ఉద్యోగ సంఘాల మహాధర్నా

ABN , First Publish Date - 2022-01-26T05:23:49+05:30 IST

పీఆర్సీపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా నాలుగు జేఏసీలు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోని ఉద్యోగ సంఘాలు మంగళవారం కలెక్టరేట్‌ వద్ద మహా ధర్నా నిర్వహించాయి.

ఉద్యోగ సంఘాల మహాధర్నా
నగరంలో భారీ ర్యాలీ..

  1.   చీకటి జీవోలు రద్దు చేయాలి
  2.  రిటైర్‌మెంట్‌ వయసు యథాతథంగా ఉంచాలి
  3.  ప్రభుత్వం దిగొచ్చే  వరకు ఉద్యమం ఆగదు
  4.  ఉద్యోగ సంఘాల  జేఏసీ అల్టిమేటం

కర్నూలు, జనవరి 25(ఆంధ్రజ్యోతి)/ఎడ్యుకేషన: పీఆర్సీపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా నాలుగు జేఏసీలు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోని ఉద్యోగ సంఘాలు మంగళవారం కలెక్టరేట్‌ వద్ద మహా ధర్నా నిర్వహించాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు భారీగా తరలి వచ్చారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ఎన్టీఆర్‌ సర్కిల్‌ చుట్టూ చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పీఆర్సీ అడిగితే రివర్స్‌ పీఆర్సీ ఇచ్చిన ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామన్నారు. పాదయాత్రలో జగన్మోహనరెడ్డి ఎన్నెన్నో హామీలిచ్చారని, వాటిని నమ్మి ఓట్లు వేసి మోసపోయామంటూ మోకాళ్లపై నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగులంటే వైసీపీ ప్రభుత్వానికి అలుసుగా ఉందని, పీఆర్సీ అడిగితే ఐఆర్‌ కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ ఇచ్చిందని అన్నారు. పైగా జీతాలకే బడ్జెట్‌ మొత్తం సరిపోతోందని చెబుతూ ఉద్యోగుల మీద వ్యతిరేక భావన కలిగించేలా దొంగలెక్కలు చెబుతోందని మండిపడ్డారు.

నగరంలో భారీ ర్యాలీ..

మహాధర్నాకు ముందు ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉదయం 9కే జడ్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. 10.30 గంటలకు మొదలైన ర్యాలీ రాజ్‌ విహార్‌ సెంటర్‌, శ్రీకృష్ణ దేవరాయ సర్కిల్‌ మీదుగా కలెక్టరేట్‌ వరకు సాగింది. కృష్ణదేవరాయ సర్కిల్‌ వద్ద కాసేపు రోడ్డుపై కూర్చుని నిరసన తెలియ జేశారు. కలెక్టరేట్‌ వద్దకు చేరుకున్న తర్వాత ఉద్యోగులను ఉద్దేశించి ఏపీజేఏసీ, ఏపీజీఈఏ, ఉపాధ్యాయ సంఘాల నేతలు మాట్లాడారు. ఏపీజేఏసీ జిల్లా చైర్మన వీసీహెచ.వెంగళ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులంటే బ్యూరోక్రాట్లే అనుకుంటోందని, వారు కాకుండా మిగతా వారిని ఉద్యోగులుగా పరిగణించడం లేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగులున్నారని, ప్రభుత్వం ఇలానే ఉంటే ఇబ్బందుల్లో పడక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు తామే చేరవేస్తున్నామని, అది తెలుసుకుని మసలుకోవాలని అన్నారు. పీజీలు చేసి రూ.15 వేలకే సచివాలయ ఉద్యోగాలు చేస్తున్న వారికి పీఆర్సీ అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారన్నారు. రిపబ్లిక్‌ డే అవార్డులు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడు ఎంసీ నరసింహులు మాట్లాడుతూ చీకటి జీవోలను రద్దు చేయాలన్నారు. ఐఆర్‌ కంటే తక్కువ కాకుండా ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని, హెచఆర్‌ఏ తగ్గించకుండా చూడాలని అన్నారు. 


కడుపు మండి రోడ్లపైకి వచ్చాము:

అనుకున్నది ఇప్పటికే సగం సాధించాం. వంద శాతం సాధించే వరకు పీఆర్‌సీ సాధన సమితి నిద్రపోయే ప్రసక్తేలేదు. వాళ్లకు అధికారం ఇచ్చి ఉంటే.. మాకు సమ్మె అనే ఆయుధాన్ని ఇచ్చారనే విషయాన్ని మర్చి పోకూడదు. ఉద్యోగులు ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. కడుపు మండి రోడ్లపైకి వచ్చాం. త్వరలోనే వైసీపీ ప్రభుత్వాన్ని గంగలో కలిపేస్తాం. ఉద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వాలు సముద్రంలో కలిసిపోయాయనే విషయాన్ని ముఖ్యమంత్రి మరిచిపోరాదు. 

- ఎస్టీయూ రాష్ట్ర సహాధ్యక్షుడు హెచ.తిమ్మన్న 


పోవాలి జగన అంటున్నారు: 

రావాలి జగన అన్న వారే.. ఇప్పుడు పోవాలి జగన అంటున్నారు. గతంలో అప్రెంటీషిప్‌ రద్దుచేయాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు 13 రోజులు సమ్మె చేస్తే.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అప్రెంటిషిప్‌ను రద్దు చేశారు. ఉపాధ్యాయులు తలచుకుంటే.. మీ అబ్బగారే దిగివచ్చారు. ఇక నీవెంత? చట్టబద్దమైన పీఆర్‌సీ ఇవ్వాల్సిందే. అశుతోశ మిశ్రా కమిటి నివేదిక బహిర్గతం చేయాలి. అందరికీ ఆమోదయోగ్యమైన పీఆర్‌సీ ఇవ్వాలి.

- ఏపీయూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఎల్లప్ప


సీసీఎస్‌ రద్దు హామీని నిలబెట్టుకోవాలి: 

ఎన్నికల ముందు జగన మోహన రెడ్డి సీపీఎస్‌ను రద్దు చేస్తానన్న మాటను నిలబెట్టుకోవాలి. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల అనైక్యత కారణంగానే పీఆర్‌సీలో తీవ్ర నష్టం జరిగింది. జనవరి 17న అర్ధరాత్రి విడుదల చేసిన పీఆర్‌సీ చీకటి జీవోలను రద్దు  చేయాలి. రివర్స్‌ పీఆర్‌సీ మాకు వద్దు. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తున్నాం. ఆలోపే డిమాండ్లను పరిష్కరించాలి. ప్రజ్రాప్రతినిధులు ఉపాధ్యాయులను అవమానకరంగా మాట్లాడడం దురదృష్టకరం. ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలి. 

- పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైష్ణవి కరుణానిధిమూర్తి


శాస్త్రీయత లేని పీఆర్‌సీ మాకొద్దు: 

శాస్త్రీయత లేని పీఆర్‌సీ మాకు వద్దు. అసంబద్ధమైన పీఆర్‌సీ వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లందరూ ఒకేతాటిపైకి వచ్చే పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. అశుతోష్‌ మిశ్రా నివేదికను బయటపెట్టి అమలుచేయాలి. ఉద్యోగులపై దాడులు పెరుగుతున్నాయి. అయినా భయపడేది లేదు. ఉద్యోగులకు రాష్ట్ర ఆదాయంలో 70 శాతం ఖర్చు అవుతుందంటూ ప్రభుత్వం చెప్పుకుంటోంది. వాస్తవానికి 24 శాతానికి మించి ఉద్యోగుల సంక్షేమానికి ఖర్చు చేయడం లేదు. ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్‌ సకాలంలో అందడం లేదు. 

- ఏపీటీఎఫ్‌ జిల్లా అద్యక్షుడు రంగన్న




Updated Date - 2022-01-26T05:23:49+05:30 IST