మహేశ్‌బ్యాంక్‌ మోసంలో ఇంటి దొంగల పాత్ర?

ABN , First Publish Date - 2022-01-27T16:07:50+05:30 IST

ది ఏపీ మహేశ్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ కేసును పది ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. బ్యాంకులోని మూడు కరెంట్‌ అకౌంట్ల వివరాలపై సైబర్‌ కైరమ్‌ పోలీసులు ఆరా

మహేశ్‌బ్యాంక్‌ మోసంలో ఇంటి దొంగల పాత్ర?

అపెక్స్‌ తరహాలోనే నైజీరియన్‌ స్కెచ్‌?

అమెరికా, కెనడా నుంచి డబ్బు బదిలీ అయినట్లు సమాచారం

ఖాతాదారుల్లో ముంబైకి చెందిన మహిళ

పత్తా లేని ఆ ముగ్గురు


హైదరాబాద్‌ సిటీ/హిమాయత్‌నగర్‌: ది ఏపీ మహేశ్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ కేసును పది ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. బ్యాంకులోని మూడు కరెంట్‌ అకౌంట్ల వివరాలపై సైబర్‌ కైరమ్‌ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ ఖాతాల నుంచే రూ.12.40 కోట్లు కొట్టేసిన సైబర్‌ నేరగాళ్లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. శాన్విక్‌ ఎంటర్‌ ప్రైజెస్‌, హిందూస్థాన్‌ ట్రేడర్స్‌, షానవాజ్‌ బేగం పేర్లతో కరెంట్‌ అకౌంట్లు తెరిచి వాటి ద్వారా డబ్బు ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు గుర్తించారు. సిద్ధి అంబర్‌ బజార్‌, హుస్సేనీఆలం, అత్తాపూర్‌లలో అకౌంట్లు తెరిచారు. ముంబైకి చెందిన మహిళ ద్వారా రెండు ఖాతాలను తెరిచినట్లు గుర్తించారు. హుస్సేనీఆలం బ్రాంచ్‌లోని ఖాతాను ఓ వ్యాపారవేత్త ఉపయోగించుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ముగ్గురూ పోలీసులకు అందుబాటులో లేకపోవడం గమనార్హం. అమెరికా, కెనడాల నుంచి బ్యాంక్‌ సర్వర్‌ను హ్యాక్‌ చేసి డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వాటికి సంబంధించిన ఐపీలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. డబ్బు బదిలీ అయిన 20 బ్యాంకుల్లోని 127 ఖాతాలను స్తంభింపజేయాలని ఆయా బ్యాంకులకు సీసీఎస్‌ అధికారుల లేఖలు పంపించారు. 


అపెక్స్‌ తరహాలోనేనా?

ఇప్పటి వరకు కస్టమర్లు, ఖాతాదారులను మాత్రమే టార్గెట్‌ చేసే ఆఫ్రికన్‌ మోసగాళ్లు నేరుగా బ్యాంకులను టార్గెట్‌ చేస్తున్నారు. గతేడాది జూలైలో తెలంగాణ కో ఆపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంక్‌ మూలధన ఖాతా నుంచి రూ.1.97 కోట్లు బదిలీపై సీసీఎ్‌సలో కేసు నమోదైంది. ఆ డబ్బంతా సికింద్రాబాద్‌, చందానగర్‌ బ్రాంచ్‌లకు చెందిన ముగ్గురి ఖాతాల ద్వారా.. నాలుగు రోజుల వ్యవధిలో 102 ట్రాన్సాక్షన్ల ద్వారా దారి మళ్లినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు చేపట్టిన సైబర్‌క్రైం పోలీసులు ఖాతాదారులైన యాసిన్‌భాషా, మహమ్మద్‌ రఫీలను అరెస్టు చేసి విచారించగా, టోలీచౌకిలో నివాసముండే ఆఫ్రికా దేశస్థుడి (నైజీరియన్‌) సూచన మేరకు ఖాతాలు తెరిచామని, అందుకు అతడు పది శాతం కమీషన్‌ ఇచ్చాడని చెప్పారు. అదే తరహాలో మహేశ్‌ బ్యాంక్‌ ఘటన కూడా జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. 


అదే నైజీరియన్‌ గ్యాంగ్‌ ప్రమేయం?

అపెక్స్‌ ఘటనలో ఇద్దరిని పోలీసులు అప్పట్లో అరెస్టు చేశారు. సూత్రధారి నైజీరియా దేశస్థుడి కోసం గాలిస్తున్నారు. అతడితో పాటు ఓ యువతి పాత్రను గుర్తించిన పోలీసులు వారిని పట్టుకుని ఉంటే ఇలాంటి బ్యాంకింగ్‌ మోసాలెన్నో వెలుగులోకి వచ్చేవి. మహేశ్‌ బ్యాంకు ఘటన కూడా అపెక్స్‌ను పోలి ఉండడంతో అదే గ్యాంగ్‌ ఇప్పుడు కూడా మోసానికి పాల్పడి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


బ్యాంకు సర్వర్లపై నజర్‌

బ్యాంకింగ్‌ కార్యకలాపాలన్నీ ఆన్‌లైన్‌లో సాగుతుండట సైబర్‌ క్రిమినల్స్‌కు వరంగా మారింది. ఈ క్రమంలో బ్యాంకు నిర్వాహకులు సైబర్‌ సెక్యూరిటీని పటిష్ఠంగా మార్చుకోవాల్సిన అవసరముందని ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. అపెక్స్‌, మహేశ్‌ బ్యాంకులే కాకుండా అంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిలో ప్రధానమైనవి..

 2018లో పుణెలోని కాస్మోస్‌ బ్యాంక్‌పై సైబర్‌ దాడి జరిగింది. బ్యాంకు ఏటీఎం సర్వర్‌ ద్వారా డెబిట్‌ కార్డుల వివరాలు సేకరించి నకిలీ కార్డుల ద్వారా 28 దేశాల నుంచి గంటల వ్యవధిలో రూ. 94.42కోట్లు తస్కరించారు. 

 2018లోనే కెనరా బ్యాంకు ఏటీఎం సర్వర్‌లను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు 300 మంది ఖాతాదారుల వివరాలు సేకరించి వివిధ బ్యాంకుల నుంచి రూ.20 లక్షలు కాజేశారు. 


సిబ్బంది ప్రమేయంపై ఆరా

డబ్బు బదిలీ వ్యవహారంలో ఇంటి దొంగల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు సాగుతోంది. ఇప్పటికే మహే్‌షబ్యాంకు ఐటీ, టెక్నికల్‌ సిబ్బందిని విచారించారు. ఇతర సిబ్బంది ప్రమేయంపై కూడా ఆరా తీస్తున్నారు. అంత తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బుల బదిలీకి ఎలా అనుమతించారో చెప్పాలని ఆయా బ్యాంకులకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. డబ్బులు బదిలీ అయిన ఆ మూడు ఖాతాల మూలాలను గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు. డబ్బు ట్రాన్స్‌ఫర్‌ వ్యవహారం విదేశాల నుంచి జరగడం, గతంలో ఇలాంటి కేసుల్లో నైజీరియన్ల పాత్ర ఉండడంతో ఇప్పుడు కూడా వారి హస్తం ఉందా అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-01-27T16:07:50+05:30 IST