మైదా.. కావొద్దు.. ఫిదా!

ABN , First Publish Date - 2020-07-05T17:23:58+05:30 IST

కరోనాకు ముందు.. పెద్దలు ఉద్యోగానికి, పిల్లలు స్కూళ్లకు వెళ్లేవాళ్లు. ఉదయాన్నే అల్పాహారం తిని, మధ్యాహ్నానికి భోజనం తీసుకెళ్లడం అలవాటు. ఇప్పుడు కథ మారింది. వైరస్‌ భయంతో...

మైదా.. కావొద్దు.. ఫిదా!

కరోనాకు ముందు.. పెద్దలు ఉద్యోగానికి, పిల్లలు స్కూళ్లకు వెళ్లేవాళ్లు. ఉదయాన్నే అల్పాహారం తిని, మధ్యాహ్నానికి భోజనం తీసుకెళ్లడం అలవాటు. ఇప్పుడు కథ మారింది. వైరస్‌ భయంతో ఇరవై నాలుగ్గంటలూ ఇళ్లకే పరిమితం అయ్యారు జనం. ఇళ్లల్లో ఉన్నోళ్లు ఊరకుంటారా? రకరకాల వంటలను వండి పెట్టాలంటారు. ఈ క్రమంలో సులభంగా వండేందుకు.. మైదాను ఎంచుకుంటారు గృహిణులు. ఆ మైదా ఆరోగ్యానికి ఎంత మంచిది? ఎందుకు హాని చేస్తుంది? మరింత లోతుగా పరిశీలిద్దాం.. 


పొట్టు తీయని గోధుమపిండిని పాలిష్‌ పట్టడంతో వచ్చే ఏ రకమైనా పిండిని అయినా ‘రిఫైన్డ్‌ ఫ్లోర్‌’ అంటారు. సూపర్‌మార్కెట్లో దొరికే గోధుమ పిండి ప్యాకెట్లన్నీ ఈ కోవకు చెందినవే! అయితే ఇదే పిండిని మరింత బ్లీచ్‌ చేస్తే వచ్చేదే ‘మైదా’. మరింత వివరంగా చెప్పాలంటే... గోధుమ గింజలో హస్క్‌ (పైపొట్టు), ఎండోస్పెర్మ్‌ (గింజలోని తెల్లటి పిండిపదార్థం), జెర్మ్‌ (విత్తనం మొలకెత్తే ప్రదేశం)... అనే మూడు భాగాలుంటాయి. గోధుమలను మర పట్టించినప్పుడు ఈ మూడు భాగాలూ పిండిగా మారతాయి. దాన్ని ‘హోల్‌ గ్రెయిన్‌ ఫ్లోర్‌’ అంటారు. ఇది సిసలైన గోధుమపిండి. అయితే స్వచ్ఛమైన గోధుమపిండి నిల్వ కాలం తక్కువ. గోధుమగింజలోని ‘జెర్మ్‌’ భాగం నూనెతో కూడుకుని ఉంటుంది. కాబట్టి దీంతో పాటు మర పట్టించిన పిండి త్వరగా పాడవుతుంది. దీన్ని తొలగించి, ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండే పిండి ని తయారుచేసే క్రమంలో మైదా పుట్టుకొచ్చింది. 


హాని ఇలా..

పాలిష్‌ పట్టిన పదార్థాలన్నీ శరీరాన్ని పోషకాలకు బదులుగా క్యాలరీలతో నింపేసి, సత్వరం ఆకలిని తీర్చేస్తాయి. ఇలాంటి ‘రిఫైన్డ్‌ ఫ్లోర్‌’ (మైదా), రిఫైన్డ్‌ షుగర్‌, రిఫైన్డ్‌ ఆయిల్స్‌... మన శరీరానికి పోషకాలను అందించకపోగా, వాటిని అరువు తీసుకుని శోషణ చెందుతాయి. దాంతో శరీరంలోని విటమిన్లు, ఖనిజ లవణాల నిల్వలు తరుగుతాయి. ఒకవేళ మైదా ప్యాకెట్‌ మీద నాలుగు రకాల విటమిన్లను జోడించినట్టు, ‘ఎన్‌రిచ్‌డ్‌ ఫ్లోర్‌’ అని రాసి ఉన్నా, పాలిష్‌ పట్టే క్రమంలో అంతకంటే ఎక్కువ పోషకాలను కోల్పోయి ఉంటుందని అర్థం చేసుకోవాలి. పాలిష్‌ పట్టిన గోధుమపిండి, అంటే మైదా, స్థూలకాయానికి కారణమే కాదు, 21వ శతాబ్దపు అత్యధిక వ్యాధులకు ఇదే మూల కారణం. ఒకే పరిమాణంలో ఉన్న గోధుమపిండి, మైదాలను సరిపోల్చినప్పుడు మైదాతో రెట్టింపు క్యాలరీలు శరీరంలోకి చేరుతూ ఉంటాయని గ్రహించాలి. బ్రెడ్‌, రుమాలీ రోటీ, నాన్‌, కేకులు, పేస్ర్టీలు, బేక్‌ చేసే వంటకాలు, బిస్కెట్లు, పాస్టా, నూడుల్స్‌, సమోసాలు.... ఇలా మైదాతో తయారయ్యే వంటకాలకు అంతే లేదు. జంక్‌ఫుడ్‌ మొత్తం మైదాతోనే చేస్తారు. హోటళ్లు, ఇంటి వంటలు, రోడ్డు పక్కన దొరికే చిరుతిళ్లు, బేకరీలు... ఎక్కడ చూసినా మైదాతో తయారైన పదార్థాలే! సాధారణంగా న్యూట్రిషనిస్టులు, వైద్యులు ఆహారంలో ఉప్పు తగ్గించుకోమనీ, లేదంటే రక్తపోటు పెరుగుతుందనీ హెచ్చరిస్తూ ఉంటారు. తీపి తగ్గించ కోకపోతే మధుమేహం తప్పదని కూడా అంటూ ఉంటారు. నిజానికి ఆ రెండింటి కంటే ప్రమాదకరమైన ‘మైదా’ గురించి వైద్యులు హెచ్చరించవలసిన అవసరం ఉంది. 


జి.ఐ. అధికం..

ఒక పదార్థాన్ని తిన్న తర్వాత, దాన్లోని పిండిపదార్థాలు రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచే వేగాన్ని 0 నుంచి 100 లోపు గణించే విధానమే ‘గ్ల్లైసెమిక్‌ ఇండెక్స్‌’ (జి.ఐ). అధిక జి.ఐ. కలిగిన పదార్థాలు త్వరగా జీర్ణమై, శోషణ చెందుతాయి. కాబట్టి రక్తంలోని చక్కెర స్థాయులు సత్వర హెచ్చుతగ్గులకు లోనవు తాయి. ఆరోగ్యమైన జీవనం కోసం రక్తంలోని గ్లూకోజ్‌, ఇన్సులిన్‌ స్థాయిలను పరిమితంగా హెచ్చుతగ్గులకు లోనుచేసే తక్కువ జి.ఐ. ఉన్న పిండిపదార్థాలను ఎంచుకోవాలి. ఇలాంటి ఆహారశైలితో టైప్‌ - 2 డయాబెటిస్‌, గుండె జబ్బులు దరి చేరవు. ఇలాంటి పదార్థాలు అధిక బరువు కోల్పోవడానికి కూడా తోడ్పడతాయని రుజువైంది.


చక్కెర తీవ్రం..

మైదా అత్యధిక జి.ఐ. కలిగి ఉంటుంది. కాబట్టి దీనితో తయారైన బ్రెడ్‌, నూడుల్స్‌, పాస్తా తిన్నప్పుడు రక్తంలోకి చక్కెరలు త్వరితంగా విడుదలవుతాయి. దాంతో అధిక చక్కెరను నియంత్రించడం కోసం ఇన్సులిన్‌ స్రావాలూ పెరుగుతాయి. ఇదే పరిస్థితి దీర్ఘకాలం పాటు కొనసాగితే ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ పెరిగిపోయి ‘టైప్‌-2 డయాబెటిస్‌’ బారినపడతాం. ఇక వేయించిన మైదా ఉత్పత్తులు మరింత ప్రమాదకరం. సమోసా, వేయించిన నూడుల్స్‌, కచోరీ, చీజ్‌ పాస్తా, లసాగ్నా మొదలైన పదార్థాలకు కొవ్వులు, రిఫైన్డ్‌ పిండిపదార్థాలు తోడై శరీర మెటబాలిజంను అల్లకల్లోలానికి లోను చేస్తాయి. ఫలితంగా ఇన్‌ఫ్లమేషన్‌, హైపర్‌ ఇన్సులినిజం, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌... అంతిమంగా టైప్‌ - 2 డయాబెటిస్‌, హృద్రోగాలు, ఆర్థ్రయిటిస్‌ (కీళ్ల అరుగుదల), అల్జీమర్స్‌ (వృద్ధాప్యంలో మతిమరుపు), కేన్సర్‌లకు దారి తీస్తాయి. మైదా చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌.డి.ఎల్‌.)ను పెంచి, శరీర బరువు పెరిగేలా చేస్తుంది. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడేలా చేస్తుంది. ఫలితంగా అధిక రక్తపోటు తప్పదు. మైదాతో చక్కెర స్థాయులూ అదుపు తప్పుతాయి. ఆకలి తీరదు. తీపి పదార్థాల మీద యావ పెరుగుతుంది. భావోద్వేగాలు అదుపుతప్పుతాయి. శరీరం నిరాకారమై అనుబంధాలు దెబ్బతింటాయి.


మితం అవసరం..

మైదా తినకూడదు అని చెప్పడం తేలికే! కానీ తరచి చూస్తే, అన్ని చోట్లా మైదా ఉత్పత్తులే! పైగా ఇవి రుచిగా కూడా ఉండడంతో, వాటిని తినకుండా ఉండలేని పరిస్థితి. అయినా సరే! మైదాతో తయారైన పదార్థాలను పరిమితంగా తినక తప్పదు. ఆరోగ్యానికి హాని కలిగించే అంశాలు ఎక్కువగా, పోషకాలు తక్కువగా ఉండే కారణాన్ని బట్టి మైదాను ఆహారంలో పరిమితం చేయక తప్పదు. దీనికి ప్రత్యామ్నాయంగా దొరికే గోధుమపిండి, మొక్కజొన్న పిండి వంటి వాటిని ఎంచుకోవచ్చు. 


మైదా ఫ్రీ అవసరం..


కొన్ని స్కూళ్లలో స్నాక్‌టైమ్‌లో పిల్లలకు అందించే కుకీస్‌ మైదాతో తయారైనవే! 


ఫైవ్‌ స్టార్‌ కెఫెలు, బ్రాండెడ్‌ రెస్టారెంట్లు మైదాతో నిండిన కేక్‌లు, పేస్ట్రీలు, శాండ్‌విచ్‌లను జేబులకు చిల్లుపడే ధరల్లో వడ్డిస్తూ ఉంటాయి.


ఖరీదైన రెస్టారెంట్లలో పదార్థాలన్నీ ‘వెజ్‌’, ‘నాన్‌ వెజ్‌’, ‘స్పైసీ’... ఇలా మార్క్‌ చేసి ఉంటాయి. కానీ ‘మైదా ఫ్రీ’ అని మార్క్‌ చేసిన పదార్థాలేవీ అక్కడ కనిపించవు.


ప్రముఖ కార్పొరేట్‌ ఆఫీసుల్లో, సంస్థల్లో ఉద్యోగులకు మైదాతో తయారైన బ్రెడ్‌, బిస్కెట్లు అందుబాటులో ఉంటాయి. కానీ యాపిల్‌ వ్యవస్థాపకులు స్టీవ్‌ జాబ్స్‌ తన సంస్థలో పని చేసే ఉద్యోగులకు క్యారట్‌ జ్యూస్‌ అందుబాటులో ఉంచేవాడని బయోగ్రఫీలో చెప్పుకున్నాడు.


 - గోగుమళ్ల కవిత

Updated Date - 2020-07-05T17:23:58+05:30 IST