వాసాలమర్రికి మహర్దశ

ABN , First Publish Date - 2021-06-19T05:48:50+05:30 IST

వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్‌ దత్తత తీసుకోవడంతోపాటు రూ.100కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని ప్రకటించారు.

వాసాలమర్రికి మహర్దశ

గ్రామానికి 22న సీఎం కేసీఆర్‌


తుర్కపల్లి, జూన్‌ 18: వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్‌ దత్తత తీసుకోవడంతోపాటు రూ.100కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని ప్రకటించారు. దీంతో అన్ని శాఖల అధికారులు గ్రామంలో పర్యటించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఈ నెల 22న వాసాలమర్రిలో పర్యటించనుండటంతో అభివృద్ధి పనులు వేగవంతంకానున్నాయి. దీంతో గ్రామానికి మహర్దశ పట్టనుంది.


వాసాలమర్రిని దత్తత తీసుకున్న సీఎం

సీఎం కేసీఆర్‌, గత ఏడాది అక్టోబరు 30న వరంగల్‌ జిల్లాలో ఓ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో వాసాలమర్రిలో కాన్వాయిని నిలిపి గ్రామస్థులతో ముచ్చటించి సమస్య లు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ సర్పంచ్‌తో పాటు మరో 10మంది మంది ముఖ్యులను ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి రావాలని సీఎం సూచించారు. దీంతో నవంబరు 1న సర్పంచ్‌ పోగుల అంజనేయులు, ఎంపీటీసీ నవీన్‌కుమార్‌తో పాటు మరికొందరు సీఎం ఫాంహౌ స్‌కు వెళ్లి కలిశారు. వారితో ముచ్చటించిన సీఎం గ్రామ ఆర్థిక, సామాజిక స్థితిగతులు, మౌలిక వసతులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని నాడు ప్రకటించి, ఏ అభివృద్ధి పనులు చేపట్టాలో అధికారులు తెలపాలని సీఎం సూచించారు.


అధికారుల కార్యాచరణ

వాసాలమర్రి గ్రామాభివృద్ధికి అవసరమయ్యే నిధుల కేటాయింపునకు జిల్లాలోని అన్ని శాఖల అధికారులు గ్రామంలో పర్యటించి ఇంటింటి సర్వే నిర్వహించారు. అనంతరం అభివృద్ధి పనుల కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. సర్వేలో గ్రామ ప్రజల స్థితిగతులు, వ్యాపారం, వ్య వసాయ వివరాలు, ఆదాయ మార్గాలు, వ్యవసాయ విస్తీర్ణం, పంటలు, ప్రధాన నీటి వనరులు తదితర వివరాలతో నివేదిక రూపొందించారు. రోడ్లు, డ్రైనేజీలు, ఖాళీ స్థలాలు వివరాలను శాటిలైట్‌ ఆధారంగా బ్లూప్రింట్‌ తయారు చేశారు. గ్రామస్థుల హెల్త్‌ ప్రొఫైల్‌ తయారుచేశారు. గ్రామానికి సంబంఽధించిన పూర్తి కార్యాచరణ ప్రణాళిక రూపొందించిన నేపథ్యంలో సీఎం పర్యటన ఖరారైంది.


ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం : ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత 

వాసాలమర్రిని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామంలో 2,373 జనాభా ఉండగా, 766 ఇళ్లు ఉన్నాయన్నారు. అందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి, ప్రతీ కుటుంబానికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. గ్రామంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, పల్లె ప్రకృతివనం కాకుండా ప్రత్యేక పార్క్‌, ఓపెన్‌ జిమ్‌, గ్రంథాలయం నిర్మిస్తామన్నారు. ఇక్కడ 100 ఎకరాల్లో తోటలు ఉన్నాయని, రైతులు కూరగాయల సాగు చేస్తుండగా, కోల్డ్‌స్టోరేజీ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడి నుంచి 10 గ్రామాలకు అనుసంధానంగా లింక్‌ రోడ్లు నిర్మిస్తామన్నారు. రూ.1కోటి వ్యయంతో మల్టీపర్పస్‌ హాల్‌, వెటర్నరీ సబ్‌ సెంటర్‌ భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు.


సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్‌ ఈ నెల 22న సందర్శించి సభ నిర్వహించనుండటంతో స్థలాన్ని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, కలెక్టర్‌ పమేలా సత్పథి తదితరులు శుక్రవారం పరిశీలించారు. సభాస్థలి, సహపంక్తి భోజనాల కోసం వేర్వేరుగా స్థలాన్ని గుర్తించారు. వర్షంతో ఎలాంటి అంతరాయం కలగకుండా వాటర్‌ప్రూఫ్‌ టెంట్లు ఏర్పాటు చేయనున్నారు. వారి వెంట డీఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి, సీఈవో కృష్ణారెడ్డి, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Updated Date - 2021-06-19T05:48:50+05:30 IST