అడవి బిడ్డల వద్దకు నది దాటుతూ...

ABN , First Publish Date - 2020-11-25T05:52:55+05:30 IST

బాలింతలు, గర్భిణులు, చంటిపిల్లల యోగక్షేమాలు చూసుకోవడంలో అంగన్‌వాడీ కార్యకర్తలు ఎంత కీలకమో తెలిసిందే. అయితే కరోనా భయంతో అంగన్‌వాడీ కేంద్రానికి రావడం మానేసిన గిరిజన మహిళల ఇళ్ల వద్దకు వెళ్లి వారికి పోషకాహారాన్ని అందిస్తున్నారు...

అడవి బిడ్డల వద్దకు నది దాటుతూ...

బాలింతలు, గర్భిణులు, చంటిపిల్లల యోగక్షేమాలు చూసుకోవడంలో అంగన్‌వాడీ కార్యకర్తలు ఎంత కీలకమో తెలిసిందే. అయితే కరోనా భయంతో అంగన్‌వాడీ కేంద్రానికి రావడం మానేసిన గిరిజన మహిళల ఇళ్ల వద్దకు వెళ్లి వారికి  పోషకాహారాన్ని అందిస్తున్నారు మహరాష్ట్రకు చెందిన రేలూ వాసవే. నది గట్టున కొండ ప్రాంతంలో ఉండే వారి ఇళ్లకు చేరుకునేందుకు ఆమె రోజూ నదిలో 18 కిలోమీటర్లు పడవ నడుపుతూ వెళుతున్నారు. విధి నిర్వహణలో తన దృఢచిత్తంతో మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే ప్రశంసలు అందుకున్న ఆమె సాహసమిది....


రేలూ వాసవే పనిచేసే అంగన్‌వాడీ చిమల్‌ఖడీ నందూర్బర్‌ జిల్లాలోని మారుమూల గ్రామం. నర్మదా నది దిగువ ప్రాంతంలోని కొండ ప్రాంతంలోని అలిగట్‌, దాదర్‌ గ్రామాలలో నివసించే గిరిజన మహిళలు కూడా ఆ అంగన్‌వాడీకి వచ్చేవారు. అయితే మార్చిలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో కరోనా భయంతో గిరిజన కుటుంబాలకు చెందిన బాలింతలు, గర్భిణిలు అంగన్‌వాడీ కేంద్రానికికి రావడం మానేశారు. ‘‘మామూలుగా అయితే చిన్నపిల్లలు, గర్భిణిలు తమ కుటుంబసభ్యులతో కలిసి పడవ  సాయంతో నది దాటి అంగన్‌వాడీకి వచ్చి ఆహారం, ఇతర పోషక సామగ్రి తీసుకెళ్లేవారు. కానీ మార్చి నుంచి కరోనా భయంతో వాళ్లు ఇక్కడకి రావడమే మానేశారు’’ అంటుంది రేలూ. పోషకాహారం అందకుంటే వారి ఆరోగ్యం ఎక్కడ దెబ్బతింటుందోనని బెంగ పట్టుకుంది రేలూకు. వారి గ్రామాలకు వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేదు. నదిని దాటితే గానీ వారి వద్దకు వెళ్లలేని పరిస్థితి. అలాగనీ నదిలో తొమ్మిది కిలోమీటర్ల దూరం పడవ నడుపుతూ వెళ్లడం అంటే ప్రాణాలను పణంగా పెట్టడమే. కానీ రేలూ ఆ గ్రామాల్లోని 25మంది బాలింతలు, ఏడుగురు గర్భిణిలు, పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు పోషకాహారం అందించాలనే తపనతో పెద్ద సాహసమే చేసింది. స్థానికంగా ఉన్న మత్య్సకారుల వద్ద ఒక చిన్న పడవ అద్దెకు తీసుకొని తన ప్రయాణాన్ని మొదలెట్టింది. గత ఏప్రిల్‌ నెల నుంచి వారంలో అయిదు రోజులు వారి గ్రామాలకు వెళుతోంది.  


చీకటి పడేలోపు ఇంటికి...

రోజూ ఉదయాన్నే ఏడున్నరకు అంగన్‌వాడీకి చేరుకుంటుంది రేలూ. మధ్యాహ్నం వరకు అక్కడి చిన్నపిల్లల ఆలనాపాలనా చూస్తుంది. మధ్యాహ్న భోజనం అయిన గంట తరువాత ఆమె గిరిజన మహిళల గ్రామాలకు  పడవలో బయలుదేరుతుంది తిరిగి చీకటి పడేలోపు వచ్చేస్తుంది. చాలా వరకు ఆమె ఒంటరిగానే పడవలో వెళుతుంది. ఒక్కోసారి ఆమె బంధువు సంగీత తోడుగా వెళతారు. తమకోసం 18 కిలోమీటర్లు పడవ నడుపుతూ వస్తున్న రేలూ అంటే అక్కడి వారందరికీ ప్రత్యేకమైన అభిమానం. రేలూ అసాధారణ సాహసం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఉద్యోగ బాధ్యతను ఎట్టి పరిస్థితుల్లోనూ మరవకూడదని చాటిచెప్పిన రేలూ గురించి ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటోంది. 


అప్పటి వరకూ వెళుతూనే ఉంటా!

నర్మదా నది గట్టున ఉన్న పల్లెటూరిలో పెరిగింది రేలూ వాసవే. దాంతో చిన్నతనంలోనే ఈత కొట్టడం, పడవ నడపడం నేర్చుకుంది. రేలూకు ఇద్దరు పిల్లలు. ‘‘ప్రతిరోజు తెడ్డు సాయంతో పడవ నడపడం అంత సులభం కాదు. సాయంత్రం ఇంటికి చేరుకునే సరికి నా చేతులు నొప్పి పుడతాయి. అయినా నేను బాధ పడను. కానీ చిన్నపిల్లలు, కాబోయే తల్లులు పోషకాహారం తినడం చాలా ముఖ్యం. కరోనా భయాలు తొలగి, మామూలు పరిస్థితులు వచ్చేదాకా నేను రోజూ వారి గ్రామాలకు వెళుతూనే ఉంటాను’’ అని చెబుతుంది రేలూ. 



Updated Date - 2020-11-25T05:52:55+05:30 IST