నేటి నుంచి మహానాడు

ABN , First Publish Date - 2020-05-27T10:18:22+05:30 IST

తెలుగుదేశం మహానాడు సమావేశాలు నేడు జూమ్‌ యాప్‌లో ప్రారంభిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు..

నేటి నుంచి మహానాడు

జూమ్‌ యాప్‌ ద్వారా నిర్వహణ

  సోమిశెట్టి  


కర్నూలు(అగ్రికల్చర్‌), మే 26: తెలుగుదేశం మహానాడు సమావేశాలు నేడు జూమ్‌ యాప్‌లో ప్రారంభిస్తున్నట్లు  జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం   నగరంలోని  పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  27, 28 తేదీల్లో జూమ్‌ యాప్‌ ద్వారా మహానాడు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  పార్టీ ఏర్పడ్డప్పటి నుంచి ప్రతి ఏటా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జన్మదినం మే 28న   తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాలను ఏదో ఒక నగరంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ఈ సమావేశాల్లో రాబోయే సంవత్సర కాలంలో పార్టీ నిర్వహించాల్సిన కార్యాచరణ ప్రణాళికను తయారవుతుందని అన్నారు. అయితే ఈ ఏడాది కరోనా లాక్‌డౌన్‌ వల్ల మహానాడు కార్యక్రమాలను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జూమ్‌ యాప్‌ ద్వారా 25 వేల మందితో నిర్వహించనున్నారని  తెలిపారు.


  ఈ మేరకు జిల్లాకు చెందిన 2 వేల మంది ఈ జూమ్‌ యాప్‌లో పాల్గొంటారని తెలిపారు.    జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ అన్ని స్థాయిల నాయకులు తమ స్మార్ట్‌ ఫోన్‌లో జూమ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సోమిశెట్టి విజ్ఞప్తి చేశారు. మహానాడు కార్యక్రమం బుధవారం  ప్రారంభమవుతుందని,   జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన  తన సందేశంతో మహానాడు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారని తెలిపారు. అలాగే 28న పార్టీ చేపట్టబోయే భవిష్యత్‌ ప్రణాళిక గురించి వివరిస్తారని తెలిపారు.  ప్రతి రోజు ఉదయం గంటన్నర,  సాయంత్రం గంటన్నర   కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమాలు ప్రారంభమయ్యే సమయం మెసేజ్‌ ద్వారా తెలుస్తుందని ఆయన అన్నారు.  ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత పెద్ద ఎత్తున జూమ్‌ యాప్‌ ద్వారా క్యాడర్‌తో కార్యక్రమాలు నిర్వహించలేదని అన్నారు. ఇది  ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యమవుతున్నదని స్పష్టం చేశారు. పార్టీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారకరామారావు జయంతి వేడుకలను 28న జిల్లాలోని  గ్రామ, మండల, పట్టణ, నగర పరిధిలో ఘనంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.  నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత దూరాన్ని పాటించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాక్‌డౌన్‌ నిబంధనలను  అనుసరించి నిర్వహించాలని  సోమిశెట్టి సూచించారు. 

Updated Date - 2020-05-27T10:18:22+05:30 IST