌ లక్ష్మీషా ప్రకటించారు. రెండు నెలలైంది. విచారణ ఎంతవరకు వచ్చింది?, ఎవరిని బాధ్యులుగా గుర్తించారు?, వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?...అనే ప్రశ్నలకు జీవీఎంసీ అధికారుల వద్ద సమాధానం లేదు. 

అలాగే ఎండాడ సర్వే నంబర్‌ 92/3లో 12 ఎకరాలను  రాష్ట్ర ప్రభుత్వం హయగ్రీవ డెవలపర్స్‌కు కేటాయించింది. అయితే నిబంధనలను ఉల్లంఘించడంతోపాటు భూమి వినియోగానికి సంబంధించి ఇచ్చిన కాలపరిమితి దాటిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్‌ ఉంది. కానీ ఆ భూమిలో అపార్టుమెంట్‌ నిర్మాణానికి ఆన్‌లైన్‌లో ప్లాన్‌ జారీ అయిపోయింది. దీని వెనుక స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ గన్నమని వెంకటేశ్వరరావు

(జీవీ)తోపాటు మరికొందరు అధికార పార్టీ పెద్దలు వుండడంతో టౌన్‌ప్లానింగ్‌ విభాగంలోని ఉన్నతాధికారులు ఇందుకు సహకరించినట్టు అభియోగాలు ఉన్నాయి. దీనిపై కూడా విచారణ జరుపుతామని, ఆన్‌లైన్‌లో జారీచేసిన ప్లాన్‌ను రద్దు చేస్తామని జీవీఎంసీ కమిషనర్‌ ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే టౌన్‌ప్లానింగ్‌ అధికారులు హడావిడిగా కొన్ని అభ్యంతరాలను వ్యక్తంచేస్తూ బిల్డర్‌కు నోటీసు ఇచ్చారు. అటునుంచి సమాధానం కూడా వచ్చింది. దీనిని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేస్తున్నారని జీవీఎంసీ అధికారులే ఆరోపిస్తున్నారు. అలా చేయడం వల్ల సదరు బిల్డర్‌ కోర్టుకు వెళ్లి తనకు  అనుకూలంగా ఆర్డరు తెచ్చుకునేందుకు వీలు కల్పించినట్టవుతుందని అంటున్నారు. పైన పేర్కొన్న రెండు భవనాలకు ప్లాన్‌ తయారుచేసి, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌ ఒక్కరే కావడం విశేషం. అతనే నగరంలోని పెద్ద బిల్డర్లకు సంబంధించిన ప్లాన్లను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తుంటారని, అతనితో టౌన్‌ప్లానింగ్‌ ఉన్నతాధికారులకు ముందస్తు అవగాహన ఉండడం వల్లే ఎన్ని లొసుగులు ఉన్నా...సరే ఆన్‌లైన్‌లో ప్లాన్‌లు అప్రూవ్‌ అయిపోతుంటాయని పేర్కొంటున్నారు.

తాజాగా కేఆర్‌ఎం కాలనీలో తన స్థలంలో తారురోడ్డు వేసేశారంటూ ఒక వ్యక్తి జీవీఎంసీ కమిషనర్‌, మేయర్‌తోపాటు ఎంపీ విజయసాయిరెడ్డికి ఫిర్యాదుచేశారు. దీనివెనుక స్థానిక కార్పొరేటర్‌ భర్త మొల్లి అప్పారావు ఉన్నారని, స్థలం డెవలప్‌మెంట్‌కు అడిగితే తాను ఇవ్వలేదనే కక్షతో ఆయన ఉద్దేశపూర్వకంగానే ఇలా చేయించారని ఆరోపించారు. దీనిపై తక్షణం విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని మేయర్‌ హరివెంకటకుమారి ఆదేశించారు. ఈ మేరకు ఈనెల 12న సీసీపీ విద్యుల్లత, సిటీప్లానర్‌ ప్రభాకర్‌, డిప్యూటీ సిటీ ప్లానర్‌ రాంబాబు ఇతర సిబ్బంది అక్కడకు వెళ్లి సర్వే చేశారు. అంతే అక్కడితో ఆ విషయం మరుగునపడిపోయింది. ఇంతవరకు దీనిపై నివేదిక లేదు. ఏదైనా అక్రమం లేదా అన్యాయం జరిగినట్టు వెలుగులోకి రాగానే జీవీఎంసీ పాలకులు విచారణ పేరుతో ప్రజల దృష్టిని మళ్లించేస్తున్నారు. ఆ తర్వాత ఆ విషయాన్ని అందరూ మర్చిపోతారు కాబట్టి, దానిని పక్కనపెట్టేస్తున్నారు. 

Updated Date - 2022-01-23T06:09:03+05:30 IST