ఎమ్మెల్యేల వేతనాల్లో ఏడాదిపాటు 30 శాతం కోత...

ABN , First Publish Date - 2020-04-10T00:09:34+05:30 IST

ఏడాది పాటు ఎమ్మెల్యేల జీతంలో 30 శాతం కోత విధించే ప్రతిపాదనకు మంత్రివర్గం గురువారంనాడు ఆమోదం..

ఎమ్మెల్యేల వేతనాల్లో ఏడాదిపాటు 30 శాతం కోత...

ముంబై: కోవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రానికి ఏర్పడిన ఆర్థిక నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాది పాటు ఎమ్మెల్యేల జీతంలో 30 శాతం కోత విధించే ప్రతిపాదనకు మంత్రివర్గం గురువారంనాడు ఆమోదం తెలిపింది. ఏప్రిల్‌‌తో ప్రారంభించి ఏడాది పాటు వేతనంలో కోత అమలవుతుందని క్యాబినెట్ సమావేశానికి సారథ్యం వహించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మీడియాకు తెలిపారు.


ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను శాసన మండలికి నామినేట్ చేస్తూ ఓ నిర్ణయాన్ని కూడా క్యాబినెట్ ఆమోదించినట్టు అజిత్ పవార్ వెల్లడించారు. లాక్‌డౌన్ అనంతరం తలెత్తిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి, దానిని తిరిగి పునరుద్ధరించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై రెండు కమిటీలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొదటి కమిటీలో మహారాష్ట్ర ఆర్థిక శాఖకు చెందిన అధికారులు, మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉంటారు. రెండో కమిటీలో రాష్ట్ర మంత్రులు అజిత్ పవార్, జయంత్ పాటిల్, బాలాసాహెబ్ థోరట్, ఛగన్ భుజ్‌బల్, అశోక్ చవాన్, అనిల్ పరబ్ ఉంటారు.


మహారాష్ట్రలో గురువారంనాడు కొత్తగా 162 కేసులు నమోదు కావడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,297కి చేరినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2020-04-10T00:09:34+05:30 IST