Abn logo
Oct 15 2021 @ 00:41AM

ఘనంగా మహర్నవమి వేడుకలు

అశ్వారావుపేటలో అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్న భక్తులు

అశ్వారావుపేట/అశ్వారావుపేట రూరల్‌, అక్టోబరు 14: దసరా వేడుకల్లో రెండో రోజైన మహర్నవమి పర్వదినాన్ని మండల ప్రజలు అత్యంత ఆనందోత్సహాల మధ్య జరుపుకున్నారు. అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వగా ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలు జరిపారు. అశ్వారావుపేటలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారు భక్తులకు కాళికాదేవి రూపంలో దర్శనమిచ్చారు. చిన్నారుల చేత నవదుర్గ పూజను ఘనంగా జరిపారు. పట్టణంలోని సాయిబాబా మందిరంలో వేడుకలు చూడముచ్చటగా జరిగాయి. అమ్మవారు భక్తులకు మహిషాసుర మర్దిని రూపంలో పూజలు అందుకున్నారు. పలువురు దంపతులు పీటల మీద కూర్చుని పూజలు జరిపారు. జంగారెడ్డిగూడెం మార్గంలోని దుర్గమ్మ ఆలయంలో పూజలను ఘనంగా జరిపారు. చిన్నారుల చేత పూజలు జరిపారు. మధ్యాహ్నాం ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వందల మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. రామాలయంలో చిన్నారుల చేత నవదుర్గ పూజను జరిపించారు. మండలంలోని కొత్తమామిళ్లవారిగూడెం, కొత్తనారంవారిగూడెం, ఊట్లపల్లితో పాటు అనేక గ్రామాల్లో గల అమ్మవారి మండపాల వద్ద అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గాదేవిని అందంగా అలంకరించి ప్రత్యేకంగా పూజలు జరిపారు. కార్యక్రమంలో నిర్వాహకులు పాల్గొన్నారు. 

లలిత త్రిపుర సుందరిగా అమ్మవారు

దుమ్ముగూడెం అక్టోబరు 14: దసరా మహోత్సవాల్లో భాగంగా మండల పరిధిలోని లక్ష్మీనగరం కనకదుర్గ అమ్మవారు గురువారం లలిత త్రిపుర సుందరి అలంకారంలో భక్తులను అలరించారు. అలాగే గంగోలు కాళికామాత ఆలయం, దుమ్ముగూడెం, సీతా రాంపురంలో ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. అర్చకులు రాజగో పాలా చార్యులు, రాఘవాచార్యులు శాస్త్రోపే క్తంగా పూజలు జరిపించారు.

మహిషాసురమర్దినిగా

మణుగూరు, అక్టోబరు 14 : విజయ దశమి సందర్భంగా దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో బాగంగా చివరి రోజు గురువారం కనకదుర్గ మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. పైలట్‌ కాలనీలోని కాళీమాత ఆలయంలో దుర్గమ్మకు లక్ష కుంకుమార్చన వైభవంగా నిర్వహించారు. ఆలయ పూజారి ఉప్పల సత్యనారాయణశాస్త్రి అమ్మవారికి ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. గుట్టమల్లారంలోని పంచముఖ వేధ గాయత్రీ దేవి ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లొ దోసపాటి వెంకటేశఽ్వరరావు, సామా వెంకటరెడ్డి, మౌనిక రెస్టారెంట్‌ వెంకటరెడ్డి, వత్సవాయి కృష్ణంరాజు పాల్గొన్నారు. ఆలయ వ్యవస్ధాపకులు వసంతాచార్యులు, పూజారి ప్రదీప్‌శాస్త్రి ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. పైలట్‌ కాలనీ సివిల్‌ ఆఫీసు, ఓసీ4 గని ఆవరణలో కనకదుర్గ ఆలయం, పివీ కాలనీ రాజరాజేశ్వరి, కనకదుర్గ ఆలయం. ఓం శక్తి ఆలయాల్లో ప్రత్యేక పూజల్ని నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఓసీ గనిలో నిర్వహించిన పూజల్లో ఏరియా జీఎం జక్కం రమేష్‌ దంపతులు పాల్గొన్నారు. .

వినాయకపురంలో బోనాల పండుగ

అశ్వారావుపేట, అక్టోబరు 14: వినాయకపురంలో గురువారం మహిళలు బోనాల వేడుకలను నిర్వహించారు. దసరా పండుగను పురస్కరించుకొని మండలంలోని వినాయకపురంలో మహిళలు బోనాలు ఎత్తుకొని గ్రామంలో మేళతాళాలు, గణాసారులతో ఊరేగింపు జరిపారు.