Pegasus spyware: మొబైల్ ఫోన్ల వినియోగంపై సర్కారు ఆంక్షలు

ABN , First Publish Date - 2021-07-24T13:07:42+05:30 IST

పెగాసస్ స్పైవేర్ సమస్య నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై ఆంక్షలు విధించింది....

Pegasus spyware: మొబైల్ ఫోన్ల వినియోగంపై సర్కారు ఆంక్షలు

ముంబై (మహారాష్ట్ర): పెగాసస్ స్పైవేర్ సమస్య నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై ఆంక్షలు విధించింది. ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయంలో ఉన్న సమయంలో మొబైల్ ఫోన్ల వినియోగం కనిష్ఠంగా ఉంచాలని సర్కారు సూచించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ల్యాండ్ లైన్ ఫోన్లకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చి వినియోగించాలని సర్కారు కోరింది.అధికారిక పనికి అవసరమైతే మాత్రమే మొబైల్ ఫోన్లను ఉపయోగించాలని మహారాష్ట్ర సాధారణ పరిపాలనశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.ప్రభుత్వ కార్యాలయాల్లో మొబైల్ ఫోన్లను విచక్షణారహితంగా ఉపయోగించడం వల్ల ప్రభుత్వ ఇమేజీకి హాని కలుగుతుందని,పెగాసస్ స్పై వేర్ గురించి ప్రస్థావించకుండా మహా సర్కారు ఈ ఉత్తర్వులో పేర్కొంది.


మొబైల్ ఫోన్లను ఉపయోగించాలంటే టెక్ట్స్ సందేశాలను ఎక్కువగా వాడాలని, ఫోన్లలో సంభాషణను సాధ్యమైనంత వరకు తక్కువగా ఉండాలని జీఏడీ ఉత్తర్వుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సూచించింది. మొబైల్ ఫోన్లలో వ్యక్తిగత ఫోన్ కాల్స్ వస్తే కార్యాలయం నుంచి బయటకు వచ్చి మాట్లాడాలని ఉద్యోగులను సర్కారు కోరింది.మొబైల్ ఫోన్లలో సంభాషణ మర్యాదపూర్వకంగా ఉండాలని, తక్కువ స్వరంలో మాట్లాడాలని,అయితే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల ఫోన్ కాల్స్ కు ఆలస్యం చేయకుండా సమాధానం ఇవ్వాలని ఉద్యోగులను జీఏడీ ఆదేశించింది.


మొబైల్ ఫోన్లు అధికారిక సమావేశాల సమయంలో లేదా సీనియర్ అధికారుల గదుల్లో సైలెంట్ మోడ్‌లో ఉండాలని, అదేవిధంగా ఇంటర్నెట్ బ్రౌజింగ్, సందేశాలను తనిఖీ చేయడం, ఇయర్ ఫోన్‌ల వాడకాన్ని ఇలాంటి సందర్భాల్లో నివారించాలని మహారాష్ట్ర ప్రభుత్వం సూచించింది.


Updated Date - 2021-07-24T13:07:42+05:30 IST