Jun 23 2021 @ 12:36PM

అశోక్ గల్లా ‘హీరో’ టీజర్ రిలీజ్ చేసిన సూపర్‌స్టార్ మ‌హేశ్‌

సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, మహేశ్ మేనల్లుడు, గుంటూరు జిల్లా ఏంపీ జయదేవ్‌ గల్లా తనయుడు అశోక్‌ గల్లా హీరోగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని అమరరాజ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు ‘హీరో’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఖరారు చేసింది చిత్ర యూనిట్‌. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ టీజర్‌ను సూపర్ స్టార్ మహేశ్‌ రిలీజ్ చేసి అభినంద‌న‌లు తెలిపారు. 

`హీరో`  ఫస్ట్ లుక్ పోస్టర్ లో కనిపిస్తున్న స్టార్ సింబల్, గన్ను, బుల్లెట్ మ‌రియు ఫిలిం రోల్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేసేలా ఉన్నాయి. అశోక్ కౌబాయ్‌గా ఎంట్రీ ఇస్తున్న విజువల్స్‌తో..ట్రైన్ ఎపిసోడ్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. టైటిల్ టీజ‌ర్ చూస్తే అశోక్ గల్లా రెండు, మూడు లుక్స్‌లో క‌నిపించ‌నున్నాడ‌ని అర్థ‌మ‌వుతుంది. ఇందులో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌. జగపతిబాబు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నరేష్, సత్య, అర్చన సౌందర్య కీలక పాత్రధారులు. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న 'హీరో`మూవీ విడుద‌ల‌కు సిద్దమవుతోంది.