Abn logo
Dec 19 2020 @ 00:26AM

మెజారిటీవాదం: అప్పుడూ ఇప్పుడూ

రాష్ట్రీయ స్వయంసేవక్ గురించి మహాత్మాగాంధీ 1947 ద్వితీయార్ధంలో వ్యక్తం చేసిన అభిప్రాయం అప్పుడు ఎంత యథార్థమో ఇప్పుడూ అంతే నిర్దుష్టమైనది.పూర్తిగా కలవరం కలిగించేది అని కూడా చెప్పి తీరాలి. అధికారం అంచున ఉన్నా లేక అధికారం నెరపుతున్నా ఆరెస్సెస్ సదా సంపూర్ణాధికార దృక్పథంతో వ్యవహరించే ఒక మతతత్వ సంస్థ. అది, అంతకంటే తక్కువా కాదు, ఎక్కువా కాదు.


స్వాతంత్ర్య వేకువ, దేశ విభజన దౌర్భాగ్యం, శరణార్థుల వెల్లువ– ఈ అల్లకల్లోల పరిస్థితుల్లో భారత్‌కు ఒక అంతర్గత శత్రువు నుంచి తీవ్ర ముప్పు వాటిల్లింది. హిందూ మత దురహంకారమే ఆ దురవస్థ. ఈ సంకుచిత జాత్యభిమాన ప్రేరణతో పనిచేస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) హిందూ మధ్యతరగతి ప్రజల మద్దతును గణనీయంగా గెలుచుకున్నది. హిందూ మతస్థులైన పలువురు ప్రభుత్వోద్యోగులు, రాజకీయవేత్తలు ఆ సంస్థకు అనుయాయులయ్యారు. కాంగ్రెస్‌వాదుల రహస్య సానుభూతిని సైతం సంఘ్ చూరగొన్నదని గాంధీజీ చివరి కార్యదర్శి ప్యారేలాల్ తన ‘మహాత్మా గాంధీ: ది లాస్ట్ ఫేజ్’లో రాశారు. ‘సంఘ్ ఒక మతతత్వ, ఫాసిస్టు సంస్థ. హిందూరాజ్‌ను ఏర్పాటు చేయడమే దాని ప్రకటిత లక్ష్యం. ముస్లింలందరినీ భారత్ నుంచి పంపించివేయాలి అనేది దాని నినాదం’. అని కూడ ఆయన రాశారు.


సంఘ్ లక్ష్యాన్ని ఇద్దరు అసాధారణ హిందువులు దృఢసంకల్పంతో వ్యతిరేకించారు. భారత్‌ను మాతృభూమిగా గౌరవించి, ఈ దేశంలోనే ఉండిపోయిన ముస్లింల హక్కులను సంరక్షించడం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు ఆ ఇరువురూ వెనుకాడలేదు. ఈ మహోన్నత, స్ఫూర్తిదాయక హిందువులు మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ అని మరి చెప్పాలా? 


1947 ద్వితీయార్ధంలో భారత రాజకీయాలలోనూ, ప్రజా జీవనంలోనూ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ పేరు ప్రఖ్యాతులు ఉన్న సంస్థ కాదు. దేశ విభజన నేపథ్యంలో నెలకొన్న మతతత్వ ఉద్రిక్తతలను ఉపయోగించుకుని తన పలుకుబడిని, ప్రభావాన్ని పెంపొందించుకునేందుకు సంఘ్ ఆరాటపడింది. అయితే గాంధీ, నెహ్రూల దృఢసంకల్పం సంఘ్ ఉత్థానాన్ని నిరోధించింది. ఒక హిందూ పాకిస్థాన్‌గా భారత్‌ను రూపొందించే సంకల్పం భారత ప్రభుత్వంలో ఏ ఒక్కరికీ లేదని ప్రధాని నెహ్రూ విస్పష్టంగా ప్రకటించారు. గాంధీ తన నిరశన దీక్షలతో కలకత్తా, ఢిల్లీ నగరాలలో మతసామరస్యాన్ని నెలకొల్పడంలో సఫలమయ్యారు. 1948 జనవరి 30న గాంధీజీని సంఘ్ వాది ఒకడు హతమార్చాడు. మహాత్ముని బలిదానం హిందువులను భీతావహులను చేసింది. అంతకు మించి లజ్జాభరితుల్ని చేసింది. పశ్చాత్తాపం వారిని ఆవహించింది. ప్రతి హిందువులో మానవతా వివేకం మళ్ళీ ఉదయించింది. మతసామరస్యం తమ విధ్యుక్తధర్మమని గుర్తించారు. ఆ ఆదర్శాన్ని ఔదలదాల్చారు. ఆరెస్సెస్ కుటిల లక్ష్యాలు భగ్నమయ్యాయి- అప్పటికి. 


ఇది రాస్తున్న సమయంలో ఆరెస్సెస్ ఇంకెంత మాత్రం అప్రధాన సంస్థ కాదు. భారత రాజకీయాలు, ప్రజా జీవితంపై సంపూర్ణ ఆధిపత్యం నెరపుతున్న సంస్థ. దాని రాజకీయ విభాగమైన భారతీయ జనతాపార్టీ కేంద్రంలోనూ, పలు రాష్ట్రాలలోనూ అధికారంలో ఉంది. హిందూ మధ్యతరగతి ప్రజలలో చాలా మంది రహస్యంగా గాక, బహిరంగంగానే సంఘ్‌కు తీవ్ర మద్దతుదారులుగా ఉన్నారు. ఆ సంస్థ రాజకీయ, భావజాల ఎజెండాను పూర్తిగా సమర్థిస్తున్నారు.  


1947లో ఆరెస్సెస్ మౌలిక విశ్వాసాలు ఏమిటి? ఇంతకు ముందు ప్రస్తావించిన ప్యారేలాల్ మాటలను మళ్ళీ ఉటంకిస్తాను: ‘హిందూరాజ్‌ను ఏర్పాటుచేయడం సంఘ్‌వాదుల ప్రకటిత లక్ష్యం. ముస్లింలు అందరినీ భారత్ నుంచి పంపించివేయాలి అనేది వారి నినాదం’. ఈ ప్రకటనలోని మొదటి భాగం ఇప్పటికీ పూర్తిగా చెల్లుతుంది. రెండో భాగాన్ని సవరించారు. దేశ విభజన సంభవించిన తక్షణ రోజుల్లో సంఘ్ నాయకులు చాలామంది ముస్లింలు అందరినీ భారత్ నుంచి తరిమేయాలని కోరుకున్నారు. అయితే అది సాధ్యం కాబోదనే సత్యం 1950 దశకం తొలినాళ్ళకే వారికి అవగతమయింది. సరే, ఇప్పుడు భారతీయ ముస్లింల పట్ల సంఘ్ దృక్పథంలో కొంత మార్పు వచ్చింది. భారత్‌లో జన్మించి, ఈ దేశంలో నివశిస్తున్నవారు ఇక్కడే ఉండిపోవచ్చు. అయితే హిందువుల రాజకీయ, సామాజిక, ఆర్థిక, నైతిక ఆధిక్యతను గుర్తించి, గౌరవిస్తున్నంతవరకు ముస్లింలు ఈ దేశంలో నివశించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదు అనేది ప్రస్తుతం ఆరెస్సెస్ రాజకీయ ఎజెండా.


మధ్యయుగాల ఇస్లాం నుంచి ఆ ఎజెండాను సంఘ్ స్వీకరించింది! ఇదొక చారిత్రక వైపరీత్యం. ఇస్లామిక్ సామ్రాజ్యాలు ఉచ్ఛదశలో ఉన్న ఆ కాలంలో ముస్లింలకు యూదులు, క్రైస్తవులకంటే మేలైన హక్కులు ఉండేవి. అంతటా ముస్లింలదే ఆధిక్యత. వారే అసలు పౌరులు. సర్వహక్కులూ వారికే. ముస్లిమేతర మతస్థులు ఇస్లాం ఆధిపత్యాన్ని ఆమోదించి తీరాలి. ముస్లింల కంటే తాము తక్కువ వారమని అంగీకరించి తీరాలి. ద్వితీయశ్రేణి పౌరులుగా మనుగడ సాగించాలి. ఇలా చేసినప్పుడు మాత్రమే ముస్లిం సమాజాలలో వారికి, వారి కుటుంబాలకు రక్షణ ఉంటుంది. ఉపాధి అవకాశాలు పొందవచ్చు. మధ్యయుగాల ముస్లిం సామ్రాజ్యాలలో ఆచరణలో ఉన్న వివక్షాపూరిత విధానాలు వర్తమాన భారతదేశంలో కూడా అమలుకావడమే ఆరెస్సెస్ అభీష్టం. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చరిత్ర, సామాజిక, సాంస్కృతిక కార్యాచరణలపై విస్తృత అధ్యయనాలు జరిగాయి. పలు పరిశోధనా గ్రంథాలు వెలువడ్డాయి సంఘ్ సైతం తన లక్ష్యాలు, కార్యక్రమాల గురించి సవివరమైన పుస్తకాలు, కరపత్రాలను వెలువరించింది. ఈ సమాచారం మరింత విపులంగా ఎప్పటికప్పుడు సంఘ్ సభ్యులకూ, సభ్యులు కానివారికీ అందుబాటులోకి వస్తోంది. హిందూ స్వాభిమానాన్ని పునరుజ్జీవింప చేసేందుకు తాము అంకితమయ్యామని ఆరెస్సెస్ చెబుతోంది. అయితే ఆ సంస్థ, దాని అనుబంధ రాజకీయపక్ష విశ్వాసాలు, కార్యాచరణలు స్వభావతః దురభిమానపూర్వక ధోరణులతో ప్రభావితమవుతున్నాయి. కేంద్రప్రభుత్వం, బీజేపీ పాలిత రాష్ట్రప్రభుత్వాల ఇటీవలి చర్యలను పరిగణనలోకి తీసుకోండి. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తి రద్దు, అయోధ్యలో ఒక ఆలయ నిర్మాణంపై విజయోత్సాహం, అంతర్-మత వివాహాలకు వ్యతిరేకంగా చట్టాల నిర్మాణం, మరీ ముఖ్యంగా పౌరసత్వ సవరణ చట్టం, ఆ శాసనాన్ని వ్యతిరేకిస్తున్న వారిపై పాశవిక దమనకాండ -ఇవన్నీ భారతీయ సమాజంలో ముస్లింలకు వారి స్థానం ఏమిటో చూపేందుకు చేపట్టిన చర్యలేగా. 


1947 సెప్టెంబర్‌లో ఢిల్లీలో తాను ప్రత్యక్షంగా విన్న ఒక సంభాషణ గురించి ప్యారేలాల్ తన పుస్తకంలో పేర్కొన్నారు. వాహ్ శరణార్థుల శిబిరంలో ఆరెస్సెస్ కార్యకర్తలు నిర్వహించిన సేవా కార్యక్రమాల గురించి గాంధీజీ బృందంలోని ఒకరు చాలా మెచ్చుకోలుగా చెప్పారు. క్రమశిక్షణతో చాలా కష్టపడి పని చేశారని కూడ ఆయన అన్నారు. తన సహచరుడి మాటలకు గాంధీజీ ప్రతిస్పందిస్తూ ‘మీరు ఒక వాస్తవాన్ని మరచిపోవద్దు. హిట్లర్ నాజీలు, ముస్సోలినీ ఫాసిస్టులు కూడా అత్యంత క్రమశిక్షణాపరులు. ఎటువంటి కష్టమైన పనినైనా చేయగల సమర్థులే’ అన్నారు. పైగా ‘రాష్ట్రీయ స్వయంసేవక్ ‌సంఘ్ సంపూర్ణాధికార దృక్పథం గల ఒక మతతత్వ సంస్థ’ అంటూ సమాధానాన్ని ముక్తాయించారని ప్యారేలాల్‌ వివరించారు. 


72 సంవత్సరాల క్రితం ఆరెస్సెస్ గురించి గాంధీజీ వ్యక్తం చేసిన అభిప్రాయం ఇప్పటికీ నిలుస్తుందా అంటే, నిలుస్తుంది. కాకపోతే ఆయన ఉపయోగించిన విశేషణాలను ఇటు అటుగా, అటు ఇటుగా మార్చవలసిఉంది. ఇప్పుడు ఆరెస్సెస్ గురించి, ‘మతతత్వ దృక్పథంతో వ్యవహరించే ఒక సంపూర్ణాధికార సంస్థ’ అనడం సబబుగా ఉంటుంది. 1947లో ఆరెస్సెస్ భారతీయ సమాజ జీవనం అంచుల్లో మాత్రమే ఉంది. ఇప్పుడు అది సకల భారతీయ జీవన రంగాలన్నిటినీ ఇతోధికంగా ప్రభావితం చేస్తోంది. కేంద్రప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న సంఘ్ సభ్యులు పత్రికారంగాన్ని లోబరుచుకున్నారు, న్యాయవ్యవస్థను ఇంచుమించు సానుకూలం చేసుకున్నారు. ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రభుత్వాలను బలహీనపరిచేందుకు లేదా కూలదోసేందుకు ధనబలాన్ని ఉపయోగిస్తున్నారు. ఎన్‌జిఓలపై ఆంక్షలు విధించేందుకు తీసుకువచ్చిన కొత్త చట్టాల లక్ష్యం హిందూత్వ భావజాలంతో ఏకీభవించని స్వచ్ఛందసంస్థలను అణచివేయడమే. 


రాజకీయప్రక్రియలు, రాజ్యాంగసంస్థలు, వ్యవస్థలపై పూర్తి ప్రాబల్యాన్ని సాధించేందుకు ఆరెస్సెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. పౌర సమాజాన్ని పూర్తిగా తమ నియంత్రణలో ఉంచుకునేందుకు అవి ఆరాటపడుతున్నాయి. ప్రజలు ఏమి తినాలో, వారి వస్త్రధారణ ఎలా ఉండాలో, ఎవరిని వివాహం చేసుకోవాలో లేదా చేసుకోకూడదో నిర్దేశిస్తున్నాయి. ప్రజాజీవితపు రాజకీయ, సామాజిక, సంస్థాగత లేదా సైద్ధాంతిక పార్శ్వాలన్నిటిపైన ఎటువంటి మినహాయింపులు లేని నియంత్రణ సాధించడమనే ఆకాంక్ష ‘నియంతృత్వవాద లేదా సంపూర్ణాధికార’ దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నది. ముస్లింలపై అపవాదులు వేసేందుకు లేదా వారు దేశభక్తులు కాదని చెప్పేందుకు సంఘ్ అనుయాయులు చేస్తున్న ప్రయత్నాలు వారి మతతత్వ దృక్పథానికి దృష్టాంతాలు.


రాష్ట్రీయ స్వయంసేవక్ గురించి మహాత్మా గాంధీ 1947 ద్వితీయార్ధంలో వ్యక్తం చేసిన అభిప్రాయం అప్పుడు ఎంత యథార్థమో ఇప్పుడూ అంతే నిర్దుష్టమైనది. పూర్తిగా కలవరం కలిగించేది అని కూడా చెప్పి తీరాలి. అధికారం అంచున ఉన్నా లేక అధికారం నెరపుతున్నా ఆరెస్సెస్ సదా సంపూర్ణాధికార దృక్పథంతో వ్యవహరించే ఒక మతతత్వ సంస్థ. అది, అంత కంటే తక్కువా కాదు, ఎక్కువా కాదు.రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Advertisement
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేమరిన్ని...

Advertisement