వైకల్యాన్ని ఎదిరించి.. మహిళా పోలీస్‌గా

ABN , First Publish Date - 2021-07-30T04:24:23+05:30 IST

పెద్దల తప్పిదంతో వచ్చిన వైకల్యంతో కుమిలిపోలేదు.. వెనకడుగు వేయకుండా ఉన్నత చదువులు అభ్యసించింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో 8ఏళ్ల పాటు ఎదురుచూసి సచివాలయంలో ఉద్యోగం దక్కించుకుంది.

వైకల్యాన్ని ఎదిరించి.. మహిళా పోలీస్‌గా
మూడు చక్రాలపై గ్రామాల్లో తిరుగుతున్న మహిళా పోలీసు ప్రశాంతి

పోలియో ఇంజక్షన్‌ వేయకపోవడంతోనే..

ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యం


                                               మనుబోలు, జూలై 29:

పెద్దల తప్పిదంతో వచ్చిన వైకల్యంతో కుమిలిపోలేదు.. వెనకడుగు వేయకుండా ఉన్నత చదువులు అభ్యసించింది.  ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో  8ఏళ్ల పాటు ఎదురుచూసి సచివాలయంలో ఉద్యోగం దక్కించుకుంది. ప్రజాక్షేత్రంలో మహిళా పోలీస్‌గా మూడుచక్రాలపై విధులు నిర్వహిస్తూ .. అందరి మన్ననలు పొందుతోంది చేవూరు ప్రశాంతి.    


నెల్లూరుకు చెందిన వెంకటేశ్వర్లు, ప్రభావతిలకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె ప్రశాంతితో పాటు మరో కుమార్తె, కుమారుడు ఉన్నారు. వెంకటేశ్వర్లు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. 1988లో ప్రశాంతి జన్మించింది. ప్రశాంతికి రెండు దఫాలు పోలియో ఇంజక్షన్‌ను అమ్మమ్మ ఇంట్లో వేశారు. మూడో దఫాకు ప్రశాంతిని నాయనమ్మ వద్దకు తీసుకురాగా పోలియో ఇంజక్షన్‌ వేసే అలవాటు తమ ఇంట లేదంటూ వేయవద్దని వెంకటేశ్వర్లు అడ్డుచెప్పడంతో వేయలేదు. ప్రశాంతికి ఏడాదిన్నర వయస్సు వచ్చేసరికి ఎడమకాలుకు పోలియో సోకింది. దీంతో వెంకటేశ్వర్లు కుటుంబం కుమిలిపోయింది. తర్వాత పుట్టిన ఇద్దరు బిడ్డలకు విధిగా పోలియో ఇంజక్షన్లు వేయడంతో వారు ఆరోగ్యంగా ఉన్నారు. ప్రశాంతి తల్లిదండ్రులు పెద్దగా చదువుకోకపోయినా వ్యవసాయం చేసుకుంటూ ముగ్గురు పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. ఈ నేపథ్యంలో ప్రశాంతి 2011 నాటికి ఎంబీఏ పూర్తి చేసింది. అప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అవకాశాలు రాకపోవడంతో ప్రైవేట్‌ ఉద్యోగాలు చేస్తూ తండ్రికి ఆర్థికంగా సహాయపడింది. 2019లో సచివాలయం ఉద్యోగాలకు ప్రవేశ పరీక్షలు రాసి  మండలంలో చెరుకుమూడి సచివాలయానికి మహిళా సంరక్షణ కార్యదర్శిగా ఎంపికైంది. తన శరీర పరిస్థితికి అనుకూలంగా లేకపోయినా కష్టమనుకోకుండా మహిళా సంరక్షణ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తోంది. చెరుకుమూడి సచివాలయం పరిధిలోకే కొమ్మలపూడి. ముద్దమూడి గ్రామాలు వస్తాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల నమోదు, దిశ యాప్‌లపై అవగాహన చేస్తుంది.  ప్రతి పనిని నిర్ధ్దేశించిన గడువులో పూర్తి చేసి మూడు గ్రామాల ప్రజలు ప్రశంసలు అందుకొంటోంది. నెల్లూరు నుంచి చెరుకుమూడికి దాదాపుగా 30కి.మీ దూరం ఉంటోంది. మూడు చక్రాల బండి ఆసరాతో విధులకు హాజరై గ్రామాల్లో మహిళా పోలీస్‌గా బాధ్యతలు కొనసాగిస్తున్నది.  


శాశ్వత ఉద్యోగిగా కోరుకుంటున్నా..

నేను చిన్నప్పటి నుంచే అంగవైకల్యంతో బాధపడుతున్నా. అయినప్పటికీ అందరితో పాటు చదివి ఎదగాలనుకున్నా. ప్రభుత్వ ఉదోగ్యం కోసం ఎదురు చూసి సచివాలయ ఉద్యోగం సంపాదించా. ఇటీవల మమ్మల్ని ప్రభుత్వం మహిళా పోలీస్‌గా గుర్తించింది. భవిష్యత్తులో శాశ్వత ఉద్యోగిగా చేస్తారనుకుంటున్నా. అలా అయితే నా లక్ష్యం నేరవేరినట్లే.  

- చేవూరు ప్రశాంతి 

Updated Date - 2021-07-30T04:24:23+05:30 IST