సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఎవరి కోసం: మహేష్‌కుమార్‌గౌడ

ABN , First Publish Date - 2021-08-31T22:34:42+05:30 IST

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర ఎవరి కోసం చేస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్‌గౌడ ప్రశ్నించారు.

సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఎవరి కోసం: మహేష్‌కుమార్‌గౌడ

హైదరాబాద్: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర ఎవరి కోసం చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్‌గౌడ ప్రశ్నించారు. మంగళవారం హుజురాబాద్ ఉపఎన్నిక అభ్యర్థిపై పార్టీ మఖ్యనేతలతో చర్చించారు.  ఈసందర్భంగా మహేష్‌కుమార్‌గౌడ మాట్లాడుతూ.. హుజురాబాద్ ఉపఎన్నిక కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని పీసీసీ నిర్ణయం తీసుకుందన్నారు. రేపటి నుంచి గాంధీభవన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.సెప్టెంబర్ 5వ తేదీ వరకు దరఖాస్తులు ఇచ్చేందుకు ఆఖరు తేదీ అన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల నుంచి 5 వేల రూపాయలను రుసుముగా తీసుకోవాలని నిర్ణయించామన్నారు.సెప్టెంబర్ 6వ తేదీన దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తామన్నారు. ఆతర్వాత అధిష్ఠానానికి నివేదిక ఇస్తామని, అధిష్ఠానం నుంచి నివేదిక వచ్చాక అభ్యర్థిని అధికారికంగా ప్రకటన చేస్తామని మహేష్‌కుమార్‌గౌడ తెలిపారు.


బండి సంజయ్ నిజాం ఆస్తుల విషయం తీసుకొచ్చి మతాలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థానాలు, రాజా ఆభరణాలు రద్దు చేసిన ఘనత, సీలింగ్ ల్యాండ్స్ ఎత్తివేసిన ఘనత కూడా ఇందిరా‌గాంధీదన్నారు.  7ఏళ్లుగా మోదీ సర్కార్‌కు నిజాం ఆస్తులు కనిపించలేదా అని ప్రశ్నించారు. ఇది కేంద్ర, రాష్ట్ర సర్కార్‌లు ఆడుతున్న డ్రామా అని మండిపడ్డారు. ప్రజలను రెచ్చగొట్టడానికే  బండి సంజయ్ ఈ కామెంట్స్ చేశారన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం బండి పొతే బండి.. ఇల్లు పొతే ఇల్లు,  వరద బాధితులకు 10వేలు రూపాయలు ఇస్తానని చెప్పిందన్నారు.ఎన్నికలు అయిపోయాక టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని మహేష్‌కుమార్‌గౌడ ఎద్దేవా చేశారు. ఇప్పుడు హుజురాబాద్ ఉపఎన్నిక కోసం దళితబంధు అంటున్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 15 లక్షలు ప్రతి అకౌంట్‌లో వేస్తామన్నారు ఏమైందని నిలదీశారు. బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, సిలండర్ ధరలు పెంచి ఇప్పుడు ప్రజా సంగ్రామ యాత్రలు చేస్తున్నారా అని మండిపడ్డారు. బడా కంపెనీలను, సంస్థలను అమ్మడం సరిపోక యాత్రలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్ర సర్కార్ ఖజానా ఖాళీచేసి.. పైసలకోసం సర్కార్ భూములు అమ్ముకుంటుందన్నారు. టీఆర్‌ఎస్ నాయకుల అవినీతిపై కేంద్రం ఎందుకు నోరుమెదపడం లేదన్నారు. ఈడీని రాష్ట్రంలో ఎందుకు రంగంలోకి దింపడం లేదన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్, పాత బస్తీలో ఎంఐఎం ఒక్కటేనని మహేష్‌కుమార్‌గౌడ ధ్వజమెత్తారు. 

Updated Date - 2021-08-31T22:34:42+05:30 IST