Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్పింటెక్స్‌ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

కాటన్‌ బేళ్లు, బాక్సులు అగ్నికి ఆహుతి..

రూ. 60 కోట్ల వరకూ ఆస్తినష్టం


హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌, డిసెంబరు 1 : కృష్ణాజిల్లా రేమల్లెలోని మోహన్‌ స్పింటెక్స్‌ ఇండియా లిమిటెడ్‌ కర్మాగారంలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోడౌన్‌లో ఉంచిన కాటన్‌ బేళ్లు, బాక్సులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ. 60 కోట్ల మేరకు ఆస్తినష్టం జరిగినట్టు అధికారుల అంచనా వేస్తున్నారు. మంటలను ఆర్పేందుకు విజయవాడ, నూజివీడు, గుడివాడ, హనుమాన్‌జంక్షన్‌ నుంచి 7 అగ్నిమాపకశకటాలు రాగా.. సిబ్బంది సాయంత్రం 4 గంటలకు మంటలను ఆదుపు చేయగలిగారు. స్పింటెక్స్‌ యూనిట్‌-3లో ఉదయం 7 గంటలకు మంటలను గుర్తించిన సిబ్బంది అగ్నిమాపక కేంద్రానికి సమాచారమందించారు.  జిల్లా ఫైర్‌ అఫీసర్‌ ధర్మారావు, రీజనల్‌ ఫైర్‌ అఫీసర్‌ శ్రీనివాసరావు ఘటనాస్థలికి చేరుకుని గోడౌన్‌ గోడలను యంత్రాలతో బద్దలు కొట్టించి, అందులో బేళ్లను వేరుచేశారు. ఫ్యాక్టరీ పక్కన గల చెరువులో 3 మోటార్లను బిగించి ఆ నీటితో అగ్నికీలలను సాయంత్రానికి అదుపు చేయగలిగారు. అప్పటికే గోడౌన్‌-3లో 7500 కాటన్‌ బేళ్లు, 2000 కాటన్‌ యార్న్‌ బాక్సులు పూర్తిగా కాలిపోయాయి. ప్రక్కనే గల యూనిట్‌ -2కు మంటలు వ్యాపించకుండా స్ర్పింక్లర్లతో నీరు వెదజల్లేలా చర్యలు తీసుకున్నారు.


డీఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షణలోహనుమాన్‌జంక్షన్‌ సీఐ సతీష్‌, వీరవల్లి ఎస్సై సుబ్రమణ్యం ఎటువంటి ప్రాణహాని జరుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న ఎండీ సుధాకర్‌చౌదరి, డైరెక్టర్‌ రవికుమార్‌ సహాయక చర్యల్లో అగ్నిమాపక సిబ్బందికి సహకరించారు. అగ్నికి ఆహుతి అయిన కాటన్‌ బేళ్లు, యార్న్‌ బాక్సుల విలువ 40 కోట్ల వరకూ ఉంటుందని, యంత్రాలు, ఇతర సామగ్రి, గోడౌన్‌ విలువతో కలిపి 60 కోట్ల రూపాయలకు పైగా అస్తినష్టం సంభవించిందని ఫ్యాక్టరీ ప్రతినిధులు తెలిపారు.  ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. 

Advertisement
Advertisement