మహారాష్ట్ర ఆస్పత్రిలో ఘోర అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2021-01-10T07:29:23+05:30 IST

వారంతా కన్నవారి కనుపాపలు.. అన్నెంపున్నెం తెలియని అమాయకులు..! అనారోగ్య సమస్యలు, తక్కువ బరువుతో జన్మించడంతో చికిత్స

మహారాష్ట్ర ఆస్పత్రిలో ఘోర అగ్ని ప్రమాదం

గాలిలో కలిసిన పదిమంది శిశువుల ప్రాణాలు

గాయాలతో ముగ్గురు, ఊపిరాడక ఏడుగురు

ఏసీలో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు!


 భండారా, జనవరి 9: వారంతా కన్నవారి కనుపాపలు.. అన్నెంపున్నెం తెలియని అమాయకులు..! అనారోగ్య సమస్యలు, తక్కువ బరువుతో జన్మించడంతో చికిత్స పొందుతున్నారు. స్వస్థత చేకూరిన కొందరు రోజుల్లో.. మరికొందరు వారాల్లో డిశ్చార్జి కానున్నారు! బిడ్డలను ఎప్పుడెప్పుడు ఇంటికి తీసుకెళ్దామా? అని తల్లిదండ్రులు ఆత్రుతలో ఉన్నారు. కానీ, అంతలోనే పెనువిషాదం! షార్ట్‌ సర్క్యూట్‌ రూపంలో మృత్యు వు వెంటాడటంతో నిండు నూరేళ్లు నిండిపోయాయి.

మహారాష్ట్రలోని భండారా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం తెల్లవారుజామున ఈ ఘోరం చోటుచేసుకుంది. ఆస్పత్రి నవజాత శిశు సంరక్షణ యూనిట్‌లో మంటలు చెలరేగి పదిమంది(8 మంది అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు) శిశువులు మృతిచెందారు. వీరిలో మంటలు అంటుకుని ముగ్గురు, పొగతో ఊపిరాడక ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రి సెక్యూరిటీ గార్డులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై ఏడుగురు శిశువులను రక్షించారు.


మొత్తం నాలుగు అంతస్తుల ఆస్పత్రిలో మొదటి అంతస్తులో నవజాత శిశు సంరక్షణ యూనిట్‌ ఉంది.  నెల నుంచి మూడు నెలల మధ్య వయసున్న శిశువులు చికిత్స పొందుతున్నారు. తెల్లవారుజామున 1.30-2 గంటల ప్రాంతంలో వార్డులో పొగ వస్తుండటంతో గుర్తించిన ఓ నర్సు.. వైద్యులను అప్రమత్తం చేసింది. వైద్యులు, ఇతర సిబ్బంది తలుపులు, కిటికీలు తెరిచి శిశువులను పక్క వార్డులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది యూనిట్‌ లోపలకు చొచ్చుకెళ్లారు. మంటలను ఆర్పేందుకు తీవ్రంగా యత్నించారు.


కాగా, అప్పటికే పదిమంది మృతి చెందారు. పొగ దట్టంగా కమ్ముకోవడంతో ప్రాణ నష్టం ఎక్కువైంది. నవజాత శిశు సంరక్షణ కేంద్రం పక్కనే.. ఐసీయూ వార్డు, ప్రసూతి వార్డు, డయాలసిస్‌ విభాగం ఉన్నాయి. ప్రమాదం నేపథ్యంలో వాటిలోని రోగులను ఇతర వార్డులకు మార్చారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే దుర్ఘటన జరిగిందని భావిస్తున్నట్టు మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్‌ తోపే తెలిపారు.


రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో ఉన్న నవజాత శిశు సంరక్షణ కేంద్రాలను తనిఖీ చేయాలంటూ డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ ఆదేశించారు. ప్రమాదానికి కారణాలను తేల్చేందుకు నేషనల్‌ ఫైర్‌ కాలేజీ, నాగపూర్‌లోని విశ్వేశ్వరయ్య నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నిపుణులతో విచారణకు ఆదేశించినట్లు హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ పేర్కొన్నారు. ఆస్పత్రిలో అగ్నిమాపక రక్షణ చర్యల తీరునూ పరిశీలిస్తుందని తెలిపారు. కాగా, ఎయిర్‌ కండిషన్డ్‌(ఏసీ) యంత్రంలో స్పార్క్‌ ఏర్పడి.. మంటలు చెలరేగినట్లు తెలుస్తోందని మాజీ సీఎం ఫడణవీస్‌ అన్నారు. 



విద్యుత్‌ వ్యవస్థ లోపాలే కారణమా?

భండారా ఆస్పత్రి దుర్ఘటనకు విద్యుత్‌ వ్యవస్థ లోపాలే కారణమని తెలుస్తోంది. నవజాత శిశు సంరక్షణ వార్డులో విద్యుత్‌ సరఫరాలో హెచ్చు తగ్గులు సంభవిస్తున్నాయని ఆస్పత్రి వర్గాలకు శిశువుల బంధువులు వారం రోజులుగా ఫిర్యాదు చేస్తున్నారు. అయినా, చర్యలు తీసుకోలేదు. ఆస్పత్రిలో అగ్ని ప్రమాద నిరోధక, విద్యుత్‌ పరికరాలు కూడా సరిగా లేవు. రూ.కోటితో అగ్నిమాపక పరికరాల కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదనలు గత మే నెల నుంచి ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.


మరోవైపు మీడియాను దూరంగా ఉంచారు. ఆస్పత్రి వర్గాలు సైతం ఘటనపై నోరువిప్పలేదు. మృతి చెందిన శిశువుల తల్లిదండ్రులను ఆస్పత్రి నుంచి బయటకు రానీయలేదు. కాగా, దుర్ఘటనపై లోతైన విచారణ జరిపి, 48 గంటల్లో నివేదిక ఇవ్వాలంటూ భండారా కలెక్టర్‌ను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఆదేశించింది. ఈ ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇది తనను తీవ్రంగా కలవరానికి గురిచేసిందని మోదీ ట్వీట్‌ చేశారు.

బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ కోరారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే విచారణకు ఆదేశించారు. ప్రభుత్వం తరఫున 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ఆరోగ్య మంత్రి రాజేష్‌ తోపే ప్రకటించారు.


అనాథగానే జననం.. అనాథగానే మరణం

మృతి చెందిన పదిమంది శిశువుల్లో 9 మృతదేహాలను తల్లిదండ్రులకు అప్పగించారు. మిగతా ఒక్క శిశువు సంబంధీకులెవరూ లేరు. గత వారం లఖన్‌ తహసీల్‌లోని కేశల్వాడ గ్రామంలో ఈ శిశువును ఎవరో వదిలివెళ్లారు. విషయం పత్రికల్లో రావడంతో పోలీసులు చేరదీశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం భండారా ఆస్పత్రికి తరలించారు. చివరకు అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.


పేరు కూడా పెట్టలేదు.. అంతలోనే మృత్యుఒడికి

ఆ చిన్నారి 830 గ్రాముల బరువుతో జన్మించింది. ఆస్పత్రిలో చేరాక చికిత్సతో రెండు నెలల్లో బరువు 1,300 గ్రాములకు పెరిగింది. మరో 8 రోజులు చూసి.. 1,500 గ్రాములకు చేరాక డిశ్చార్జి చేస్తామని నర్సు తెలిపింది. కానీ, అంతలోనే విధి.. ఆమెను కన్నవారికి దూరం చేసింది. భండారా ఆస్పత్రిలో ఓ శిశువు విషాదాంతమిది. తమ బిడ్డకు పేరు కూడా పెట్టలేదని.. అంతలోనే కాలిపోయిన శరీరాన్ని తీసుకెళ్లాల్సి వచ్చిందని తల్లిదండ్రులు గీత, విశ్వనాథ్‌ రోదిస్తూ చెప్పుకొచ్చారు. 


Updated Date - 2021-01-10T07:29:23+05:30 IST