చెరువులకు మహర్దశ

ABN , First Publish Date - 2022-05-29T05:44:45+05:30 IST

చెరువులకు మహర్దశ తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మిషన్‌ అమృత్‌ సరోవర్‌ పథకాన్ని అమల్లోకి తెచ్చింది.

చెరువులకు మహర్దశ
వీర్నపల్లిలో అమృత్‌ సరోవర్‌ పథకంలో చెరువు మరమ్మతు పనుల్లో ఉపాధి కూలీలు

- కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మిషన్‌ అమృత్‌ సరోవర్‌

- జిల్లాలో మొదటి విడతలో 75 చెరువుల ఎంపిక 

- ఉపాధిహామీ ద్వారా పనులు ప్రారంభం

- అగస్టు 15 లోగా పూర్తి.. చెరువు కట్టపైనే జాతీయ జెండా రెపరెపలు 


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

చెరువులకు మహర్దశ తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మిషన్‌ అమృత్‌ సరోవర్‌ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. వచ్చే అగస్టు 15లోగా మొదటి విడత పనులు పూర్తి చేసి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చెరువు కట్టపైనే జాతీయ జెండాను ఎగురవేయాలనే ఆదేశాలు ఇచ్చారు. దీంతో జిల్లాలో దెబ్బతిన్న చెరువుల మరమ్మతుల పనులు మొదలయ్యాయి. నూతన అమృత్‌ సరోవర్‌ పథకం పల్లెలకు వరంగా భావిస్తున్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పథకంలో చెరువుల మరమ్మతులు చేపట్టినా మళ్లీ దెబ్బతిన్నాయి. వర్షాకాలం ప్రారంభం అవుతున్న క్రమంలో దేశవ్యాప్తంగా మొదలైన అమృత్‌ సరోవర్‌లో భాగంగా చెరువులు మరమ్మతులను జాతీయ ఉపాధి హామీ పథకంలో పనులు చేపట్టారు. 

- లక్ష నుంచి 10 లక్షల రూపాయలతో..

జిల్లాలో అమృత్‌ సరోవర్‌ పథకంలో 75 చెరువులను ఎంపిక చేశారు. బోయినపల్లి మండలంలో మూడు చెరువులు, చందుర్తిలో ఎనిమిది చెరువులు, ఇల్లంతకుంటలో ఎనిమిది చెరువులు, గంభీరావుపేటలో ఎనిమిది చెరువులు, కోనరావుపేలో ఎనిమిది, ముస్తాబాద్‌లో ఎనిమిది  చెరువులు, రుద్రంగి నాలుగు చెరువులు, తంగళ్లపల్లిలో ఎనిమిది  చెరువులు, వీర్నపల్లిలో ఎనిమిది  చెరువులు, వేములవాడలో రెండు చెరువులు, వేములవాడ రూరల్‌లో రెండు చెరువులు, ఎల్లారెడ్డిపేటలో ఎనిమిది  చెరువులను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన చెరువులలో ఈజీఎస్‌ ద్వారా ప్రతి చెరువుకు  లక్ష రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయనున్నారు. చెరువుల్లో పూడికతీత, కట్టలను బలోపేతం చేయడం, తూములు, మత్తడుల మరమ్మతులు వంటి పనులు చేస్తారు. అవకాశం ఉన్న చోట కొత్త చెరువులను కూడా నిర్మిస్తారు. ప్రస్తుతం జిల్లాలో 75 చెరువుల మరమ్మతులను చేపట్టే పనుల్లో ఉన్నారు. ఇప్పటికే కొన్ని చెరువుల్లో పనులు ప్రారంభమయ్యాయి. అమృత్‌ సరోవర్‌ పథకం ద్వారా చెరువులను మరమ్మతులు చేసి తాగు, సాగునీటి సాకర్యం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అవసరమైన చోట 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు. ప్రతీ చెరువు కింద లక్ష పనిదినాలు కల్పించుకునే అవకాశం ఉంది. చెరువు అడుగు భాగంలో పదివేల ఘనపు అడుగుల మేర నీటిని నిల్వ ఉండేలా కొలతలు ఇచ్చి ఒండ్రు మట్టిని తీయనున్నారు. రైతులు మట్టిని పొలాల్లో చల్లించుకోవడం, లేదా కట్టకు ఉపయోగించడం విషయాలు  గ్రామ పంచాయతీల పాలకవర్గాలు నిర్ణయిస్తాయి. 

- నత్తనడకన మిషన్‌ కాకతీయ..

జిల్లాలో 13 మండలాల్లో 666 చిన్న నీటి వనరుల చెరువులు ఉన్నాయి. వీటి కింద 44,060 ఎకరాల ఆయకట్టు ఉంది. అయకట్టు స్థిరీకరణ భూగర్భ జలాల అభివృద్ధి కోసం మిషన్‌ కాకతీయ పథకాన్ని 2014లో ప్రారంభించారు. ఇప్పటి వరకు నాలుగు దశల్లో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం ప్రారంభించారు. పథకం ప్రారంభం నాటినుంచి నత్తనడకగానే పనులు సాగాయి. నాసిరకం పనులతో చెరువులు మళ్లీ యథాస్థితికి వచ్చాయి. జిల్లాలో 666 చెరువుల్లో 335 చెరువుల పనులను ఆమోదించి  294 పనులను పూర్తి చేశారు.  145.96 కోట్ల రూపాయల విలువ గల పనుల్లో 102.79 కోట్లు రూపాయలు ఖర్చు చేశారు. కానీ మిషన్‌ కాకతీయలో చేపట్టిన పనులు మళ్లీ పునరుద్ధరించకపోవడంతో చెరువుల పరిస్థితి ఆధ్వానంగా మారింది. అమృత్‌ సరోవర్‌ పథకంతో చెరువుల మరమ్మతుకు మార్గం ఏర్పడిందని భావిస్తున్నారు. 


Updated Date - 2022-05-29T05:44:45+05:30 IST