రోడ్లను హేమామాలిని బుగ్గలతో పోల్చిన మంత్రి.. అనంతరం క్షమాపణ

ABN , First Publish Date - 2021-12-20T18:50:25+05:30 IST

ఈ నియోజకవర్గంలో ఒకాయన 30 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఇక్కడ అభివృద్ధి ఏమీ కనిపించడం లేదు. నా నియోజకవర్గం ధరంగాన్‌కి వచ్చి చూడండి. ఫస్ట్ క్లాస్ అభివృద్ధి కనిపిస్తుంది. ధరంగాన్‌లో రోడ్లు హేమామాలిని బుగ్గల్లా కనిపించకపోతే రాజీనామా చేస్తా..

రోడ్లను హేమామాలిని బుగ్గలతో పోల్చిన మంత్రి.. అనంతరం క్షమాపణ

ముంబై: తన నియోజవర్గంలో అభివృద్ధి ఉరకలెత్తిందని, రోడ్లు సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని బుగ్గల్లా ఉంటాయని వ్యాఖ్యానించిన మహారాష్ట్ర మంత్రి, శివసేన నేత గులాబ్‌రావు పాటిల్ క్షమాపణలు చెప్పారు. విపక్ష భారతీయ జనతా పార్టీతో పాటు ఇతర పక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆదివారం తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నట్లు సోమవారం పేర్కొన్నారు.


ఎన్సీపీ నేత ఏక్‌నాథ్ ఖడ్సే నియోజవకర్గమైన ముఖ్తాయినగర్‌లో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాటిల్ పాల్గొన్నారు. అనంతరం ఖడ్సేని టార్గెట్ చేస్తూ ‘‘ఈ నియోజకవర్గంలో ఒకాయన 30 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఇక్కడ అభివృద్ధి ఏమీ కనిపించడం లేదు. నా నియోజకవర్గం ధరంగాన్‌కి వచ్చి చూడండి. ఫస్ట్ క్లాస్ అభివృద్ధి కనిపిస్తుంది. ధరంగాన్‌లో రోడ్లు హేమామాలిని బుగ్గల్లా కనిపించకపోతే రాజీనామా చేస్తా’’ అని పాటిల్ ఛాలెంజ్ విసిరారు.


కాగా, పాటిల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ‘‘పాటిల్ చేసిన వ్యాఖ్యలు మహిళా సమూహాన్ని కించపరిచాయి. మంత్రి పాటిల్‌పై మహా వికాస్ అగాడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. పాటిల్‌పై పోలీసు కేసు కూడా ఫైల్ చేస్తాం’’ మహారాష్ట్ర మండలి ప్రతిపక్ష నేత ప్రవీణ్ దరేకర్ అన్నారు. ఆయనపై కేసు కూడా నమోదు చేశారు. రాజకీయంగా తీవ్రంగా ఒత్తిడి పెరుగుతుండడంతో పాటిల్ క్షమాపణలు చెప్పక తప్పలేదు.


ఇకపోతే.. హేమామాలిని బుగ్గలను రోడ్లతో పోల్చడం ఇది కొత్త కాదు. రెండు దశాబ్దాల క్రితం బిహార్‌లోని రోడ్లను హేమామాలిని బుగ్గల్తా మారుస్తామని బిహార్ అప్పటి ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తొలిసారిగా అన్నారు. అనంతరం అనేక మంది రోడ్లను హేమామాలిని బుగ్గలతో పోల్చారు. ఇలా పోల్చినవారిలో బీజేపీ నేతలు అనేక మంది ఉన్నారు.

Updated Date - 2021-12-20T18:50:25+05:30 IST