వెబ్ సీరీస్: డార్క్ (జర్మన్)
దర్శకులు: బరన్ బో ఓడర్, జాంజే ఫ్రీస్
నటీనటులు: లూయీ హాఫ్ మాన్, కారోలిన్ ఐషాన్
ప్లాట్ ఫామ్ : నెట్‌ఫ్లిక్స్
రేటింగ్ : 8.8/10
మనం సినిమానో, టీవీ సీరియలో, వెబ్ సీరీసో ఎందుకు చూస్తాం?.. రోజువారీ జీవితంలోని రొటీన్ పనులకు దూరంగా కొంత రిలాక్స్ అవ్వడానికీ, అన్నీ మర్చిపోయి కొంత వినోదం పొందడానికి - మామూలుగా పై ప్రశ్నకు ఇలాంటి సమాధానాలే వస్తాయి. కానీ కొన్ని సినిమాలు, వెబ్ సీరీస్లు చూడాలంటే - నోట్ బుక్ తెరిచి, చేతిలో పెన్ను పట్టుకుని స్కూల్లో టీచర్ చెప్పే పాఠాన్ని శ్రద్ధగా వింటూ, నోట్స్ రాసుకుని ఇంటికొచ్చి మళ్ళీ శ్రద్ధగా ఆ పాఠం మళ్ళీ మళ్ళీ చదివి అర్థం చేసుకుంటామో, అంతే శ్రద్ధగా చూడాలి. అసలేం జరుగుతుందో అర్థం చేసుకుని నోట్స్ రాసుకోవాలి. కథా గమనాన్ని గ్రాఫ్లాగా గీసుకోవాలి. ఆ గ్రాఫ్‌ని అర్థం చేసుకుంటేనే మనకీ కథ పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే ఒక జిగ్సా పజిల్ని సాల్వ్ చెయ్యడా నికి మనం ఎలా ముక్కల్నన్నింటినీ ముందు పోసుకుని ఒక్కో ముక్కనీ ఇంకో ముక్కతో కలుపుతూ చివరికి దానికొక రూపాన్ని తీసుకొస్తామో అంత పని చెయ్యాలి. అలా మన మెదడుకి మేతలా పనిచేసే ఒక వెబ్ సీరీస్ ‘డార్క్’.
జర్మనీ, 2019.. విండెన్ అనే ఒక చిన్న టౌన్. ఎరిక్ అనే పదిహేనేళ్ల కుర్రాడు తప్పిపోయాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఈ చిన్న ఊర్లో ఎరిక్ తప్పిపోవడమనే సంఘటన పెద్ద సంచలనాన్ని సృష్టించింది. ఊర్లో ఉండే పెద్దవాళ్లంతా ఎరిక్ ఏమయ్యాడనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఎరిక్‌తో పాటు చదువుకునే కొంతమంది కుర్రాళ్ల మనసు మరొక విషయం గురించి ఆసక్తిగా ఉన్నారు. ఎరిక్ స్కూల్లో పిల్లలకి డ్రగ్స్ అమ్మేవాడనే విషయం అందరికీ తెలుసు. ఎరిక్ తన డ్రగ్స్‌ని ఊరి బయట ఉన్న చిన్న గుహలో దాచిపెట్టేవాడని తెలిసిన కొంతమంది యువతీ యువకులు, ఒక రోజు రాత్రి ఆ గుహలోకి వెళ్లి ఆ డ్రగ్స్ సంగతేంటో చూద్దామని బయల్దేరారు. అలా బయల్దేరిన వారిలో అందరూ టీనేజ్ కుర్రాళ్ళే ఒక్క మైఖేల్ తప్ప. మైఖేల్‌ని ఇంట్లో ఒక్కడినే వదిలేసి రావడం ఇష్టం లేక తనతో పాటే తీసుకొచ్చాడు మిక్కెల్ అన్న మాగ్నస్. అందరూ కలిసి గుహ దగ్గరకి చేరుకున్నారు. కానీ ఆ రాత్రి వారి సాహసఘట్టం వాళ్లనుకున్నట్టుగా జరగలేదు. గుహ దగ్గర జరిగిన విచిత్ర పరిస్థితుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తలో దిక్కుకి పారిపోయారు. కొంతసేపటికి వాళ్లంతా ఒక దగ్గరకు చేరుకున్నారు. మైఖేల్ మాత్రం తిరిగిరాలేదు. అందరూ మైఖేల్ కోసం అన్ని చోట్లా వెతికారు. కానీ ఆ పిల్లాడు ఎక్కడా కనిపించలేదు. విండెన్ నగరంలో రెండవ మిస్సింగ్ కేసు నమోదయింది.
ఆ తర్వాత రోజు ఉదయం మైఖేల్ తప్పిపోయిన దగ్గర్లోనే మరొక యువకుడి శవాన్ని కనుక్కొన్నారు ఊరివాళ్లు. కానీ ఆ శవం కొన్ని నెలల క్రితం తప్పిపోయిన ఎరిక్ది కాదు. అంతకుముందు రోజు తప్పిపోయిన మైఖేల్దీ కాదు. ఈ మూడో కుర్రాడు ఎవరు? ఊర్లో పోలీసులకే కాదు. అందరికీ అన్నీ ప్రశ్నలే! సమాధానాలు దొరకడం లేదు. ఇంతలో ఎవరో ముసుగు వేసుకుని అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తి న్యూస్ పేపర్ చదువుతూ, అందులో ఉన్న ''Where is Mikkel?'' అనే హెడ్ లైన్‌ని "When is Mikkel?''గా తిరిగిరాశాడు. Where? అనేది స్థలానికి సంబంధించిన ప్రశ్న. When? అనేది కాలానికి సంబంధించిన ప్రశ్న. ఈ ప్రశ్నలో మనకి చాలా సమాధానాలు దొరుకుతాయి.
మహేష్ బావుందని చెప్పడంతో..
మొన్నీ మధ్యనే మహేష్‌బాబు కూడా ఈ ‘డార్క్’ వెబ్ సీరీస్ చూసి ట్విట్టర్లో బావుందని చెప్పడంతో.. మన తెలుగు వాళ్లకి ఈ సీరీస్ మీద కొత్త ఆసక్తి మొదలయింది. అయితే ముందే చెప్పినట్టు ఈ సీరీస్ చూడాలంటే చాలా ఓపిక కావాలి. అన్నింటికీ మించి చాలా ఏకాగ్రత అవసరం. ఒక మంచి విద్యార్థిలా నోట్ బుక్ పట్టుకుని ఫ్లో చార్టులు గీసుకుంటూ, అప్పటికీ అర్థం కాకపోతే మీకంటే ముందే చూసి అర్థం చేసుకున్న పాత విద్యార్థులు తయారుచేసిన ఇన్ఫోగ్రాఫిక్స్ని ఇంటర్నెట్ లోంచి డౌన్లోడ్ చేసుకుని, జరుగుతున్న అనేక కథలను గుర్తుపెట్టుకుంటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.
ఒక ప్రదేశంలో ఉండాల్సిన వ్యక్తి కనిపించకుండా మరో ప్రదేశానికి వెళ్లిపోతే తప్పిపోవడం అంటాం. కానీ ఒక కాలంలో ఉండాల్సిన వ్యక్తి కనిపించకుండా మరో కాలంలోకి ప్రయాణిస్తే, దాన్ని కూడా తప్పిపోవడమే అంటామా? ఎందుకంటే 2019 కాలంలో ఉండాల్సిన మైఖేల్ టైం ట్రావెల్ చేయడం ద్వారా 1986వ సంవత్సరంలోకి వెళ్ళిపోయాడు. 1953-1986-2019 మూడు కాలాల్లో జరిగే కథ ఇది. ఒక కాలంలోని వ్యక్తులు మరొక కాలంలోకి ప్రవేశించడం ద్వారా కలిగిన మలుపులతో నడిచే చిత్రమైన కథ. ఇది కథలోని ఒక చిన్న భాగమే! ఇలా మొదలై చిత్ర విచిత్రమైన మలుపులతో మనం ఊహించని కథని, కథనాన్ని అందించి ఉక్కిరిబిక్కిరి చేసే వెబ్ సీరీస్ Dark.
నెట్‌ఫ్లిక్స్, ఆమెజాన్ ప్రైమ్ లాంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ రావడం ద్వారా ప్రేక్షకులకు జరిగిన మేలు అంతా ఇంతా కాదు. సినిమాగా కుదించి చెప్పాల్సిన ఎన్నో కథలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. సినిమాగా కాకపోతే టివి సీరియల్‌గా పెద్ద కథలు చెప్పే అవకాశం ఉంది కానీ, ఎక్కడో జర్మనీలో జర్మన్ భాషలో వచ్చే టివి సీరియల్ గురించి మనకి తెలియడమే కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రపంచంలో ఏ మూల, ఏ భాషలో వచ్చిన కంటెంట్ అయినా చూడ్డానికి రెడీగా ఉన్న ప్రేక్షకులు ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఏర్పడ్డ కారణంగానే డార్క్, స్ట్రేంజర్ థింగ్స్ లాంటి అద్భుతమైన వెబ్ సీరీస్లు మనం చూడగలుగుతున్నాం. కేవలం ఎస్కేపిస్ట్ వినోదమే కాకుండా, మన మెదడుకి మేత వేసే సీరీస్లు, మనకి విజ్ఞానాన్ని ప్రసాదించే డాక్యుమెంటరీలు కూడా ఇప్పుడు ఈ ప్లాట్‌ఫామ్స్ ద్వారా మనకి అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా ఎక్కడో జర్మనీలో నిర్మించబడిన డార్క్ వెబ్ సీరీస్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ప్రేక్షకులు చూడడమే కాకుండా, అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సీరీస్‌గా పేరుగాంచడం కూడా మారిన ఈ పరిస్థితుల నేపథ్యమే!. అమ్మ బాబోయ్ ఒక టివి సీరియల్ చూడ్డానికి ఇంత కష్టపడాలా అనుకుంటే మీరు జీవితంలో చాలా మిస్ అవుతున్నారని గుర్తుపెట్టుకోండి. మంచి వెబ్ సీరీస్లు ఊరికే రావు.
- వెంకట్ శిద్దారెడ్డి, [email protected]