21 నుంచి మహాకుంభ సంప్రోక్షణ వైదిక పూజలు!

ABN , First Publish Date - 2022-03-10T07:56:10+05:30 IST

స్వయంభు పాంచనారసింహుడు కొలువుదీరిన గర్భాలయ పునఃప్రారంభాన్ని మహాకుంభ సంప్రోక్షణ వైదిక పూజలతో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

21 నుంచి మహాకుంభ సంప్రోక్షణ వైదిక పూజలు!

  • ఉద్ఘాటనకు ముందు వారం పాటు కార్యక్రమాలు
  • ప్రగతి భవన్‌లో యాదాద్రి ప్రధానార్చకుడితో సీఎం సమీక్ష
  • 11న యాదాద్రికికేసీఆర్‌.. స్వామివారికి పట్టువస్త్రాలు
  • అనంతరం పనులు, ఉద్ఘాటన కార్యక్రమంపై సమీక్ష


యాదాద్రి, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): స్వయంభు పాంచనారసింహుడు కొలువుదీరిన గర్భాలయ పునఃప్రారంభాన్ని మహాకుంభ సంప్రోక్షణ వైదిక పూజలతో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆ మేరకు ఉద్ఘాటన కార్యక్రమానికి ముందు వారం పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయని సమాచారం. ఈ నెల 28వ తేదీన ఆలయ ఉద్ఘాటన నేపథ్యంలో దేవస్థాన ప్రధానార్చకులు నల్లన్‌థిఘళ్‌ లక్ష్మీనరసింహాచార్యులును సీఎం కేసీఆర్‌ బుధవారం ప్రగతిభవన్‌కు పిలిపించుకున్నారు. ఆయనతో ఆరున్నర గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించిన శ్రీ వైష్ణవ పీఠాధిపతి శ్రీమన్నారాయణ చిన జీయర్‌ స్వామిని ఉద్ఘాటనకు ఆహ్వానించే విషయమై చర్చించినట్లు తెలిసింది. దీంతో యాదాద్రి ఆలయ ఉద్ఘాటన పర్వాల పర్యవేక్షణలో చిన జీయర్‌ స్వామి ప్రమేయం ఎంతవరకు ఉండనున్నది చర్చనీయాంశంగా మారింది. కాగా యాదాద్రి ఆలయ ఉద్ఘాటన సుముహూర్తం కోసం ఈ నెల 21న ఆరంభ పూజలను పాంచరాత్రాగమ శాస్త్ర పద్ధతిలో చేపట్టనున్నామని ఈ మేరకు ఉద్ఘాటనకు సన్నద్ధం కావాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్టు దేవస్థాన ఈవో గీతారెడ్డి బుధవారం ప్రకటించారు. ఈ క్రమంలో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సమావేశం కీలకంగా మారింది. విశ్వసనీయ సమాచరం ప్రకారం యాదాద్రి క్షేత్రానికి ఈ నెల 11న  సీఎం కేసీఆర్‌ విచ్చేయనున్నారని, వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 11 గంటలకు స్వామి వారి తిరుకల్యాణోత్సవంలో ఆయన పాల్గొని పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారని తెలిసింది.. అనంతరం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ, విస్తరణ పనులను పరిశీలించి, పనుల పురోగతిని, ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణ వైదిక పూజల మహోత్సవ కార్యక్రమాలపై ఆయన సమీక్షించనున్నట్లు సమాచారం. 

Updated Date - 2022-03-10T07:56:10+05:30 IST