వ్యవసాయ విద్య ప్రమాణాలు కాపాడండి

ABN , First Publish Date - 2020-09-10T06:27:11+05:30 IST

జాతీయ స్థాయిలో పేరొందిన ఆచార్య ఎన్‌.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నేడు కునారిల్లుతున్న పరిస్థితి. రాష్ట్ర విభజనతో మౌలిక వసతులు కూడా కరువై ఎన్నో...

వ్యవసాయ విద్య ప్రమాణాలు కాపాడండి

జాతీయ స్థాయిలో పేరొందిన ఆచార్య ఎన్‌.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నేడు కునారిల్లుతున్న పరిస్థితి. రాష్ట్ర విభజనతో మౌలిక వసతులు కూడా కరువై ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది. పూర్వవైభవం కోసం అహర్నిశలు శ్రమించాల్సిన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గాని, పాలకమండలి గాని నిత్యం సంకుచిత స్వభావంతో ఆలోచిస్తూ, స్వప్రయోజనాలనే అజెండాగా మార్చుకున్నారు. ఫలితంగా అంతటా అచేతనం ఆవహించింది. దీనిలో అంతర్భాగమైన బాపట్ల వ్యవసాయ కళాశాల ఘనచరిత్ర ప్రపంచానికి తెలుసు. 75 వసంతాలు పూర్తి చేసుకోవడమే కాకుండా భారత వ్యవసాయ పరిశోధనా మండలినే తనవైపు చూసేలా ఓ మార్గదర్శిగా వెలుగొందింది. ప్రస్తుతం ఆ కళాశాల విశాలమైన తరగతి గదులు కూడా కరువైన దుస్థితిలో ఉంది.


రాష్ట్రంలో డిమాండ్‌ రీత్యా వ్యవసాయ విద్య సీట్లు పెంచారు. ప్రైవేట్‌ కళాశాలలు వచ్చాయి. వీటిలో వ్యవసాయ విద్యా ప్రమాణాలు పడిపోకుండా కాపాడాల్సిన సమయంలో విశ్వవిద్యాలయం తీసుకోవాల్సిన చొరవ తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైస్‌ఛాన్సలర్‌ డా. విష్ణువర్ధన్‌రెడ్డి ఈ అంశాలపై దృష్టి సారించాలి. విశ్వవిద్యాలయంతో పాటు బాపట్ల వ్యవసాయ కళాశాలలో మౌలిక వసతులు కల్పించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఒక తరగతి గదిలో 150 మంది కూర్చుని పాఠం వినే వీలుందా? బాలికల వసతి గృహాల పరిస్థితి గురించి సత్వర నిర్ణయం తీసుకోవల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బాపట్ల వ్యవసాయ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని మనవి చేస్తున్నాం.

కాకుమాను సాంబశివరావు

పి. శ్రీనివాసరావు

దాసరి రాంబాబు

Updated Date - 2020-09-10T06:27:11+05:30 IST