మహాత్మునిలో విప్పారిన మానవత

ABN , First Publish Date - 2021-01-30T06:32:25+05:30 IST

గాంధీ తన జీవనప్రస్థానం ముగిసేవరకు సంప్రదాయక, ప్రగతి వ్యతిరేక భావాలను త్యజిస్తూ, ఉదాత్త మానవతా వైఖరులను అనుసరించారు. జాతివివక్ష, కుల అంతరాలు, జెండర్ అసమానతలపై ఆయన భావ పరిణామమే అందుకు నిదర్శనం....

మహాత్మునిలో విప్పారిన మానవత

గాంధీ తన జీవనప్రస్థానం ముగిసేవరకు సంప్రదాయక, ప్రగతి వ్యతిరేక భావాలను త్యజిస్తూ, ఉదాత్త మానవతా వైఖరులను అనుసరించారు. జాతివివక్ష, కుల అంతరాలు, జెండర్ అసమానతలపై ఆయన భావ పరిణామమే అందుకు నిదర్శనం. గాంధీని అధ్యయనం చేయడం, ఆయన జీవితం, ఉద్యమాలను పరిశోధించడం అంటే ఒక ఉదాత్త వ్యక్తిని కలుసుకోవడమే. గాంధీ పరిపూర్ణుడు, పవిత్రుడు అనీ, ఒక మహాత్ముడు అని కూడా ఆయన అనుయాయులు అంటారు. అయితే తాను లోపరహితుడిని కాననే సత్యం మహాత్ముడికి బాగా తెలుసు.


గాంధీజీ తొలి జీవిత చరిత్రకారులలో నేటికీ సుప్రసిద్ధుడు లూయీ ఫిషర్. ఈ అమెరికన్ రచయిత రాసిన ‘ది లైఫ్ ఆఫ్ మహాత్మాగాంధీ’ (1949) ఆధారంగానే రిచర్డ్ అటెన్‌బరో 1980వ దశకంలో వెండితెరపై గాంధీ గాథను సృజించారు. లూయీ ఫిషర్ 1942 వేసవిలో మన దేశాన్ని సందర్శించారు బొంబాయిలో అంబేడ్కర్, సావర్కర్, జిన్నాలతో మాటామంతీ జరిపిన అనంతరం అంతర్జాతీయంగా సుప్రసిద్ధుడైన సేవాగ్రాం నివాసితో మాట్లాడేందుకు ఫిషర్ ఆ గ్రామానికి వెళ్ళారు. ఆ సంభాషణల ఫలితమే ‘ఏ వీక్ విత్ గాంధీ’. 


1942లో వెలువడిన ఈ పుస్తకంలో జిన్నా, గాంధీలపై లూయీ ఫిషర్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ‘జిన్నా నాతో మాట్లాడారు. తన వాదాన్ని నా చేత ఒప్పించేందుకు ఆయన ప్రయత్నించారు. జిన్నాను ప్రశ్నించినప్పుడు ఒక ఫోనోగ్రాఫ్ రికార్టు వింటున్నట్టుగా ఉండేది. ఆయన చెప్పిన మాటలు అంతకు ముందే విన్నట్లుగా ఉండేవి. లేదా ఆయన ఇచ్చిన కరపత్రాలు, పుస్తకాలలో ఉన్నది మునుపు చదివిన సమాచారమేనని తోచేది. అయితే గాంధీని ఏదైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు నేను ఒక సృజనాత్మక ప్రపంచంలోకి ప్రవేశించిన భావన కలిగేది. ఆయన మనసులోని మాటను చూడగలిగేవాణ్ణి, వినగలిగేవాణ్ణి. గాంధీ తన సమాధానాన్ని ముగించేంతవరకు వినేవాణ్ణి. జిన్నా కంటే గాంధీని ఇంటర్వ్యూ చేయడమే ఉత్తేజకరంగా ఉండేది. ఆయనను సరైన విధంగా ప్రశ్నిస్తే ఒక కొత్త ఆలోచనా స్రవంతిలోకి ప్రవేశించినట్టు ఉండేది. 


ఇతరులు చెప్పేది సావధానంగా విని, నేర్చుకునే సామర్థ్యం, విశ్వసనీయమైన విరుద్ధ నిదర్శనాలను చూపినప్పుడు తన అభిప్రాయాలు మార్చుకోవడానికి సుముఖత అనేవి గాంధీని తన సమకాలీన నాయకులు, మన కాలం రాజకీయవేత్తల నుంచి వేరు చేసి ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఆయన తన అభిప్రాయాలను నిరంతరం నిశితంగా ప్రశ్నించుకునేవారు. సహచరులు, విమర్శకులతో సదా సమాలోచనలు, వాద ప్రతివాదాలు చేస్తుండేవారు. ఈ కారణంగానే జాతి, కులం, జెండర్ అంశాలపై గాంధీ భావాలలో ఒక ప్రగతిశీల పరిణామం స్పష్టంగా కన్పిస్తుంది. గాంధీ తన జీవనప్రస్థానం ముగిసేవరకు ప్రతిఘాతక పూర్వ భావాలను త్యజిస్తూ, ఉదాత్త మానవతా వైఖరులను అనుసరించారు. 


భారతీయ సంస్కృతిలో జాత్యహంకారం లోతుగా పరివ్యాప్తమై ఉన్నది. కథియవాడ్‌లో పుట్టి పెరిగిన గాంధీ జాతిపరమైన మూసభావనలు, ఆలోచనలను నిరాక్షేపణీయంగా అంగీకరించారు. తత్కారణంగానే దక్షిణాఫ్రికా ప్రవాస జీవితం తొలినాళ్ళలో ఆఫ్రికన్ల గురించి బహిరంగంగా అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. సహచర భారతీయుల కంటే ఆఫ్రికన్లు అన్ని విధాల తక్కువవారని గాంధీ విశ్వసించారు. అయితే కాలక్రమేణా ఆఫ్రికన్ల గురించి తన దురభిప్రాయాలను తొలగించుకున్నారు. నల్లనయ్యలను మానవీయ దృక్పథంతో గౌరవించారు.  


దక్షిణాఫ్రికా ప్రవాస జీవితం ముగిసేనాటికి గాంధీజీ జాతి సంకుచితత్వం నుంచి పూర్తిగా బయటపడ్డారు. సకల జాతుల వారిని సమంగా చూసే మానవతావాదిగా ఆయన పరిణమించారు. ఆ మార్పు మరింత ప్రగతిశీలంగా వికసించింది. తన జీవితపు తుది దశాబ్దాలలో జాతివివక్షా ధోరణులను ఎటువంటి మినహాయింపులు లేకుండా సంపూర్ణంగా వ్యతిరేకించారు. ఆఫ్రికన్–-అమెరికన్ ఉద్యమకారులతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. పలువురు ఆఫ్రికన్–-అమెరికన్లకు తన సేవాగ్రాం ఆశ్రమంలో ఆయన ఆతిథ్యమిచ్చారు. అమెరికాలో జాతి వివక్ష దురాచారాలపై పోరాడేందుకు అహింసాత్మక పద్ధతులను అనుసరించాలని గాంధీ సూచించారు. ఆయన సలహాను వారు పాటించారు. దక్షిణాఫ్రికాలో ఉన్నంత వరకు భారతీయుల పోరాటాలను ఆఫ్రికన్ల ఉద్యమాలకు దూరంగా ఉంచారు. అయితే అలా వేర్వేరుగా పోరాటాలు నిర్వహించడం చాలా అవివేకమని తదనంతర కాలంలో గాంధీ భావించారు. 


సముద్రయానం చేసే విషయమై తన సొంత మోధ్ బనియా సామాజికవర్గం పెద్దల ఆంక్షలను ధిక్కరించడం గురించి గాంధీ తన ఆత్మకథలో ప్రస్తావించారు. అయితే కులవివక్ష వికృత వాస్తవాలపై 1915లో స్వదేశానికి తిరిగివచ్చేంతవరకు ఆయనకు సరైన అవగాహన లేదని చెప్పవచ్చు. దక్షిణ భారతావని పర్యటనలలో దళితుల దుస్థితి ఆయన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అంటరానితనాన్ని నిర్మూలించాలని ఆయన సంకల్పించుకున్నారు. అయితే ఆ దశలో కుల వ్యవస్థపై ప్రత్యక్ష పోరాటం చేసేందుకు ఆయన సంకోచించారు. 1920లలో కేరళ సామాజిక సంస్కర్త నారాయణ గురు ప్రభావంతో ఆలయాలలో దళితుల ప్రవేశానికి అనుమతిని సాధించేందుకు ఉద్దేశించిన ఉద్యమాలకు ఆయన పూర్తి మద్దతునిచ్చారు. దళితులు, అగ్రవర్ణ హిందువులు కలసికట్టుగా దేవాలయాలలో పూజలు నిర్వహించేందుకు ఆయన ప్రోద్బలించారు. 1930లలో మహోన్నత మేధావి అంబేడ్కర్ నుంచి ఎదురైన సవాళ్ళ ప్రభావంతో దళితుల విషయంలో మరింత ప్రగతిశీల విధానాలను ఆయన అనుసరించారు.  


జీవితం ముందుకు సాగుతున్న కొద్దీ గాంధీజీ తన జాతి వివక్షా ధోరణులు, కుల సంకుచితత్వ వైఖరులను సంపూర్ణంగా విడనాడారు. జెండర్ అసమానతల విషయంలో ఆయన నైతిక పరిణామం పరిపూర్ణమైనది కాకపోవచ్చు గానీ నిస్సారమైనది మాత్రం కానేకాదు. స్వీయ గృహజీవితంలో గాంధీ ఒక హిందూ కుటుంబపెద్దగా వ్యవహరించేవారు. దక్షిణాఫ్రికాలో స్వతంత్ర ఆలోచనాశీలురు అయిన ఇద్దరు యూరోపియన్ మహిళలతో పరిచయం లేకపోయినట్లయితే ప్రజాజీవితంలో కూడా ఆయన అదే విధంగా ప్రవర్తించి ఉండేవారని చెప్పవచ్చు. ఆయన వైఖరులను మౌలికంగా మార్చివేసిన ఆ ఇద్దరు మహిళలు మిల్లీ గ్రాహం, సోంజా షెల్సీన్. మిల్లీ గ్రాహం, గాంధీ స్నేహితుడు హెన్రీ పోలక్ సతీమణి. సోంజా షెల్సీన్ గాంధీ కార్యాలయంలో ఉద్యోగిని. మహిళలు అణకువగా, సహాయకులుగా మాత్రమే ఉండితీరాలని గాంధీజీ భావించేవారు. అయితే  మహిళలు స్వతంత్ర వ్యక్తిత్వం కలవారనే సత్యాన్ని మహిళలు ఇరువురూ ఆ యూరోపియన్ గాంధీకి నిరూపించారు. 1913లో తాను నిర్వహించిన సత్యాగ్రహంలో పలువురు భారతీయ మహిళలు (భార్య కస్తూర్బా వారిలో ఒకరు) పాల్గొనేలా గాంధీ ప్రోత్సహించారు


భారత్‌కు తిరిగివచ్చిన తరువాత మహిళలను జాతీయోద్యమ రాజకీయాలకు దూరంగా ఉంచేందుకు గాంధీ ప్రయత్నించారు. కానీ ఇద్దరు ఆదర్శ మహిళలు గాంధీ మరింత ప్రగతిశీల దృక్పథాన్ని అనుసరించేందుకు ప్రోత్సహించారు. ఈ ఉదాత్త మహిళలు సరోజినీనాయుడు, కమలాదేవి చటోపాధ్యాయ. సరోజినీదేవి 1925లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టారు. వంద సంవత్సరాల క్రితం అమెరికా, యూరోపియన్ దేశాలలోని రాజకీయ పార్టీల నేతలుగా మహిళలు ఎవరూ లేరనేది గమనార్హమైన వాస్తవం. ఉప్పు సత్యాగ్రహంలో కమలాదేవి కీలక పాత్ర వహించారు. గాంధీ ఉద్యమాలలో పాల్గొన్నంత విస్తృతంగా ఆసియా, ఆఫ్రికాలలో ఎక్కడా వలసపాలన వ్యతిరేక ఉద్యమాలలో మహిళలు పాల్గొనలేదు. 


సకల సామాజిక దురాచారాలు, దౌష్ట్యాలలో జాతివివక్ష, కుల అంతరాలు, జెండర్ అసమానతలు మౌలికపాత్ర వహిస్తున్నాయి. అందుకే ఈ అంశాలపై గాంధీ భావపరిణామాన్ని వివరించాను. అలాగే శాస్త్రవిజ్ఞానం, సాంకేతికతల విషయంలో కూడా గాంధీ భావాలు ప్రగతిశీలంగా పరిణమించాయి. 1909లో వెలువరించిన ‘హింద్ స్వరాజ్’లో గాంధీ యంత్రనాగరికతకు సంపూర్ణ వ్యతిరేకిగా మనకు కన్పిస్తారు. అయితే తదనంతరకాలంలో ఆయన తన అభిప్రాయాలను గణనీయంగా మార్చుకున్నారు. ఇద్దరు సర్జన్ల (ఒకరు యూరోపియన్, మరొకరు భారతీయుడు)తో శస్త్రచికిత్సలు చేయించుకున్న అనంతరం ఆధునిక వైద్యశాస్త్రం పట్ల తన బద్ధ వ్యతిరేకతను గాంధీ విడనాడారు. నోబెల్ పురస్కార గ్రహీత సివిరామన్‌తో స్నేహ సంబంధాల ప్రభావంతో వైజ్ఞానిక పద్ధతులు, విధానాల విషయంలో గాంధీజీ తన అవగాహనను మెరుగుపరచుకున్నారు. ఈ ప్రభావంతోనే ఆయన తన ఆత్మకథకు ‘ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ట్రూత్’ అనే శీర్షిక పెట్టి ఉంటారని మనం కచ్చితంగా భావించవచ్చు. 


రైలులో ప్రయాణిస్తున్నప్పుడు, ఆశ్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఇతరులతో సంభాషిస్తున్నప్పుడు గాంధీజీ సత్యంతో ప్రయోగాలు చేస్తూనే ఉండేవారు. ఆత్మశోధన, ఆత్మ విమర్శ అనేవి గాంధీ వ్యక్తిత్వ ప్రమాణ చిహ్నాలని, ఆ విశిష్ట లక్షణాలు ఆయన సమకాలికుడు, సహచర గుజరాతీ మహమ్మద్ అలీ జిన్నాలో లోపించాయని 1942లో లూయీ ఫిషర్ భావించారు. 2021లో ఇది రాస్తున్న నేను మరో వాస్తవాన్ని కూడా చెప్పి తీరాలి. ఇప్పుడు మన దేశంలో మహాశక్తిమంతుడైన మరో గుజరాతీ నరేంద్ర మోదీలో కూడా ఆత్మశోధన, ఆత్మ విమర్శ అనేవి ఏ మాత్రం లేవు. అవును, గాంధీ విశిష్ట మానవుడు. ఆయన మాటల్లోనూ, చేతల్లోనూ ప్రచార కండూతి, కపటత్వం, తననుతాను గొప్ప చేసుకోవడం అనేవి మచ్చుకైనా కన్పించవు. గాంధీని అధ్యయనం చేయడం, ఆయన జీవితం, ఉద్యమాలను పరిశోధించడం అంటే ఒక ఉదాత్తవ్యక్తిని కలుసుకోవడమే. ఒక మహామనిషి మన మనస్సులను ఆవహిస్తాడు. గాంధీ పరిపూర్ణుడు, పవిత్రుడు అనీ, ఒక మహాత్ముడు అని కూడా ఆయన అనుయాయులు అంటారు. అయితే తాను లోపరహితుడిని కాననే సత్యం మహాత్ముడికి బాగా తెలుసు.




రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Read more