మహారాష్ట్ర సంకీర్ణంలో చిచ్చు?

ABN , First Publish Date - 2021-03-29T08:21:04+05:30 IST

మహారాష్ట్ర సంకీర్ణంలో చిచ్చు రేగింది. సంకీర్ణ భాగస్వామ్య పక్షమైన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్‌ పవార్‌ శనివారం అనూహ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను రహస్యంగా కలిసినట్లు...

మహారాష్ట్ర సంకీర్ణంలో  చిచ్చు?

  • అమిత్‌ షాతో పవార్‌ రహస్య భేటీ!.. అహ్మదాబాద్‌లో సమావేశం
  • శివసేన గరంగరం.. అనిల్‌ దేశ్‌ముఖ్‌పై సేన దాడి తీవ్రం
  • బీజేపీ- ఎన్సీపీ సర్కార్‌పై ఊహాగానాలు.. భేటీ జరగలేదన్న ఎన్సీపీ
  • కాంగ్రెస్‌లో అయోమయం.. ఆరోపణలపై రిటైర్డ్‌ జడ్జి విచారణ: అనిల్‌
  • కీలక ఆధారాలు సేకరించిన జాతీయ దర్యాప్తు సంస్థ


ముంబై, మార్చి 28: మహారాష్ట్ర సంకీర్ణంలో చిచ్చు రేగింది. సంకీర్ణ భాగస్వామ్య పక్షమైన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్‌ పవార్‌ శనివారం అనూహ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను రహస్యంగా కలిసినట్లు వార్తలు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎన్సీపీ సీనియర్‌ నేత ప్రఫుల్‌ పటేల్‌తో కలిసి ఆయన అహ్మదాబాద్‌లో ఓ పెద్ద పరిశ్రమాధిపతి గెస్ట్‌హౌ్‌సలో కలిసినట్లు కొన్ని గుజరాతీ స్థానిక వార్తాసంస్థలు బయటపెట్టడంతో రాజకీయం వేడెక్కిపోయింది.  ఆదివారంనాడు అమిత్‌ షా మీడియాతో మాట్లాడినపుడు ఈ విషయంపై ప్రశ్నించగా- ‘ అన్ని విషయాలూ బహిర్గతం చేయం’ అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. దీంతో భేటీ జరిగే ఉంటుందన్న నిర్ధారణకు రాజకీయ వర్గాలు వచ్చాయి. అయితే ఎన్సీపీ మాత్రం ఇలాంటి సమావేశమేదీ జరగలేదని ఖండించింది. ‘షాను కలవాల్సిన అవసరం పవార్‌కు లేదు. ఇదంతా అయోమయం సృష్టించేందుకు బీజేపీ చేస్తున్న యత్నం’ అని ఎన్సీపీ జాతీయ ప్రతినిధి నవాబ్‌ మాలిక్‌ ఆదివారం రాత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  మరో పక్క- ఈ భేటీ జరిగిందని నిర్థరించుకున్న సంకీర్ణ సారథ్య పక్షం శివసేన ఎన్సీపీపై పరోక్షంగా దాడి మొదలెట్టింది.


ముఖ్యంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, సంక్షోభానికి కారణాల్లో ఒకరైన- ఎన్సీపీకి చెందిన- హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ను టార్గెట్‌ చేస్తూ సామ్నాలో ఆదివారం సంపాదకీయం రాసింది. ‘ఒక జూనియర్‌ పోలీస్‌ అధికారి (సచిన్‌ వాజే) సీపీ ఆఫీసులో కూర్చుని సెటిల్మెంట్లు, డబ్బు వసూళ్ళకు సంబంధించిన దందా నడుపుతున్నపుడు ఆ విషయం హోం మంత్రికి తెలియకుండా ఎలా ఉంటుంది? ఓ మామూలు ఏపీఐ అధికారి అయిన వాజేకు అపరిమిత అధికారాలను ఇచ్చిందెవరు? అనిల్‌ దేశ్‌ముఖ్‌ అనుకోకుండా హోంమంత్రి అయ్యారు. జయంత్‌ పాటిల్‌, దిలీప్‌ వాల్సే ఆ పోస్టును తిరస్కరించాక పవార్‌ దేశ్‌ముఖ్‌కు ఇవ్వడంతో ఆయన ఏక్సిడెంటల్‌గా ఈ పదవిలోకొచ్చారు. ఆయన అనవసరంగా కొందరు అధికారులను చికాకుపర్చారు. చుట్టూ అనుమానాస్పదమైన వ్యక్తులున్నపుడు ఒక మంత్రి ఎలా సజావుగా పనిచేయగలరు?’’ అని సామ్నా ఎడిటర్‌ అయిన సేన నేత సంజయ్‌ రౌత్‌ దాడిచేశారు. ఈ విమర్శలను ఉపముఖ్యమంత్రి ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ ఖండిస్తూ - సంకీర్ణ ప్రభుత్వంలో చిచ్చు పెట్టేట్లు ఎవరూ ప్రవర్తించరాదని పేర్కొన్నారు. 


ఎందుకు కలిసినట్లు..?

ముఖేశ్‌ అంబానీ ఇంటివద్ద పేలుడు వాహనం కేసు విషయంలో సంకీర్ణ సర్కార్‌తో పాటు వ్యక్తిగతంగా ఠాక్రే కూడా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న దశలో పవార్‌-భేటీ భేటీ జరగడం అనేక ఊహాగానాలకు తావిస్తోంది. కొవిడ్‌ ఉధృతి పెరగడమే తప్ప తగ్గకపోవడం, వ్యాక్సినేషన్‌ మందకొడిగా సాగడం ప్రభుత్వ వైఫల్యాలుగా బీజేపీ వాగ్బాణాలు సంధిస్తోంది. అంబానీ కేసులో కీలకంగా మారిన వివాదాస్పద పోలీస్‌ అధికారి సచిన్‌ వాజే ఎన్‌ఐఏ విచారణలో కొన్ని కీలకాంశాలు బయటపెట్టినట్లు ఇప్పటికే బయటకు పొక్కింది. హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై  బదిలీవేటు పడ్డ ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ చేసిన తీవ్రారోపణలతో ఎన్సీపీ తీవ్ర ఇరకాటంలో పడింది. అంబానీ కేసు విషయంలో కేంద్రం కూడా సీరియ్‌సగా ఉన్నట్లు వార్తలొచ్చాయి. పరిస్థితి పూర్తిగా దిగజారి, పార్టీ మెడకు చుట్టుకోకుండా పవార్‌ నష్టనివారణ చర్యలు చేపట్టారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. దీన్ని బీజేపీ కూడా సానుకూలంగా మల్చుకోవాలని చూస్తున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. సంకీర్ణం నుంచి ఎన్సీపీ బయటకు వచ్చి తమకు మద్దతివ్వాలన్న బేరసారాలు ఎప్పట్నుంచో ఉన్నాయి. సంకీర్ణం బలం 163 కాగా- అందులో నుంచి ఎన్సీపీ బలం (53) తీసేస్తే 110కి తగ్గుతుంది. ఎన్‌డీఏ బలం ప్రస్తుతం 114.. దీనికి ఎన్సీపీ తోడైతే ఇక అధికారం బీజేపీదే! కానీ ఈ విషయంలో పవార్‌ తొందరపడబోరని, ఇపుడు ఠాక్రేకు ఝలక్‌ ఇస్తే అది రాష్ట్రంలోనే కాక- జాతీయ స్థాయిలో కూడా తనకు మచ్చ అవుతుందని ఆయన భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. తనపై వచ్చిన ఆరోపణల మీద హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి విచారణ జరుపుతారని, దానితో నిజానిజాలేంటో బయటపడతాయని అనిల్‌ దేశ్‌ముఖ్‌ నాగ్‌ఫూర్‌ విమానాశ్రయంలో మీడియాకు చెప్పారు. అటు సంకీర్ణంలో మరో భాగస్వామ్యపక్షమైన కాంగ్రెస్‌.. పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తోంది. అమిత్‌ షా పవార్‌ల సమావేశం గురించి తమకు తెలియదని కొందరు కాంగ్రెస్‌ నేతలు వ్యాఖ్యానించారు.


హార్డ్‌ డిస్క్‌ లభ్యం

మన్‌సుఖ్‌ హిరేన్‌ మృతి కేసులో కీలకమైన హార్డ్‌ డిస్క్‌ ఎట్టకేలకు లభ్యమైంది. ‘ముంబైలోని బాంద్రా-కుర్లా ఏరియాలో మిథి నదీ కయ్యవద్దకు సచిన్‌ వాజేను తీసుకువెళ్లాం. అక్కడే తాను ఆ డిస్క్‌ను, ఇతర ఎలకా్ట్రనిక్‌ ఆధారాలను పడేసినట్లు చెప్పడంతో 11 మంది డైవర్లను నియోగించి మూడు గంటలపాటు వెతికించాం. మొత్తం రెండు హార్డ్‌ డిస్క్‌లతో పాటు రెండు సీసీటీవీ డీవీఆర్‌లు, రెండు సీపీయూలు, ఒక ల్యాప్‌ట్యాప్‌, ఒక ప్రింటర్‌, ఒకే నెంబరు ఉన్న రెండు కారు నంబరు ప్లేట్లు- మొత్తం పది ఆధారాలు దొరికాయి’ అని ఎన్‌ఐఏ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. వాజే సహచరుడైన మరో పోలీస్‌ అధికారి రియాజ్‌ కాజీ వాటిని అక్కడ పడేశాడన్నారు. చనిపోవడానికి రెండు రోజుల ముందు ముంబై పోలీ్‌సల ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ సీఐయూ కార్యాలయంలో మన్‌సుఖ్‌ హిరేన్‌ను వాజేతో ఉండడాన్ని తాను చూశానని ఓ హొటల్‌ యజమాని ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా ఎన్‌ఐఏ రికార్డు చేసింది.  


Updated Date - 2021-03-29T08:21:04+05:30 IST