సొంతింటికి మహారాజా

ABN , First Publish Date - 2021-10-13T06:34:47+05:30 IST

ఎయిర్‌ ఇండియాను ప్రైవేటుపరం చేయాలన్న బుద్ధి గత పాలకులకు పుట్టిననాటినుంచి, ఏదో కొంతవాటా కాదు ఏకంగా అంతా ప్రైవేటుకు అమ్మేయాలని రెండేళ్ళక్రితం మోదీ నిర్ణయించినంత వరకూ తీవ్ర విమర్శలు చేసినవారు ఇప్పుడు అంతగా విరుచుకుపడటం లేదు. చమురు, ఓడరేవులు ఇత్యాది రంగాల్లో రోజూ వందలకోట్లు

సొంతింటికి మహారాజా

ఎయిర్‌ ఇండియాను ప్రైవేటుపరం చేయాలన్న బుద్ధి గత పాలకులకు పుట్టిననాటినుంచి, ఏదో కొంతవాటా కాదు ఏకంగా అంతా ప్రైవేటుకు అమ్మేయాలని రెండేళ్ళక్రితం మోదీ నిర్ణయించినంత వరకూ తీవ్ర విమర్శలు చేసినవారు ఇప్పుడు అంతగా విరుచుకుపడటం లేదు. చమురు, ఓడరేవులు ఇత్యాది రంగాల్లో రోజూ వందలకోట్లు తవ్వుకుంటూ ప్రపంచర్యాంకుల్లోకి ఎదిగిపోతున్న కొత్తతరం దోపిడీదారుల కబంధహస్తాల్లోకి పోయేకంటే, ఈ సంస్థ పూర్వపు యజమానులైన టాటాల చేతికే తిరిగివచ్చినందుకు ఎంతోమంది సంతోషించారు. ‘ఎయిర్‌ ఇండియాను టాటాలకు ఇస్తేనే బాగుంటుంది. చక్కగా కాపాడతారు, సమర్థంగా నిర్వహిస్తారు’ అని ఆర్థికవేత్త మాంటెక్‌సింగ్‌ అహ్లూవాలియా సైతం ఏ లెక్కన అన్నారో కానీ, ఇటువంటి భావోద్వేగం చాలామందిలో కనిపిస్తున్నది. 


ప్రభుత్వరంగ సంస్థలను ఆర్పేయడం, అమ్మివేయడం లక్ష్యంగా ఆవిర్భవించిన ‘పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం–దీపం’ ఈ విమానయానసంస్థ అమ్మకం అందించిన విజయోత్సాహంతో మరిన్ని ప్రభుత్వ సంస్థల ఢమాకా సేల్స్‌కు నడుంబిగించే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వం సంస్కరణలకు కట్టుబడివుందని ఈ అమ్మకం అంతర్జాతీయంగానూ సరైన సందేశం ఇస్తుంది అని సీఐఐ అభినందించింది. భారత్‌ ఎర్త్‌మూవర్స్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌, నీలాంచల్‌ ఇస్పాట్‌, పవన్‌హన్స్‌, సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, బీపీసీఎల్‌, ఐడీబీఐ ఇత్యాదివి సర్కారు హిట్‌లిస్టులో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా లక్షన్నరకోట్లు దాటి సంపాదించాలని అనుకుంటున్న ప్రభుత్వం మాంచి లాభాలు గడిస్తూ, పరిమాణంలో భారీగా ఉండే బీపీసీఎల్‌, ఎల్‌ఐసీ వంటివాటినే అమ్మకానికి ముందుకు తోస్తున్న విషయం తెలిసిందే. ఎల్‌ఐసీ ఐపీవోని భలేమంచి చౌకబేరమంటున్న ప్రభుత్వానికి ఎయిర్‌ ఇండియా విక్రయం ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ విషయంలోనూ జోరుగా అడుగులు వేసేందుకు ఉపకరిస్తుంది. గుజరాతీ మోదీ అన్నీ అంబానీలకూ, అదానీలకే దోచిపెడుతున్నారని విపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అప్పుల్లో ఉన్న ఈ లోహవిహంగాన్ని టాటాలకు అప్పగించడం క్షేమకరం, శ్రేయస్కరమని పాలకులు భావించివుంటారు. సంస్కరణలని ముద్దుపేరు పెట్టుకున్న అడ్డగోలు అమ్మకాలకు ఇకపై అడ్డుండకూడదంటే, ఈ అమ్మకం కాస్తంత ప్రజామోదకరంగా ఉండటం అవసరం.


ఎయిర్‌ ఇండియా అమ్మకం ప్రభుత్వానికీ, టాటాలకూ, ప్రజలకు కూడా మంచిదేనని అంటున్నారు. నిష్ప్రయోజనకరమైన ఈ సంస్థమీద ఇకపై పెట్టుబడిపెట్టనక్కరలేనందున ప్రభుత్వానికీ, అప్పులభారం పెద్దగా లేకుండా ఈ సంస్థ చేతికి వచ్చినందున టాటాలకూ, తాము కట్టే పన్నులు వృథాకానందున ప్రజలకూ ఈ డీల్‌తో మేలు జరిగినట్టేనని ఆర్థికనిపుణుల వాదన. ఈ విక్రయం వల్ల ప్రభుత్వానికి ఒరిగిన లాభనష్టాలేమిటని విలేకరులు ప్రశ్నించినప్పుడు, దీపం కార్యదర్శి తుహిన్‌కాంత్‌ పాండే ఓ తెలివైన విశ్లేషణ చేశారు. ఇకపై ప్రతిరోజూ ప్ర‌భుత్వానికి ఓ ఇరవైకోట్లు వృథాగా ధారపోయాల్సిన అవసరం లేకపోవడమే అతిపెద్ద లాభమని ఆయన వాదన. ప్రభుత్వ వాటాకోసం రెండువేల ఏడువందలకోట్లు, అరవైవేల కోట్ల రూపాయల రుణభారంలో నాలుగోవంతు మీదవేసుకొనేందుకు ఓ పదిహేనువేల మూడువందలకోట్లు వెచ్చించి టాటాలు ఎయిర్‌ ఇండియాను చేజిక్కించుకున్నారు. ఆ సంస్థకున్న రియల్‌ఎస్టేట్‌ ఆస్తులను అమ్మేయడం ద్వారా మిగతా డెబ్బైఐదుశాతం రుణభారాన్ని తీర్చగలనన్న నమ్మకంతో ప్రభుత్వం దానిని నెత్తినవేసుకుంది. రిజర్వుధరకంటే 39శాతం, తోటి ఏకైకపోటీదారుకంటే 16శాతం అధికంగా ఇచ్చి, ఆరంభమైన దాదాపు తొమ్మిది దశాబ్దాల తరువాత, జాతీయీకరణ జరిగిన 68సంవత్సరాల అనంతరం మహారాజ్‌ను మళ్ళీ సొంతింటికి తెచ్చుకున్నారు టాటాలు. ఎయిర్‌ ఏషియా, విస్తారా ఎలాగూ చేతిలో ఉన్నాయి కనుక, ఎయిర్‌ ఇండియా చేరికతో టాటాలు మరింత బలపడ్డారు. 


ఎయిర్‌ ఇండియాకు ఉన్న 55 విదేశీ మార్గాలు, మూడువేల లాండింగ్‌, పార్కింగ్‌ వెసులుబాట్లు, చిన్నా పెద్ద సహా దాదాపు నూటయాభై విమానాలు టాటాలకు అంతర్జాతీయయానంలో మంచి వాటాను సమకూరుస్తాయి. ఉద్యోగాలకు ఏడాది పాటు గ్యారంటీ ఇవ్వడం, ఆ తరువాత ఉద్యోగుల సంఖ్యను కుదించాల్సి వస్తే మంచి వీఆర్‌ఎస్‌ ప్యాకేజీని అమలు చేయడం, రిటైర్మెంట్‌ అనంతర వైద్యఖర్చులకు ప్రభుత్వం బాధ్యత పడటం వంటివి ఈ అమ్మకంపై పెద్ద వ్యతిరేకతను సృష్టించలేదు. ప్రభుత్వ ప్రైవేటీకరణ దూకుడుకు పెద్ద పరీక్ష పెట్టిన ఎయిర్‌ ఇండియా ఎట్టకేలకు ప్రైవేటుపరమైనప్పటికీ, దానితో అనుబంధం, దేశం పట్ల గౌరవం, విశ్వసనీయత ఉన్న టాటాల చేతుల్లోకి వచ్చినందుకు ఊరడిల్లాలి. 

Updated Date - 2021-10-13T06:34:47+05:30 IST