మహాయాగం.. ఎవరికి యోగం..?

ABN , First Publish Date - 2020-09-20T15:03:29+05:30 IST

అరుదైన సమయాల్లో అత్యవసరంగా నిర్మించే..

మహాయాగం.. ఎవరికి యోగం..?

ఇంద్రకీలాద్రిపై హడావుడిగా శతచండీ సహిత మహారుద్ర యాగం

నేటి నుంచి ఐదు రోజులు నిర్వహణ

అరుదైన యాగానికి ఇలా అత్యవసర ఏర్పాట్లా..?

ఇరుకు యాగశాలలో 55 మందితో పూజలా..?

లోకకల్యాణార్థమేనని పైపై మాటలు

లోపల మాత్రం గండాల నుంచి తాము గట్టెక్కాలనే


విజయవాడ(ఆంధ్రజ్యోతి): శక్తిమంతమైన శతచండీ సహిత మహారుద్ర యాగం.. అరుదైన సందర్భాల్లో, సంప్రదాయబద్ధమైన ఏర్పాట్లతో ఎప్పుడో ఒకసారి నిర్వహించే యాగమిది. కానీ, ప్రస్తుతం దుర్గగుడిలో యాగ నిర్వహణకు అత్యవసర ఏర్పాట్లు చేయడం, హడావుడిగా ఉత్తర్వులు జారీచేయడం వెనుక కథ వేరేలా వినిపిస్తోంది. లోక కల్యాణార్థమేనని అధికారులు చెబుతున్నా.. ప్రస్తుతం ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న పరిణామాల నుంచి తమను కాపాడుకునే ప్రయత్నమేనని కొండంతా కోడై కూస్తోంది. 


అరుదైన సమయాల్లో అత్యవసరంగా నిర్మించే శతచండీ సహిత మహారుద్ర యాగం ఇంద్రకీలాద్రిపై ఇప్పుడెందుకు నిర్వహిస్తున్నట్టు..? కరోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో లోక కల్యాణార్థమేనని దుర్గగుడి ఈవో ఎంవీ సురేష్‌బాబు, పాలకమండలి చైర్మన్‌ పైలా సోమినాయుడు శుక్రవారం విలేకరులకు చెప్పారు. తెరవెనుక మాత్రం అనేక కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. వెండి రథంపై ఉన్న మూడు సింహాలు మాయం, ఈవోను సస్పెండ్‌ చేయాలని, మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును బర్తరఫ్‌ చేయాలని వస్తున్న డిమాండ్లు, ప్రతిపక్షాల ధర్నాల నేపథ్యంలో ఈ గండం నుంచి తమను గట్టెక్కించాలని దుర్గమ్మను వేడుకుంటూ అత్యవసరంగా ఈ యాగాన్ని తలపెట్టినట్టు తెలుస్తోంది. 


శివాలయం వద్ద ఏర్పాట్లకు ఆటంకం  

యాగం నిర్వహణకు శాస్త్ర ప్రకారం తాటాకులతో పందిరి వేయాలి. ఆ పందిరిలో 16 స్తంభాల (బాదులు)తో నిర్మించిన యాగశాల మధ్యలో హోమ గుండాలు నిర్మించి యాగం నిర్వహించాలి. తొలుత మల్లేశ్వరస్వామి ఆలయం వద్ద యాగం నిర్వహించాలని నిర్ణయించారు. ఆలయ విస్తరణలో భాగంగా దాదాపు 2వేల చదరపు అడుగుల విస్తీర్ణం కొత్తగా అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ ఆవరణలోనే శతచండీ మహారుద్ర యాగాన్ని ఐదు రోజులు నిర్వహించాలని దేవస్థానం వైదిక కమిటీ తొలుత నిర్ణయించింది. ఆ మేరకు తాటి ఆకులతో సంప్రదాయబద్ధంగా యాగశాల నిర్మించే పనులను ఇంజనీరింగ్‌ సిబ్బంది ప్రారంభించినప్పటికీ శుక్రవారం సాయంత్రం భారీ వర్షం పడటంతో కొత్త ఆవరణలో అక్కడక్కడా వర్షపు నీరు నిలిచిపోయింది.


దీంతో తాత్కాలిక యాగశాల నిర్మాణాన్ని నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. దేవస్థానంలో నిత్యం చండీహోమం నిర్వహించే యాగశాలలోనే ఈ శతచండీ మహారుద్ర యాగాన్ని నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో 55 మంది రుత్వికులు, వేదపండితులు, అర్చకులు, పరిచారకులు ఈ ఇరుకు యాగశాలలోనే ఉండాలని అధికారులు ఆదేశించడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. 


అరుదైన యాగమూ సొంత అవసరాలకేనా..

శతచండీ మహారుద్ర యాగాన్ని 1987లో తొలిసారి నిర్వహించినట్లు ఆలయ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత 2010లో రెండోసారి నిర్వహించారు. మళ్లీ పదేళ్ల తర్వాత మూడోసారి ఇప్పుడు చేస్తున్నారు. ఆదివారం నుంచి బుధవారం వరకు ఐదు రోజులపాటు ఉదయం, సాయంత్రం రెండు విడతలుగా నిర్వహిస్తారు. దేవస్థానానికి చెందిన రుత్వికులు, వేదపండితులు, అర్చకులు 55 మంది ఈ యాగంలో పాల్గొంటారు. 


హడావుడి ఏర్పాట్లు ఎందుకో...?

భారీ ఎత్తున నిర్వహించే యాగానికి కనీసం వారం ముందు నుంచే ఏర్పాట్లు చేయాల్సి ఉండగా, ఆలయ అధికారులు శనివారం నుంచే తీరిగ్గా ప్రారంభించారు. ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కరోజు కూడా పూర్తిగా సమయమివ్వకుండా ఇంత పెద్ద కార్యక్రమానికి ఏర్పాట్లు చేయడంతో వైదిక కమిటీ సభ్యులు, ఇంజనీరింగ్‌ సిబ్బంది హైరానా పడిపోతున్నారు.

Updated Date - 2020-09-20T15:03:29+05:30 IST