అండగా నేనున్నా..

ABN , First Publish Date - 2020-05-28T10:41:42+05:30 IST

అధికార పార్టీ దౌర్జన్యాలు.. దాడులకు ఎదురొడ్డి పార్టీ జెండా మోసే ప్రతి కార్యకర్తకు అండగా

అండగా నేనున్నా..

కార్యకర్తలకు అధినేత చంద్రబాబు భరోసా

జూమ్‌ యాప్‌ ద్వారా మహానాడు

జిల్లా నుంచి ఆన్‌లైన్‌లో 1400 మంది హాజరు

వైసీపీ అరాచక పాలనపై చెంగల్రాయులు తీర్మానం


కడప, మే 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అధికార పార్టీ దౌర్జన్యాలు.. దాడులకు ఎదురొడ్డి పార్టీ జెండా మోసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మహానాడు తొలిరోజు సమావేశాన్ని ఆయన జూమ్‌ యాప్‌ద్వారా నిర్వహించారు. జిల్లా నుంచి ఆన్‌లైన్‌లో 1400 మంది ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. చంద్రబాబు ప్రసంగాన్ని ఆలకించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన కొందరు కార్యకర్తలు జిల్లాలో వైసీపీ నాయకుల దౌర్జన్యాలను అధినేత దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అధైర్యపడవద్దు.. అన్ని విధాలుగా అండగా ఉంటానని వారికి చంద్రబాబు భరోసా ఇచ్చినట్లు సమాచారం.


మహానాడులో భాగంగా పలు తీర్మానాలు చేశారు. వైసీపీ ఏడాది పాలనపై ‘అరాచక పాలనకు ఏడాది.. ప్రమాదంలో ప్రజాస్వామ్యం’ అనే అంశంపై భోజన విరామం తరువాత మొదటి తీర్మానంగా రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బత్యాల చెంగల్రాయులు ప్రవేశపెట్టారు. 2007లో నాటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో పెద్దల సూచనలు అవసరమని శాసనమండలిని తీసుకువచ్చారని, తండ్రి ఆశయాలను గౌరవించకుండా తనయుడు జగన్‌ సీఎం అవగానే మండలి రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేశారని అన్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతున్నారని, న్యాయ వ్యవస్థ ఆగ్రహం వ్యక్తం చేసినా పట్టించుకోవడం లేద ని, ఇది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరమని చెంగల్రాయులు తీర్మానాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.


నేడు ప్రజా రాజధాని అమరావతిపై తీర్మానం

టీడీపీ మహానాడును పురస్కరించుకుని నేడు పలు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. అందులో ‘ప్రజా రాఽజధాని అమరావతి - మూడుముక్కలాటలతో రాష్ట్రాభివృద్ధి అథోగతి’ అనే తీర్మానాన్ని జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ప్రవేశపెడుతున్నారు.


కరోనా కారణంగా.. సాదాసీదాగా..

కరోనా వ్యాప్తి కట్టడి, లాక్‌డౌన్‌ ఆంక్షల నేపధ్యంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహానాడు తొలిరోజు కార్యక్రమాన్ని పరిమిత సభ్యులతో బుధవారం జిల్లా పార్టీ నాయకులు సింపుల్‌గా నిర్వహించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎందరికో రాజకీయ భిక్ష పెట్టిన ఘన కీర్తి ఎన్టీఆర్‌దేనని కొనియాడారు. ఐదేళ్లలో టీడీపీ పాలనలో జిల్లాలో జరిగిన అభివృద్ధిని వివరించారు.


ఏడాది వైసీపీ పాలనలో కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలను ఖండించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌, కడప నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ అమీర్‌బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు గోవర్ధనరెడ్డి, కృష్ణమూర్తి, నగర పార్టీ అధ్యక్షులు జిలానీబాష, కార్యదర్శి వికా్‌సహరి, ఉపాధి హామీ పథకం కౌన్సిల్‌ సభ్యులు పీరయ్య తదితరులు పాల్గొన్నారు. నేడు ఎన్టీఆర్‌ జయంతిని కరోనా నిబంధనలకు అనుగుణంగా పరిమిత సభ్యులతో నిర్వహించనున్నట్లు వివరించారు.

Updated Date - 2020-05-28T10:41:42+05:30 IST